క్షేత్రస్థాయి ఉద్యోగులకు బయోమెట్రిక్‌లో వెసులుబాటు

23 Dec, 2021 04:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగ సంఘాలకు అజయ్‌జైన్‌ హామీ 

ప్రొబేషనరీ సహా సమస్యలపై నేతలతో చర్చ 

ఇకపై ప్రతి మూడు నెలలకొకసారి సమావేశం  

సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయి విధులకు హాజరయ్యే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ విషయంలో కొంత వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ప్రొబేషనరీ సహా ఉద్యోగుల ఇతర సమస్యలపై చర్చించేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ బుధవారం పలు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించింది. విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, డైరెక్టర్‌ షాన్‌మోహన్‌లతోపాటు ఆరు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అర్హులైన సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ ప్రకటన ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, వీలైనంత త్వరలో పూర్తవుతుందని అజయ్‌జైన్‌ తెలిపారు.  

ప్రత్యేక సందర్భాల్లో వెసులుబాటు 
సచివాలయాల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు ఉదయాన్నే క్షేత్ర స్థాయిలో విధులకు హాజరు కావాల్సి ఉంటుందని సంఘాల నేతలు ఈ సందర్భంగా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. బయోమెట్రిక్‌ హాజరు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఏఎన్‌ఎంలతో పాటు ప్రత్యేకించి వ్యవసాయ అసిస్టెంట్, సర్వేయర్‌ తదితర క్షేత్రస్థాయి విధులలో పాల్గొనే ఉద్యోగులు సంబంధిత రోజుల్లో ఉదయమే కచ్చితంగా బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ నమోదు చేయాల్సిన అవసరం లేదని, అయితే అలాంటి రోజుల్లో ఆయా ఉద్యోగులు సాయంత్రం 3–5 గంటల మధ్య తప్పనిసరిగా హాజరై వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు బయోమెట్రిక్‌ వేసేలా వెసులుబాటు కల్పిస్తామని అజయ్‌ జైన్‌ ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు.

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏఎన్‌ఎం లాంటి ఉద్యోగులు సాయంత్రం పూట ప్రసూతి విధులకు హాజరైతే అన్‌డ్యూటీకి అనుమతిస్తామని హామీ ఇచ్చారు. గ్రేడ్‌–5 గ్రామ కార్యదర్శులకు పూర్తి స్థాయిలో అధికారులు కల్పించే అంశంతో పాటు ఉద్యోగుల జాబ్‌ చార్టు రూపొందించని సెరికల్చర్‌ అసిస్టెంట్‌ తదితరులపై శాఖాధిపతులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వ అనుమతి తీసుకొని డిజిటల్‌ అసిస్టెంట్‌ కేటగిరి ఉద్యోగుల పేరును డిజిటల్‌ సెక్రటరీగా మార్పు చేస్తామని హామీ ఇచ్చారు.  

ప్రతి మూడు నెలలకు భేటీ.. 
ప్రతి మూడు నెలలకొకసారి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్టు అజయ్‌జైన్‌ చెప్పారు.   

ప్రమోషన్‌ చానల్‌పై స్పష్టత కోరాం 
ఉద్యోగుల ప్రమోషన్‌ చానల్‌ను స్పష్టం చేయాలని సమావేశంలో కోరినట్లు  గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ అంజనరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని శాఖలకు ఇప్పటికీ సర్వీస్‌ రూల్స్‌ లేని విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చామన్నారు. సెరికల్చర్, ఏఎన్‌ఎం, మహిళా పోలీస్‌ కేటగిరీ ఉద్యోగాలకు  సంబంధించి సర్వీస్‌ రూల్స్‌ వెంటనే రూపొందించాలని కోరామన్నారు. కోవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగ అవకాశం క    ల్పించాలని కోరామన్నారు. 

మరిన్ని వార్తలు