దిగొచ్చిన మాస్కుల ధరలు

8 Aug, 2021 03:20 IST|Sakshi

సాక్షి, అమరావతి: మాస్క్‌లు, పీపీఈ కిట్ల ధరలు దిగొచ్చాయి. కరోనా వచ్చిన తొలి రోజుల్లో వీటి కోసం నానా అగచాట్లు పడాల్సి వచ్చేది. ఒక దశలో సర్జికల్‌ మాస్క్‌ను రూ.13 పెట్టి కొనుగోలు చేసిన పరిస్థితి. ఇప్పుడది అక్షరాలా రూపాయి పావలా కంటే తక్కువకు దిగొచ్చిందంటే.. మాస్క్‌లను ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఏ స్థాయిలో వచ్చాయో అంచనా వేయొచ్చు. కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న వార్తల నేపథ్యంలో మాస్క్‌లు, పీపీఈ కిట్లు తదితర వాటికి ఏపీఎంఎస్‌ఐడీసీ(రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలిచింది. ఈ టెండర్‌లో ధరలు భారీగా దిగొచ్చాయి. ఎప్పటికప్పుడు రేట్లు తగ్గుతున్న కొద్దీ కొత్తగా టెండర్లు పిలవడం, తగ్గిన ధరలకు కొనడంతో ప్రభుత్వానికి వ్యయం భారీగా తగ్గుతోంది. 

పీపీఈ రూ.600 నుంచి రూ.222కు 
కరోనా మొదటి వేవ్‌లో ఒక్కో పీపీఈ కిట్‌ను రూ.600కు కూడా కొనుగోలు చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడది కేవలం రూ.222కే దొరుకుతోంది. దీనికంటే ముందు పిలిచిన టెండర్‌లో రూ.291గా ఉండేది. పీపీఈ కిట్ల టెండర్‌లో ఏడు సంస్థలు పాల్గొన్నాయి. ఎల్‌–1(లోయెస్ట్‌–1) రూ.222 కాగా, ఎల్‌–7 రూ.261కి వేశారు. అలాగే ఎన్‌–95 మాస్క్‌లకు ఒకప్పుడు భలే గిరాకీ ఉండేది. ఒక్కో మాస్క్‌ రూ.140కి కూడా కొనాల్సి వచ్చింది.

తాజా టెండర్‌కు ముందు వరకూ ఇదే ఎన్‌–95 మాస్క్‌ ధర రూ.19.37గా ఉంది. తాజాగా టెండర్‌లో మొత్తం 8 సంస్థలు పాల్గొనగా.. ఎల్‌–1 రూ.5.91కి వేసింది. కోవిడ్‌ వచ్చిన కొత్తలో మూడు పొరల సర్జికల్‌ మాస్క్‌ను రూ.13కు కొనుగోలు చేయాల్సి వచ్చేది. అప్పట్లో తయారీ కంపెనీలు లేకపోవడం, ముడి సరుకు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తాజా టెండర్‌లో 20 కంపెనీలు పాల్గొన్నాయి. వీటిలో ఎల్‌–1 కేవలం రూ.1.22కే వేసింది. అలాగే రాష్ట్రంలో వ్యాక్సిన్‌ ప్రక్రియ శరవేగంగా జరుగుతుండటంతో ఏడీ(ఆటో డిసబుల్‌) సిరంజిలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. తాజాగా కోటి సిరంజిల కోసం టెండర్‌ పిలవగా ఒక్కో సిరంజి రూ.3.90కే వచ్చింది.  

మరిన్ని వార్తలు