దూసుకెళ్తున్న ఓటీటీ.. డబ్బులే డబ్బులు

27 Jan, 2021 04:19 IST|Sakshi

‘ఓటీటీలకే’ వీక్షకుల ఓటు

వీక్షకుల సంఖ్య 35.50కోట్లకు.. వార్షిక టర్నోవర్‌ రూ.4,500 కోట్లకు చేరిక 

ఈవై ఫిక్కీ ఇండియన్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ నివేదిక వెల్లడి 

సాక్షి, అమరావతి: ఓటీటీ (ఓవర్‌ ద టాప్‌)... వినోద రంగం జపిస్తున్న మంత్రమిది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, టాక్‌ షోలు.. ఇలా అన్నింటికీ ప్రస్తుతం అనువైన వేదిక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లే. ఆధునిక సమాచార సాంకేతిక విప్లవం అరచేతిలోకి తీసుకువచ్చిన ఈ వేదిక ప్రస్తుతం వినోద రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దేశంలో 30కు పైగా ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ఆదాయం ఏకంగా రూ.4,500 కోట్లకు చేరడం విశేషమని ఈవై ఫిక్కి ఇండియన్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ తాజా నివేదిక పేర్కొంది. దేశంలో మారుమూల పల్లెల వరకూ విస్తరించిన ఇంటర్నెట్‌ సౌకర్యం.. స్మార్ట్‌ఫోన్ల విప్లవం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఎంతగానో కలిసివచ్చింది. కరోనా వల్ల ప్రజలు జనసమ్మర్థ ప్రదేశాలకు వెళ్లడం తగ్గించడం కూడా అందుకు మరో కారణం. ఈ నేపథ్యంలో దేశంలో ఓటీటీ  ప్లాట్‌ఫామ్‌లకు ఆదరణ అమాంతంగా పెరుగుతోంది. 

తాజా నివేదికలోని ప్రధాన అంశాలివీ.. 
► దేశంలో 30కు పైగా ఉన్న ఓటీటీల ఆదాయం 2020 చివరి నాటికి ఏకంగా రూ.5 వేల కోట్లకు చేరుకుంది. 2017లో రూ.2,019 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.4,500 కోట్లకు చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2022 నాటికి రూ.5,560 కోట్లకు చేరుతుందని అంచనా.  
► ఓటీటీల  ఆదాయంలో ‘డిమాండ్‌ ఆన్‌ వీడియో (ఎస్‌వీఓడీ)ల ద్వారానే 70 శాతం వస్తోంది.  
► దేశంలో 2020 నాటికి ఇంటర్నెట్‌ వాడుతున్న వారి సంఖ్య దాదాపు 55 కోట్లకు చేరింది.  
► 2017లో 25 కోట్లు ఉన్న స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు 2020 డిసెంబర్‌ నాటికి 50 కోట్లకు చేరుకున్నారు. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వీక్షకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2020 డిసెంబర్‌ నాటికి దేశంలో ఓటీటీ వేదికల వీక్షకుల సంఖ్య 35.50 కోట్లకు చేరింది.  
► 2019తో పోలిస్తే 2020లో ఓటీటీ వీక్షకులు 35 శాతం పెరిగారు. వీరిలో 60శాతం మంది 18 ఏళ్ల నుండి 35 ఏళ్లలోపు వారే ఉన్నారు. 
► ఓటీటీలలో 40 శాతం ప్రాంతీయ భాషల కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. దేశంలో ఓటీటీ వేదికల ద్వారా ఇంగ్లిష్‌ కార్యక్రమాల వీక్షకులు కంటే హిందీ, ఇతర ప్రాంతీయ భాషల కార్యక్రమాల వీక్షకులు రెండున్నర రెట్లు అధికంగా ఉన్నారు.   

మరిన్ని వార్తలు