Fact Check: పేదల ఇళ్లపై కుళ్లు రాతలేలా?

13 Feb, 2024 05:58 IST|Sakshi

పేదలకు మేలు జరుగుతుంటే రామోజీ ఓర్వలేనితం 

దేశ చరిత్రలోనే తొలిసారి పేదల ఇళ్లకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్  

ఇప్పటికే 8 లక్షల మంది స్వయంగా వచ్చి రిజిస్ట్రేషన్  

రాష్ట్రంలో 17 వేల లేఅవుట్లలో 30.61 లక్షల మందికి నివాసాలు 

ఒక్కో లేఅవుట్‌ ఒక్కో ఊరిగా తయారైంది 

ప్లాట్‌ గుర్తింపునకు జియో ట్యాగ్‌ 

కళ్లముందు వాస్తవాలు కనిపిస్తున్నా.. లేదులేదంటూ రామోజీ దుష్ప్రచారం

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఒకేసారి 30 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల స్థలాలను అప్పగించడం... వాటికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేస్తుండడం పెత్తందారు రామోజీరావుకు మింగుడు పడటంలేదు. నిరుపేదలు సొంతింట్లో ఉండటాన్ని జీర్ణించుకోలేక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై తన వంకర రాతలతో బురదజల్లి అలిసిపోయాడు. ఇక మిగిలిందల్లా ఆ ఇళ్ల స్థలాలకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తుండడాన్ని కూడా మాయాజాలమంటూ తప్పుడు రోత రాతలు రాస్తోంది.

దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 30 లక్షలకు పైగా పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతూ నిరుపేదల సొంతింటి కలను సీఎం జగన్‌ సాకారం చేస్తుండడాన్ని, ఆ ఇళ్లను ఒక విలువైన ఆస్తిగా పేదలకు ఇచ్చేందుకు రిజిస్ట్రేషన్ చేయడాన్ని తప్పు పడుతూ ప్రజలను, నిరుపేదలు ఆందోళన చెందేలా ప్రయత్నాలు చేస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’పథకం కింద వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో ఏకంగా 17,005 ఊళ్లను కొత్తగా నిర్మించడం వారి కళ్లకు కనిపించడంలేదు. ఒక్కో కాలనీ ఒక్కో ఊరుగా మారుతున్నా ఆ పత్రికకు కనిపించదు.

ఒక్కో పేదింటి అక్కచెల్లెమ్మ పేరిట ఇంటి రూపంలో రూ.20 లక్షల వరకూ విలువైన స్థిరాస్తి సమకూరుస్తుంటే ఈనాడుకు ముచ్చెమటలు పడుతున్నాయి. పేదలకు ఇంత పెద్దమేలు జరుగుతుండడం ద్వారా వైఎస్సార్‌సీపీకి ఆదరణ పెరుగుతుండడం.. అదే సమయంలో చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్తు కనుచూపు మేరలో కనిపించకపోవడంతో రామోజీరావు గంగవెర్రిలెత్తిపోతున్నారు. దీంతో ఏదో రకంగా బాబుకు మేలు చేయాలని దింపుడు కళ్లెం ఆశతో వైసీపీ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సేవలపైనా నిత్యం వక్రీకరించడమే విధిగా పెట్టుకున్నారు. 

జియో ట్యాగ్‌ ఉంటే ప్లాట్లు గుర్తించడం కష్టమెలా అవుతుంది? 
ప్లాట్‌ ఎక్కడ ఉందో గుర్తించలేని స్థితిలో లబ్ధిదారులు ఉన్నారనడం పచ్చి అబద్ధం. ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడే ప్లాట్లు విభజన చేసి సరిహద్దు రాళ్లు వేశారు. లబ్ధిదారులను వారి ప్లాట్లలో ఫోటోలు తీసుకుని జియోట్యాగ్‌ కూడా చేశారు. ప్లాటులో నిలబడి ఫోటో దిగడం ద్వారా లబ్ధిదారులకు వారి ప్లాటు ఎక్కడ ఉందో తెలుసు. ’పచ్చ‘పాతంతో చూసే ఈనాడుకు ఇవేమీ కనిపించవు.

కేటాయించిన ప్లాట్‌లో ఫోటో దిగి జియోట్యాగ్‌ చేయడమంటే వారి ప్లాట్‌ ఎక్కడ ఉందో తెలుసనే కదా? ఇది పేదలను బురిడీ కొట్టించే పన్నాగం ఎలా అవుతుంది..? గుంటూరు జిల్లాలో పేరేచర్ల లేఅవుట్‌లో 9,219 ఇళ్లను మంజూరు చేశారు. ఇంకా 6,152 ఇళ్ళకు సంబంధించి రెండవ విడత గృహ నిర్మాణ కార్యక్రమంలో ఇళ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే మంజూరైన ఇళ్లలో 1,230 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా, 486 రూఫ్‌ స్థాయిలోనూ, మిగతావి బేస్‌మెంట్‌ స్థాయిలోనూ ఉన్నాయి. మూడవ ఆప్షన్‌ కింద ఇళ్ల నిర్మాణానికి పదిమంది కాంట్రాక్టర్లను నియమించి, మూడు ఇటుక తయారీ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ లేఅవుట్‌లో ప్రతిరోజు సుమారు వెయ్యి మంది కార్మికులు పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ వాస్తవాలను చూడని ఈనాడు ప్రభుత్వంపై ఆక్రోశంతో విషం చిమ్ముతూ తన దిగజారుడుతనానికి ప్రదర్శించుకుంటోంది.     

రిజిస్ట్రేషన్ చేయడం మాయాజాలమా? 
పేదలందరికీ స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌ 31 లక్షల 19 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అందులో 22 లక్షల ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను రిజిస్ట్రేషన్ చేయడం వల్ల బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి రుణం తెచ్చుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. ప్రభుత్వమే ఆయా రిజిస్ట్రేషన్లను చేస్తుంది కాబట్టి బ్యాంకులు రుణం మంజూరు చేస్తాయి. డాక్యుమెంట్‌ రిజిస్టర్‌ అయి ఉంటుంది కాబట్టి డేటా బేస్‌లో ఆ వివరాలన్నీ పదిలంగా ఉంటాయి.

ఎప్పుడంటే అప్పుడు సర్టీఫైడ్‌ కాపీ పొందడానికి అవకాశం ఉంటుంది. ఫోర్జరీ చేస్తారని గానీ, ట్యాంపర్‌ చేస్తారని గాని భయం ఉండదు. అమ్మే సమయంలో ఆ డాక్యుమెంట్‌ ఉంటే సరిపోతుంది. ఎటువంటి లింకు డాక్యుమెంట్లు అవసరం లేదు. నేరుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. పేదలకు లబ్ధి చేకూరే రిజిస్ట్రేషన్‌ మాయాజాలం అవుతుందా? ఇప్పటికే 8 లక్షల మంది లబ్ధిదారులు తమ పేరున పట్టాలను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మొదటి దశలో కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గొడవర్రులో మొదటి దశ ఒకటవ లేఅవుట్‌లో 53 ఎకరాల 33 సెంట్లు 345 మంది లబ్ధిదారులకు, రెండో లేఅవుట్‌లో 29 ఎకరాల 66 సెంట్లు భూమిలో 777 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రైవేట్‌ అధీనంలో ఉన్న భూమిని రూ.43.93 కోట్లతో కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన భూమిని విజయవాడ మున్సిపల్‌ అధికారులకు లేఅవుట్‌ అభివృద్ధి కోసం అప్పగించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు