కన్నీళ్లు తెప్పించే ఘటన.. ‘సినీ గాడ్‌ఫాదర్‌’ను కళ్లారా చూడాలని.. ఇంతలోనే

30 Sep, 2022 09:18 IST|Sakshi
నేత్రదానం చేస్తున్న రాజశేఖర్‌ కుటుంబ సభ్యులు

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: మెగాస్టార్‌ చిరంజీవి అంటే నిలువెల్లా ఆ యువకుడికి అభిమానం. కళ్లారా చూడాలన్న తాపత్రయం. సినీ గాడ్‌ఫాదర్‌ను హైదరాబాద్‌ వెళ్లి చూసే అవకాశం ఎలాగూ ఉండదు. బుధవారం అనంతపురం వస్తున్నారని తెలిసి.. మిత్రుడిని వెంటబెట్టుకొని గుత్తి నుంచి ద్విచక్ర వాహనంపై ఆత్రంగా బయల్దేరాడు. మరో పదినిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటాడు. అంతలోనే గార్లదిన్నె వద్ద మృత్యువు అతన్ని ప్రమాద రూపంలో కబళించింది.
చదవండి: గాడ్‌ఫాదర్‌ ఈవెంట్‌.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే?  

అయితేనేం అభిమానం “చిరంజీవి’గా వెలుగునివ్వాలని అతని కుటుంబ సభ్యులు భావించారు. నేత్రాలను దానం చేస్తే.. మరో ఇద్దరి జీవితాల్లో  వెలుగునిస్తాడని భావించారు. అనుకున్నదే తడవుగా నేత్రాలను దానం చేశారు. గుత్తి పట్టణానికి చెందిన రాజశేఖర్‌ (22) కళ్లను అతని కుటుంబ సభ్యులు సాయిట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి ద్వారా నేత్రాలను గురువారం సేకరించారు. కళ్లను సేకరించిన వారిలో సాయిట్రస్ట్‌ సభ్యులు విజయసాయి, నారాయణ, ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రి టెక్నీషియన్‌ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు