తుప్పల్లో టెంకాయ్‌.. మా బాబే!

25 Jun, 2022 08:13 IST|Sakshi
టీసీఎల్‌ కంపెనీకి శంకుస్థాపన చేస్తున్న చంద్రబాబు (ఫైల్‌)

టీసీఎల్‌ విషయంలో సిగ్గు పడాల్సింది ఎవరు?

కేటాయింపులు లేకుండా గాలి కబుర్లు ఎవరివి?

పక్క స్థలంలో భూమి పూజ చేసింది ఎవరు?

గత సర్కారు నిజంగానే కేటాయిస్తే టీసీఎల్‌ ఈ ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతుంది?

149 ఎకరాలు కేటాయించి సమస్యలు తీర్చింది     సీఎం జగన్‌ కాదా?

సాక్షి, అమరావతి: పొరుగు భూమిలో.. తుప్పల్లో ఆదరబాదరగా కొబ్బరికాయ కొట్టేసి ప్రారంభోత్సవం జరిగినంత హడావుడి చేయడం సిగ్గు లేని జన్మకు నిదర్శనం కాదా? కనీసం భూ కేటాయింపులే చేయకుండా ప్రముఖ సంస్థలను రప్పించిన ఘనత తమదేననడం సిగ్గు పడాల్సిన విషయం కాదా? తిరుపతి సమీపంలోని ఈఎంసీలో ఏర్పాటైన టీసీఎల్‌ కంపెనీ విషయంలో టీడీపీ, దాని అనుకూల మీడియా వ్యవహార శైలి ఇలానే ఉంది మరి! టీసీఎల్‌ లోకేష్‌ కష్టార్జితం.. బాబు చెమటార్జితం.. అంటూ గుండెలు బాదుకోవడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. మాజీ సీఎం చంద్రబాబు గత ఎన్నికల సమయంలో 2018 డిసెంబర్‌లో ఎలాంటి అనుమతులు, భూ కేటాయింపులు లేకుండా హడావుడిగా పక్క స్థలంలో భూమి పూజ కానిచ్చేసి చేతులు దులుపేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం టీసీఎల్‌ లాంటి వందల కంపెనీలు తెచ్చాం.. లక్షల ఉద్యోగాలిచ్చేశాం.. అంటూ నమ్మబలికారు. ఈ గాలి కబుర్లను నమ్మని ప్రజలు ఓటుతో టీడీపీకి గుణపాఠం నేర్పారు.

భూమి కేటాయించింది ఎవరు?
టీసీఎల్‌కు గత ప్రభుత్వమే నిజంగా భూమి కేటాయిస్తే ఆ కంపెనీ ప్రతినిధులు 2019 జూన్‌ 21న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలసి భూ కేటాయింపులు, నీటి సమస్యను పరిష్కరించమని ఎందుకు అడిగారు? టీసీఎల్‌ ఇండస్ట్రియల్‌ హోల్డింగ్‌ సీఈఓ కెవిన్‌ వాంగ్‌ ముఖ్యమంత్రిని కలిసి భూమి కేటాయించాలని కోరడం వాస్తవం కాదా? ఆ వెంటనే 2019 ఆగస్టు 8న టీసీఎల్‌కు 149 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్‌ 774 జారీ చేసింది. నీటి సమస్యతో పాటు కంపెనీకి అవసరమైన అన్ని మౌలిక వసతులను సమకూర్చింది. తదనంతరం నాటి ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్‌కే రోజా టీసీఎల్‌ నిర్మాణ పనులకు 2019 సెప్టెంబర్‌ 27న భూమి పూజ నిర్వహించారు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించింది.

సీఎం హోదాలో పిలిస్తే తప్పా..?
టీసీఎల్‌ ప్రతినిధుల వినతి మేరకు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2022 జూన్‌ 23న ప్రారంభించారు. కంపెనీ ఏపీలో ఏర్పాటైనందున రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడి, కల్పించిన ఉద్యోగాలను వెల్లడిస్తూ ప్రకటన ఇచ్చారు. వాస్తవాలు ఇలా ఉంటే భూమి ఇవ్వకుండా, నీటి వసతి కల్పించకుండా, ఇతర అనుమతులు మంజూరు చేయకుండా ఎన్నికల ప్రచారం కోసం ఊరి బయట తుప్పల మధ్య టెంకాయ కొట్టి నేను కంపెనీలు తెచ్చా.. నేనే కంపెనీలు తెచ్చా.. నేను ఉద్యోగాలిచ్చా.. నేనే ఉద్యోగాలు ఇచ్చా..? అంటూ టీడీపీ ప్రచారం చేసుకోవడంపై అంతా విస్తుపోతున్నారు. 

మరిన్ని వార్తలు