అవ్వాతాతల కంటికి వెలుగు

9 Nov, 2020 03:27 IST|Sakshi

అవ్వాతాతలకు ఈనెల 2 నుంచి మళ్లీ ప్రారంభమైన కంటి పరీక్షలు 

కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఒకేసారి రెండు దశల పరీక్షలు

సాక్షి, అమరావతి: అవ్వాతాతలకు కంటి పరీక్షలు మళ్లీ మొదలయ్యాయి. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఈనెల రెండోతేదీ నుంచి కంటి పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా 60 ఏళ్ల అవ్వాతాతల కంటిచూపు గురించి ఆలోచించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వారికి నేత్రపరీక్షలు చేయించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 56,88,424 మంది అవ్వాతాతలకు వారి గ్రామ, వార్డుల్లోనే వైఎస్సార్‌ కంటివెలుగు మూడోవిడత కింద కంటి పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 18న కర్నూలులో సీఎం జగన్‌ ప్రారంభించారు. కోవిడ్‌–19 లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి నెలాఖరు నుంచి ఈ పరీక్షలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమాన్ని కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఈనెల 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ ప్రారంభించారు. గ్రామ, వార్డుల్లో కాకుండా పీహెచ్‌సీలు, వైద్యసంస్థల్లో అవ్వాతాతలకు కంటి పరీక్షలు చేస్తున్నారు. తొలి, మలివిడత పరీక్షలు సమాంతరంగా చేయడం ప్రారంభించారు. తొలివిడత ప్రాథమికంగా పరీక్షిస్తారు. దాన్లో మళ్లీ పరీక్షించాలని తేలితే అక్కడే కంట్లో చుక్కలమందు వేసి రెండోసారి పరీక్షిస్తున్నారు. రెండోసారి పరీక్షలో అద్దాలు ఇవ్వాలని గుర్తిస్తే అద్దాలు రాయడమే కాకుండా వాటిని తయారు చేయడానికి ఆర్డర్‌ను కూడా ఇచ్చారు. శస్త్రచికిత్స అవసరమైన వారిని ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు పంపించే ఏర్పాట్లు చేశారు.

33,222 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తింపు
కోవిడ్‌–19 ప్రభావం రాకముందు 3.06 లక్షలమంది అవ్వాతాతలకు కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో అవసరమైన 90,773 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. 33,222 మందికి శస్త్రచికిత్స, 3,501 మందికి ఇతర చికిత్స అవసరమని గుర్తించారు. ఇప్పటికే 6,473 మందికి శస్త్రచికిత్సలు చేశారు.  మిగిలినవారికి కూడా కోవిడ్‌–19 నిబంధనలు పాటిస్తూ వీలైనంత త్వరగా శస్త్రచికిత్సలు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వీరికి శంకర నేత్రాలయం, ఎల్‌వీ ప్రసాద్‌ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయిస్తున్నామని వైఎస్సార్‌ కంటివెలుగు నోడల్‌ ఆఫీసర్‌ హైమావతి చెప్పారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు