Fact Check: ఆ బ్యారెజ్‌ల నిర్మాణంలో ఎవరి భాగస్వామ్యం ఎంత..?

10 Sep, 2022 16:26 IST|Sakshi

ఆ రెండు ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాకు మణిహారాల్లా నిలుస్తున్నాయి. ఈ మధ్యనే వాటిని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాటిని జాతికి అంకితం చేసి జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తన ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటారు. ఇంతవరకూ బాగానే వుంది. సీఎం ఆ రెండు ప్రాజెక్టులను ప్రారంభించారో.. ఆ వెంటనే ఆ ఘనత తమదేనని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకోవడం ప్రారంభించారు. మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు పెన్నా బ్యారేజ్ నిర్మాణంలో ఎవరి భాగస్వామ్యం ఎంత ...? సాక్షి ఫ్యాక్ట్ చెక్ చూద్దాం. 

ఈ మధ్యనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన సంగం , నెల్లూరు బ్యారేజీలివి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ప్రాజెక్టుల్లో భాగంగా వీటికి శంకుస్థాపన చేసి నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. అయితే రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ఆయన అకాల మరణం చెందారు. దాంతో కొంతకాలంపాటు మూలన పడిన జలయజ్ఞం ప్రాజెక్టుల్లో ఇవి కూడా వున్నాయి. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడిన తెలుగుదేశంపార్టీ ప్రభుత్వం నెల్లూరు, సంగం బ్యారేజీలను పూర్తి చేస్తామని పదే పదే ప్రకటనలు చేశారుగానీ పూర్తి చేయలేదు. 

2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చింది. వైఎస్సార్ స్ఫూర్తిని ప్రతి ఫలించేలా ప్రాధాన్యతా క్రమంలో జలయజ్ఞం పనులను ప్రారంభిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మాట నిలబెట్టుకున్నారు. ఈ రెండు బ్యారేజీల నిర్మాణంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కరోనా, వరదల్లాంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ ఎక్కడా వెనకడుగు వేయకుండా వీటిని పూర్తి చేయించారు. అవసరమైన నిధులను కేటాయించి పనులయ్యేలా చూశారు. దాంతో సంగం, నెల్లూరు బ్యారేజీలు రెండూ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 

ఇంతవరకూ బాగానే వుంది. రెండు జలయజ్ఞం ప్రాజెక్టులు కళకళలాడుతూ,  ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు... నెల్లూరు నగరానికి పుష్కలంగా తాగునీరు అందించడానికి సిద్ధం కావడం తెలుగుదేశం పార్టీకి మింగుడు పడడం లేదు. ఇక వెంటనే ఈ రెండూ పూర్తవ్వడం తెలుగుదేశం ఘనతే అని చెప్పుకోవడం ప్రారంభించారు. వారికి ఎల్లో మీడియా కూడా తానా అంటే తందాన అనేసింది. 

నెల్లూరు, సంగం బ్యారేజీల నిర్మాణం విషంలో తెలగుదేశం పార్టీ నేతలు, వారికి కొమ్ముకాసే పచ్చ మీడియా ప్రచారంలో ఎంత నిజం వుందో చూద్దాం. నెల్లూరు బ్యారేజీ నిర్మాణ సవరించిన అంచనా విలువ   రూ. 274.83 కోట్లు. ఇందులో 2008-2014 వరకూ అంటే  రాష్ట్ర విభజన కి ముందు రూ. 86.62 కోట్లు   ఖర్చు చేశారు.   ఇక చంద్రబాబు హయాంలో 2014-2019 వరకూ అంటే ఐదు సంవత్సరాల్లో    రూ. 71.54 కోట్లు వ్యయం చేశారు.  2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడింది.. అప్పటినుంచీ ఇప్పటివరకు ఈ మూడేళ్లలో కరోనా ప్రతికూల పరిస్థితుల్లో   రూ. 77.37 కోట్లు ఖర్చు చేసి నెల్లూరు బ్యారేజీని పూర్తి చేశారు. జాతికి అంకితం చేశారు.. 

మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని చూద్దాం. ఈ ప్రాజెక్టు సవరించిన అంచనా విలువ   రూ. 335.80 కోట్లు. ఇందులో 2008-2014 వరకూ అంటే రాష్ట్ర విభజన కి ముందు రూ. 30.85 కోట్లు  ఖర్చు చేయగా 2014-2019 వరకూ అంటే చంద్రబాబు హయాంలో ఐదు సంవత్సరాల్లో  రూ. 86.10 కోట్లు వ్యయం చేశారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పటినుంచీ ఇప్పటివరకూ అంటే సంగం ప్రాజెక్ట్ ప్రారంభమయ్యేవరకూ ఈ మూడేళ్లలో కరోనా ప్రతికూల పరిస్థితుల్లో సైత రూ. 131.12 కోట్లు ఖర్చు చేశారు. 

ఇవీ వాస్తవాలు. అటు వైఎస్ఆర్ హయాన్ని, ఇటు వైఎస్ జగన్ హయాంను కలుపుకుంటే నెల్లూరు, సంగం బ్యారేజీలకోసం సింహభాగం డబ్బులు ఖర్చు చేశారు.  ప్రాజెక్టులు పూర్తి కావడానికి చిత్తశుద్ధితో కృషి చేశారు. అంతే కాదు కరోనా, వరదల్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో..అన్ని సమస్యలు పరిష్కరించి చకచకా పనులు చేసి ఈ రెండు ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చారు సీఎం వైఎస్ జగన్. కళ్ల ముందు లెక్కలు తప్పులు చెప్పవు కదా.. కానీ చంద్రబాబు నాయుడు ఆయన కోటరీ మాత్రం ఈ రెండు ప్రాజెక్టులు మా ఘనతే అని చెప్పుకుంటున్నారు. ఇతరుల కష్టాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ఏమాత్రం సందేహించకపోవడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమనే విమర్శలు వస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు