పచ్చి అబద్ధాలే ‘పచ్చ’ రాతలు!

23 Nov, 2020 03:05 IST|Sakshi

పీపీఏ సమావేశం జరిగిన నాడు సొంత వంటకం

కేంద్రం చెప్పిన ధరలకే పీపీఏ కట్టుబడి ఉన్నట్టు రాతలు

దానికన్నా ఎక్కువ ఇవ్వలేమని చెప్పినట్లుగా కథనాలు

మినిట్స్‌ బయట పడటంతో గతిలేక వాస్తవాల వెల్లడి

ఆ రెండు పత్రికల తీరుతో నాడే ఆశ్చర్యపోయిన అధికారులు

2017–18 ధరల్ని ఆమోదించినట్లు నాడే వెల్లడించిన ‘సాక్షి’

సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్‌ లోగా పూర్తి చేసి, 2022 ఖరీఫ్‌ నాటికి ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వడివడిగా అడుగులు వేస్తుంటే ఓ వర్గం మీడియా అబద్ధపు రాతలతో ప్రజలను గందరగోళంలో పడేస్తోంది. విభజన చట్టం ప్రకారం వంద శాతం ఖర్చుతో కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు 2016 సెప్టెంబరు 7న రాష్ట్ర ప్రభుత్వానికి దక్కేలా చేశారు. ఈ క్రమంలో 2014 ఏప్రిల్‌ 1 తర్వాత నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని కేంద్రం పెట్టిన షరతుకు చంద్రబాబు తలొగ్గారు. డిజైన్‌ మారినా, ధరలు పెరిగినా, అంచనా వ్యయం పెరిగినా.. భూసేకరణ వ్యయం పెరిగినా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని తేల్చిచెప్పినా చంద్రబాబు నోరు మెదపలేదు. ఈ పాపం ఫలితంగానే కేంద్ర ఆర్థిక శాఖ అక్టోబర్‌ 12న కొర్రీ వేసింది. దాని నుంచి పోలవరాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ బయటపడేలా చేసి, ప్రాజెక్టును పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఓ వర్గం మీడియా మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోకుండా, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేసిన పాపాలను కప్పిపుచ్చేందుకు అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. 2013–14 ధరల ప్రకారమే నీటి పారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లకు మించి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని పీపీఏ తేల్చి చెప్పినట్లు ఈ నెల 3వ తేదీన అబద్ధపు రాతలతో విషం చిమ్మింది. ఇప్పుడు పీపీఏ మినిట్స్‌ రూపంలో వాస్తవాలను బహిర్గతం చేయడంతో ఆ వర్గం మీడియా తప్పని పరిస్థితిలో అసలు విషయాన్ని చెప్పాల్సి వచ్చింది. 


అప్పుడే ఈ విషయం చెప్పిన ‘సాక్షి’     
జాతీయ ప్రాజెక్టుల మార్గదర్శకాల ప్రకారం.. నీటి పారుదల విభాగం వ్యయమంటే భూసేకరణ, ఆర్‌ఆర్‌ (రీహాబిలిటేషన్‌ రీసెటిల్‌మెంట్‌) ప్యాకేజీ, హెడ్‌ వర్క్స్‌ (జలాశయం), ప్రధాన కాలువలు, పిల్ల కాలువలకు చేసే ఖర్చు అని రాష్ట్ర ప్రభుత్వం తొలి నుంచీ స్పష్టం చేస్తోంది. ఈ అంశాలను ఈ నెల 3నే ‘సాక్షి’ వెల్లడించింది. ఇప్పుడు ఇదే విషయంతో సీడబ్ల్యూసీ, పీపీఏ ఏకీభవించింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు