Political Fact Check: వివేకా హత్య కేసులో పుకార్లేంటీ? నిజాలేంటీ?

10 Mar, 2023 09:44 IST|Sakshi

తెలుగుదేశం క్యాంపు, ఎల్లో మీడియా తనకు అచ్చొచ్చిన గోబెల్స్‌ ప్రచారాన్ని వివేకా హత్య కేసుకు రుద్ది రాజకీయ లబ్ది కోసం వెంపర్లాడుతున్నట్టు తెలుస్తోంది. పదే పదే అబద్దాలను ప్రచారం చేసి దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయడానికి తెగ ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. హత్య జరగడం మొదలు.. ఇప్పటివరకు ప్రతీ అంశాన్ని అనుకూలంగా మార్చుకునే దిశగా ఈ కుట్ర సాగుతోంది. ఇందులో కీలకమైన అంశం రాజకీయం. ఎంపీ టికెట్‌ విషయంలో వివేకానందరెడ్డి అడ్డు ఉంటారని భావించినందుకే ఆయన్ను హత్య చేశారంటూ ఎల్లో మీడియా విస్తృతంగా కథనాలు ఇచ్చింది. ఇందులో నిజమెంత? ఏ కోణంలో ఆలోచించినా ఈ వాదనలో కించిత్తు లాజిక్‌ కనిపిస్తోందా? ఇక్కడ కొన్ని ఎల్లో మీడియా వాదనలు, వాటికి స్థానికంగా ఉన్న వాస్తవ పరిస్థితులను పోల్చి చూద్దాం.

ఎల్లో మీడియా వాదన : ఎంపీ టికెట్‌కు అడ్డు పడతాడన్న భయంతోనే వివేకా హత్య.?
Fact Check : వైఎస్సార్‌ కడప జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, వాస్తవ పరిశీలనలేంటీ? 
వైఎస్సార్‌ కడప జిల్లాలో రాజకీయాలు దశాబ్దాలుగా ఒకే తీరున ఉన్నాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబంపై అక్కడి ప్రజలు పూర్తి విశ్వాసాన్ని, ఆదరాభిమానాలను కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతగా వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఎంతగా ఆదరించారో.. అదే తీరున, అంత కంటే ఓ మెట్టు ఎక్కువగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని తమ వాడిగా గుండెల్లో పెట్టుకున్నారు. వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడినప్పుడయినా.. వైఎస్సార్‌సిపి పేరుతో కొత్త పార్టీని పెట్టినప్పుడయినా.. తమ అభిమానాన్ని కొనసాగిస్తూనే వచ్చారు.

ఇక్కడ పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ. కాంగ్రెస్‌ లేదా బీజేపీ తరహాలో నిర్ణయాలు ఎక్కడో ఢిల్లీలో ఉండవు. వివిధ సమీకరణాలు, నాయకత్వ లక్షణాలు, ప్రజలకు చేరువయ్యే అభ్యర్థిని పార్టీ అధ్యక్షుడు ఎంచుకుంటారు. అలాగే 2014లో అయినా, 2019లో అయినా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తమ అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు. కడప ఎంపీ టికెట్‌ను ఆయన రెండు సార్లు కూడా వైఎస్‌ అవినాష్‌రెడ్డికే ఇచ్చారు తప్ప వివేకానంద రెడ్డికి ఇవ్వలేదు. వయస్సు రీత్యా అయినా.. ప్రజల్లో ఉన్న కలివిడి, ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే శక్తి, వివిధ వర్గాల్లో ఉన్న ఆదరణ విషయంలో వివేకానందరెడ్డి ఏ రకంగానూ అవినాష్‌రెడ్డి అడ్డు పడలేదు, అడ్డు రాలేదు. 

ఎల్లో మీడియా వాదన : రాజకీయంగా వివేకానందరెడ్డి అవినాష్‌రెడ్డికి పోటీగా మారుతున్నాడు
Fact Check :
వైఎస్సార్‌ కడప జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఏం ఫలితాలొచ్చాయి? వాస్తవ పరిశీలనలేంటీ? 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా వైఎస్సార్‌ కడప జిల్లాలో రాజకీయ పరిస్థితుల్లో చెప్పుకోదగ్గ ఏ మార్పు కనిపించలేదు. గతంలోలాగే వైఎస్సార్‌సిపికి ప్రజలు పట్టం కట్టారు. ఇక కడప ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికను పరిశీలిస్తే.. 2014లో, 2019లో రెండు సార్లు ఇక్కడ ఎన్నిక జరిగింది. రెండు సార్లు కూడా.. కడప ఎంపీ స్థానానికి తమ అభ్యర్థిగా అవినాష్‌రెడ్డిని ఎంచుకున్నారు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి. 

2014లో కడప ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికలో అవినాష్‌రెడ్డి ఏకంగా లక్షా 90వేల మెజార్టీతో గెలిచారు. ఆయనకు 671,983 ఓట్లు అంటే 55.95% వస్తే.. తెలుగుదేశం అభ్యర్థి రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి 481,660 ఓట్లకు పరిమితం అయ్యారు. 

ఇక 2019లో అవినాష్‌రెడ్డి విజయం రెండింతలయింది. 2019లో కడప ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికలో అవినాష్‌రెడ్డి ఏకంగా 3 లక్షల 80వేల 726 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆయనకు 783,499 ఓట్లు అంటే 63.79% వస్తే.. తెలుగుదేశం అభ్యర్థి సి.ఆదినారాయణ రెడ్డికి కేవలం 402,773 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఏ రకంగా చూసినా 3లక్షల 80వేల మెజార్టీ అంటే దేశంలో ఘనవిజయం సాధించిన వ్యక్తుల్లో అవినాష్‌రెడ్డి ఒకరు. 

ఈ లెక్కలు చూస్తే.. అవినాష్‌రెడ్డికి ఏ కోశానా వివేకానందరెడ్డి అడ్డుగా ఉన్నాడనో.. లేక రాజకీయంగా తన అవకాశాలను దెబ్బ తీస్తాడన్న వాదన సరికాదని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇంత చిన్న లాజిక్‌ను పక్కనబెట్టి ఎల్లోమీడియా ఇదే రాగం తీయడం, దాన్ని దర్యాప్తు సంస్థల మీద ప్రభావితం చేసేలా ప్రచారం చేయడం విడ్డూరంగానే కనిపిస్తుంది. 

ఎల్లో మీడియా వాదన : కడప టికెట్‌ నాకైనా ఉండాలి లేక మన వాళ్లకే ఉండాలి : వివేకానందరెడ్డి తరచుగా తన కూతురు సునీతకు చెప్పేవాళ్లు
Fact Check : వైఎస్సార్‌ కడప జిల్లాలో వాస్తవ పరిశీలనలేంటీ? రాజకీయంగా ఎలాంటి పరిస్థితులున్నాయి?
పైన చెప్పుకున్న సమగ్ర వివరాలలో మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అంశాలు రెండు. మొదటిది వైఎస్సార్‌సిపి అనేది ప్రాంతీయ పార్టీ. అంటే పార్టీ అధ్యక్షుడు ఎవరిని ఎంచుకుంటే వారే అభ్యర్థి అవుతారు. అప్పటికే రెండు సార్లు అంటే 2014, 2019లలో అవినాష్‌రెడ్డి ఘనవిజయం సాధించారు, ప్రజలకు చేరువయ్యారు, వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించారు. 2014-19 మధ్య కాలంలో వైఎస్సార్‌సిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కడపలో జరిగిన సమావేశంలో జనవరి 3, 2018న ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబును సభపైనే ప్రశ్నించిన ధైర్యం అవినాష్‌రెడ్డిది. కృష్ణా జలాల విషయంలో తన నియోజకవర్గంలో ముంపు గ్రామాలకు న్యాయం చేయాలంటూ చంద్రబాబును నేరుగా ప్రశ్నించిన ధైర్యం అవినాష్‌ది. 

జనవరి 3, 2018న జరిగిన మరో బహిరంగ సభలో ఎంపీగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ  అసలు ప్రాజెక్ట్‌ ఘనత ఎవరిదో చెప్పబోతున్నప్పుడు సభపైనే చంద్రబాబు, టిడిపి నేతలు మైక్‌ లాక్కున్న ఘటన ఈ కింది వీడియోలో చూడవచ్చు. 

ఇవి కేవలం కొన్ని ఉదాహరణలే. వైఎస్సార్‌ కడప జిల్లాలో పార్టీ కార్యకర్తలకు, సామాన్యులకు పూర్తిగా అండగా ఉండే మనస్తత్వం అవినాష్‌రెడ్డిది. పార్టీ పరంగా ఆయన తన వాదనను పూర్తి స్థాయిలో వినిపించారు. తెలుగుదేశం నాయకులకు కొరకరాని కొయ్యగా మారారు. అందుకే అవినాష్‌రెడ్డి ఉంటే కడపలో ఏం చేయలేమన్న ధోరణి టిడిపి నేతల్లో కనిపించింది. సరిగ్గా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే వివేకానంద రెడ్డి హత్య జరగడం, దాన్ని ఒక పథకం ప్రకారం అవినాష్‌రెడ్డికి అంటించడం ఇందులో భాగమేనని స్థానికంగా ఎవరిని అడిగినా చెబుతారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయంగా అవినాష్‌ ఎదుగుదలకు వివేకానందకు ఎలాంటి లింకు లేదు. పైగా అవినాష్‌ను వద్దని తనకు టికెట్‌ కావాలని వివేకానందరెడ్డి చెప్పారంటూ ఎల్లోమీడియా చేస్తున్న వాదనలోనూ లాజిక్‌ లేదు. 

ఎల్లో మీడియా వాదన : రాజకీయంగా వివేకా ఎదుగుతున్నారు. అందుకే ఆయన్ను అడ్డు తొలగించారు.
Fact Check : వైఎస్సార్‌ కడప జిల్లాలో వాస్తవ పరిశీలనలేంటీ? రాజకీయంగా వివేకా సాధించిన విజయాలేంటీ?
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నంత కాలం ఆయన నీడలో ఎదిగిన వివేకానందరెడ్డి.. ఆయన మరణం తర్వాత మరో స్టాండ్‌ తీసుకున్నారు. ఏ కుటుంబం అయితే అండగా ఉందో అదే కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేశారు. తర్వాతి కాలంలో ఆయన తిరిగి వైఎస్సార్‌సిపిలో చేరినా.. ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేకపోయారు. 

2017 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి వైఎస్సార్‌సిపి అభ్యర్థిగా బరిలో దిగారు. అప్పటికే జిల్లాలో ఏ రకంగా చూసినా పార్టీ పటిష్టంగా ఉంది. అభ్యర్థి ఎవరయినా వైఎస్సార్‌సిపిదే విజయం అన్నట్టుగా ఆనాటి పరిస్థితి ఉంది. ఆ ఎన్నికల్లో పోటీకి దిగిన వివేకానందరెడ్డి ఓడిపోయారు. తెలుగుదేశం అభ్యర్థి బీటెక్‌ రవి చేతిలో ఓడిపోవడం ఇబ్బందికర పరిస్థితి. ఏ రకంగా చూసినా ఇది వివేకానందరెడ్డికి ఇబ్బందికరమైన విషయమే. ఎమ్మెల్సీగా గెలవలేని అభ్యర్థి.. కడప ఎంపీగా పోటీ చేయాలని ఎలా భావిస్తారు? ఎల్లో మీడియా ప్రచారం చేసినట్టు టికెట్‌ తనకే కావాలని ఎలా అడుగుతారు? ఇక ఆయన్ను అవినాష్‌రెడ్డి తనకు అడ్డు అని ఎలా భావిస్తారు?

ఈ అంశాలన్నింటిని పరిశీలిస్తే.. అవినాష్‌రెడ్డిని ఇరికించడానికి, దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయడానికి ఓ పథకం ప్రకారం కుట్ర జరుగుతోందని అర్థమవుతోంది.

మరిన్ని వార్తలు