Fact Check: ఖర్చు రూ.11 వేల కోట్లు..అవినీతి రూ.15 వేల కోట్లా? 

15 Nov, 2022 08:59 IST|Sakshi

కేంద్ర చట్టం ప్రకారమే జగనన్న కాలనీలకు భూ సేకరణ 

పారదర్శకంగా పేదల ఇళ్ల నిర్మాణం.. అవినీతికి ఆస్కారమే లేదు

సాక్షి, అమరావతి: బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లుగా జనసేనాని ఆరోపణల్లో డొల్లతనం బయట పడింది. జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవమని తేలింది. రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలివ్వగా అందుకోసం 71,811 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వ భూమి పోగా 25,374 ఎకరాలను రైతుల నుంచి కొనుగోలు చేసింది. అందుకోసం సుమారు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసింది. అలాంటప్పుడు ఖర్చు చేసిందే రూ.11 వేల కోట్లయితే ఇక రూ.15 వేల కోట్ల అవినీతికి పాల్పడటం ఎలా సాధ్యం?  

రైతుల నుంచి ఎకరా రూ.2 లక్షలు, రూ.4 లక్షలకు కొనుగోలు చేసి వైఎస్సార్‌సీపీ నేతలు రూ.20 లక్షలు, రూ.30 లక్షలకు విక్రయించారన్న ఆరోపణలోనూ నిజం లేదు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భూ సేకరణ చట్టం ప్రకారమే జగనన్న కాలనీల కోసం భూ సేకరణ జరిపారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో బేసిక్‌ వాల్యూ రిజిస్టర్‌లో నిర్దేశించిన విలువ ప్రకారమే విక్రయాలు, కొనుగోళ్లు జరిగాయి. దీనికంటే బహిరంగ మార్కెట్‌లో రేటు ఎక్కువగా ఉంటే కేంద్ర భూ సేకరణ చట్టం ప్రకారం ముందుకెళ్తారు. రిజిస్ట్రేషన్‌ విలువ కన్నా రూరల్‌లో రెండున్నర రెట్లు, అర్బన్‌లో రెట్టింపు విలువను అధికంగా చెల్లిస్తారు.

అప్పటికీ రైతులు సంతృప్తి చెందకుంటే కలెక్టర్లు జిల్లా కమిటీలకు ఆ కేసులను అప్పగిస్తారు. ఇలాంటి సందర్భాల్లో బేసిక్‌ వాల్యూ రిజిస్ట్రేషన్‌ కన్నా అధిక ధరకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ధరను, డాక్యుమెంట్లలో పేర్కొన్న విలువను పరిగణలోకి తీసుకుంటారు. ఇదంతా కేంద్రం రూపొందించిన భూ సేకరణ చట్టం ప్రకారమే అనుసరిస్తారు. ఆ డాక్యుమెంట్‌లో పేర్కొన్న సేల్‌ వాల్యూను పరిగణలోకి తీసుకుని హైవేలు, ఇతర కమర్షియల్‌ స్థలాలు, మేజర్‌ ప్రాజెక్టులకు సమీపంలో ఉన్న స్థలాల రైతులతో సంప్రదింపులు జరిపి మరో 10 నుంచి 20 శాతం ధర పెంచుతారు. అప్పటికీ రైతులు సంతృప్తి చెందకపోతే ఇలాంటి కేసులు రాష్ట్ర కమిటీలకు వెళతాయి. ధర ఖరారైన తర్వాత నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లోకి సీఎంఎఫ్‌ఎస్‌ నుంచి డబ్బులు జమ అవుతాయి. ఇందులో ఎక్కడా మధ్యవర్తులు ఉండరు. 

భూ సేకరణ కోసం కలెక్టర్లు రెండు ప్రధాన పత్రికల్లో నోటిఫికేషన్‌ ఇచ్చి అభ్యంతరాలు స్వీకరిస్తారు. రైతులతో మాట్లాడిన తర్వాతే డిక్లరేషన్‌ చేసి అవార్డును ఎంక్వైరీ చేస్తారు. అనంతరం ఫైనల్‌ అవార్డును డిక్లేర్‌ చేస్తారు. ఈ ప్రక్రియ ముగిసేందుకు కనీసం 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది. ఇంత పారదర్శకంగా భూసేకరణ జరిపి కాలనీలను  నిర్మిస్తుంటే అందులో అవినీతికి ఎక్కడ ఆస్కారం ఉంది? 

మరిన్ని వార్తలు