వంట నూనెలకు రైతు బజార్లలో అదనపు కౌంటర్లు

16 Mar, 2022 05:11 IST|Sakshi

చౌకధరల దుకాణాలు, మొబైల్‌ వ్యాన్ల ద్వారా విక్రయం

నిర్దేశిత ధరలకే అమ్మాలని అధికారులకు సీఎస్‌ ఆదేశం

పరిమితికి మించి ఉన్న నిల్వలను స్వాధీనం చేసుకొని మార్కెట్లో అమ్మండి

అధిక ధరలు, అక్రమ నిల్వలపై కేసులు నమోదు చేయండి

రాష్ట్ర స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ రోజూ ధరలను సమీక్షించాలి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంట నూనెల ధరలను నిర్దేశిత ఎమ్మార్పీ ధరలకు అమ్మాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)డాక్టర్‌ సమీర్‌ శర్మ ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వంట నూనెలపై సీఎస్‌ అధ్యక్షతన ప్రైస్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ సన్‌ ఫ్లవర్, వేరుశనగ, పామాయిల్‌ నూనెలు ఎమ్మార్పీకే ప్రజలకు అందాలని చెప్పారు. ధరల నియంత్రణకు మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కింద వివిధ రైతు బజార్లలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని, చౌక ధరల దుకాణాల్లో కూడా నూనెలు విక్రయించాలని ఆదేశించారు.

స్వయం సహాయక బృందాలు, మొబైల్‌ వాహనాల ద్వారా కూడా నూనెలు అమ్మాలని చెప్పారు. హోల్‌ సేల్‌ డీలర్లు, మిల్లర్లు, రిఫైనరీదారులు, సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్, స్టాకిస్టులు కేంద్ర ప్రభుత్వ వెబ్‌ పోర్టల్‌కు లోబడి స్టాకు పరిమితిని పాటిస్తున్నారో లేదో తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా అక్రమ స్టాకు గుర్తిస్తే దానిని స్వాధీనం చేసుకుని బహిరంగ మార్కెట్లోకి వెంటనే విడుదల చేసి తక్కువ ధరకు అమ్మాలని చెప్పారు. రాష్ట్రస్థాయి టాస్క్‌ ఫోర్సు కమిటీ ప్రతి రోజు సమావేశమై వంట నూనెల ధరలను సమీక్షించాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్, డీఎస్‌వోల నేతృత్వంలో నిఘా పెట్టి అక్రమంగా నిల్వ చేసే వారిపై 6ఎ కేసులు నమోదు చేసి స్టాకును స్వాధీనం చేసుకోవాలని సీఎస్‌ ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూదన్,  రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్, ఈవో కార్యదర్శి గిరిజా శంకర్, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వంట నూనెల ధరల నియంత్రణకు కమిటీ
రాష్ట్రంలో వంట నూనెల ధరలను అదుపు చేసేందుకు మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ప్రత్యేక కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్, లీగల్‌ మెట్రాలజీ కంట్రోలర్, వ్యవసాయ–మార్కెటింగ్‌ శాఖ కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్, రాష్ట్ర సివిల్‌ సప్లైస్‌ ఎండీ, ఏపీ ఆయిల్‌ఫెడ్‌ ఎండీ, రైతు బజార్ల సీఈవో, సివిల్‌ సప్లైస్‌ డైరెక్టర్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ కమిటీ ఏప్రిల్‌ 15 వరకు ప్రతిరోజు వంట నూనెల ధరలను సమీక్షించి, సంబంధిత విభాగాల అధికారులకు సూచనలిస్తుందని పేర్కొంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దీంతో స్థానిక మార్కెట్లలో ధరలను పెంచాల్సిన అవసరం లేదు. అయినా కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక రేట్లకు విక్రయిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది. వ్యాపారులు, డీలర్ల వద్దనున్న పాత నిల్వలను పాత ధరలకే అమ్మాలని, నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. 

మరిన్ని వార్తలు