Fact Check: ఎస్సీ, ఎస్టీలకు నిజంగా మేలు చేసిందెవరు?

24 Jan, 2023 05:11 IST|Sakshi

ఈ మూడున్నరేళ్లలోనే ఎంతో లాభం

ఎస్సీ, ఎస్టీలకు నిజమైన ‘ఉపకారం’ ఈ కాలంలోనే.. 

మీ బాబుకు మించి సీఎం జగన్‌ మేలుచేశారు 

2014–19 మధ్య ఎస్సీలకు రూ.33,625 కోట్లు, ఎస్టీలకు 12,487 కోట్లు మాత్రమే ఖర్చు 

అదే ఈ మూడున్నరేళ్లలో ఎస్సీలకు రూ.48,899 కోట్లు, ఎస్టీలకు రూ.15,589.38 కోట్లు ఖర్చు 

2017–18 నుంచి ఉప ప్రణాళికను ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్‌గా మార్చిన కేంద్రం

ఇవన్నీ దాచి.. ఎప్పటిలాగే వాస్తవాలు వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పైనా రామోజీ రోత రాతలు

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధిపరంగా నిజంగా మేలు చేసిందెవరు? అని ఆ వర్గాల వారిని ఎవరైనా ప్రశ్నిస్తే.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని ఠక్కున సమాధానం వస్తుంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలకు చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో జరగని మేలు జగన్‌ నేతృత్వంలో మూడున్నరేళ్లలో అంతకుమించి జరిగిందన్నది జగమెరిగిన సత్యం. అప్పట్లో బాబు కేటాయించిన నిధులు.. నేడు సీఎం జగన్‌ ఖర్చుచేస్తున్న మొత్తం గణాంకాలను గమనిస్తే గతానికన్నా ఎంతో మేలు జరిగిందన్నది స్పష్టంగా అర్ధమవుతుంది.

కానీ, ఇవేమి పరిగణలోకి తీసుకోని ఈనాడు విషపత్రిక ఎప్పటిలాగే వాస్తవాలను వక్రీకరించింది. ఈసారి ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్‌ (సబ్‌ప్లాన్‌)పై తన కడుపుమంటను ప్రదర్శించింది. సబ్‌ప్లాన్‌ను మరో పదేళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌పై ఆ వర్గాలకు చెందిన నేతలు, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తంచేస్తుంటే రామోజీ మాత్రం ఎప్పటిలాగే తన అక్కసును వెళ్లగక్కారు.

ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘పేరుకే చట్టం.. ఎన్నేళ్లున్నా ఏం లాభం?’ అంటూ ఈనాడు మరో అభూతకల్పనను వండివార్చింది. వాస్తవానికి.. 2017–18 నుంచి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం కారణంగా బడ్జెట్లో ప్రణాళిక, ఉపప్రణాళిక అన్న పదాలేలేవు. సబ్‌ప్లాన్‌ను కాంపొనెంట్‌గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. దీంతో ఎస్సీ కాంపొనెంట్, ఎస్టీ కాంపొనెంట్‌గా కేటాయింపులు జరుగుతున్నాయి. అలాగే, ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, వారి కార్యక్రమాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తోంది.

బాబు చేస్తే ఒప్పు.. జగన్‌ చేస్తే తప్పు 
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఏ రకంగా చూసినా ఎస్సీ, ఎస్టీలు గత మూడున్నరేళ్లుగా అత్యధిక లబ్ధిపొందరానేది సుస్పష్టం. అర్హతే ప్రామాణికంగా అత్యంత పారదర్శకంగా పథకాలను అమలుచేస్తోంది. వివిధ సామాజిక పెన్షన్ల కోసం ఎస్సీ, ఎస్టీలకు చేస్తున్న ఖర్చును ఉప ప్రణాళికలో చూపించడాన్ని తప్పు అంటూ ‘ఈనాడు’ గుండెలు బాదుకుంది. కానీ, నిజమేమిటంటే.. 2019 జూన్‌కు ముందున్న టీడీపీ ప్రభుత్వం కూడా సామాజిక పెన్షన్లు,  దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లు, మధ్యాహ్న భోజనం కోసం చేసిన ఖర్చులన్నింటినీ ఎస్సీ, ఎస్టీల ఉపప్రణాళికలో ఒక భాగంగానే చూపించిన విషయాన్ని పాపం వృద్ధ రామోజీకి గుర్తున్నట్లులేదు.

అంతేకాదు.. మా ఇంటిమహాలక్ష్మి, పిల్లలకు–తల్లులకు ఇచ్చే పౌష్టికాహారం, అన్న అమృతహస్తం, చంద్రన్న పెళ్లికానుక, ఎన్టీఆర్‌ సుజలస్రవంతి, డ్వాక్రా మహిళలకు ఇచ్చే శానిటరీ నాప్కిన్స్, చంద్రన్న రైతు క్షేత్రాలు, పొలంబడి, జవహర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ మెంటార్లకు ఇచ్చే గౌరవ వేతనాలు సైతం గత ప్రభుత్వం సబ్‌ప్లాన్‌లో భాగంగానే చూపిన విషయం మర్చిపోతే ఎలా రామోజీ.. అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు అంటే ఎలా?

మూడున్నరేళ్లలోనే ఐదేళ్లకు మించిన మేలు 
ఇక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును గమనిస్తే చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో కేటాయించిన నిధుల­కు మించి ఈ మూడున్నరేళ్లలోనే జరిగిందన్నది గణాంకాలే చెబుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం వీరికోసం చేసిన ఖర్చు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. గత ప్రభుత్వం 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 వరకు ఎస్సీ ఉపప్రణాళిక కోసం రూ.33,625.49 కోట్లు కేటాయిస్తే... ప్రస్తుత ప్రభుత్వం 2019–20 నుంచి 2022 డిసెంబర్‌ వరకు మూడున్నరేళ్లలో రికార్డు స్థాయిలో రూ.48,899.66 కోట్లు ఖర్చుచేసింది.

అంటే.. టీడీపీ కేటాయించిన మొత్తానికంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలోనే ఏకంగా రూ.15,274.17 కోట్లు అదనంగా కేటాయించింది. ఇక ఎస్టీల కోసం చేసిన ఖర్చుచూస్తే.. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.12,487.48కోట్లు ఖర్చుచేస్తే, ప్రస్తుత ప్రభుత్వం మూడున్నరేళ్లలో రూ.15,589.38 కోట్లు వెచి్చంచింది. ఇవేమి పరిశీలించకుండానే రామోజీ మనసు 20 శాతం నిధులు కోత అంటూ తెగ బాధపడిపోయింది. 

ఎస్సీలకు లబ్ధిలో మనమే నెంబర్‌–1  
ఎస్సీ కాంపొనెంట్‌ అమలులో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.  
దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్‌ ద్వారా మొత్తం 37.64 లక్షల మందికి మేలు జరిగితే అందులో ఒక్క ఏపీలోనే 35.92లక్షల మందికి లబ్ధిచేకూరింది.  
అలాగే, ఎస్సీ కాంపొనెంట్‌ ద్వారా కొత్తగా దేశంలో 12.41 లక్షల స్వయం సంఘాలు ఏర్పాటుచేస్తే ఒక్క ఏపీలోనే ఏకంగా 8.54 లక్షల సంఘాలు ఏర్పాటయ్యాయి.  
ఇది మనం చెబుతున్నది కాదు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదిక స్పష్టంచేసింది రామోజీ.. 

గిరి బిడ్డలపైనా ప్రత్యేక శ్రద్ధ..
మరోవైపు.. ఎస్టీ సబ్‌ప్లాన్‌ను కూడా వైఎస్సార్‌సీపీ సర్కారు పటిష్టంగా అమలుచేస్తూ గిరిజనులపైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది.
రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజనలో గిరిజనులకు రెండు జిల్లాలు కేటాయించి అల్లూరి సీతారామరాజు (ఏఎస్‌ఆర్‌), పార్వతీపురం మన్యం జిల్లాలను ఏర్పాటుచేసింది.  
ఆర్వోఎఫ్‌ఆర్‌ చట్టం ప్రకారం మొత్తం 4.49 లక్షల ఎకరాల భూమిని 2.22 లక్షల మంది ఎస్టీ రైతులకు అందించింది.  
దీంతోపాటు 39,272 ఎకరాల డీకేటీ భూమిని 26,287 మంది ఎస్టీ పేద రైతులకు పంపిణీ చేశారు.  
అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి కనీసం రెండెకరాల భూమి ఉండేలా చూడాలని భావించిన సీఎం జగన్‌ ఆ దిశగా విప్లవాత్మక చర్యలు చేపట్టారు.  
ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఒక్కటిగా ఉంటే ఇబ్బందని భావించి షెడ్యూల్డ్‌ తెగల కోసం ప్రత్యేక రాష్ట్ర కమిషన్‌ను ఏర్పాటుచేసింది.  
ఏఎస్‌ఆర్‌ జిల్లా పాడేరులో గిరిజన వైద్య కళాశాలను రూ.500 కోట్లతో మంజూరు చేసి సీఎం ఇప్పటికే శంకుస్థాపన చేశారు.  
పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం వద్ద రూ.153.85 కోట్లతో గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాలకూ శంకుస్థాపన చేశారు.   

మరిన్ని వార్తలు