ఫేక్‌ పీహెచ్‌డీ ఫ్యాకల్టీలదే హవా!

21 Oct, 2021 04:41 IST|Sakshi
జేఎన్‌టీయూకే ముఖద్వారం

ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల బాగోతం

ఏపీలోని 180 కళాశాలల్లో 200 మంది వరకు చలామణి

తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో సర్టిఫికెట్ల కొనుగోలు

నాణ్యమైన విద్యకు దూరం అవుతున్న విద్యార్థులు 

విషయం తెలిసినా పట్టించుకోని వర్సిటీ యంత్రాంగం

సాక్షి, కాకినాడ: ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో నకిలీ పీహెచ్‌డీలతో విద్యాబోధన యథేచ్ఛగా కొనసాగుతున్నా.. చర్యలు తీసుకోవాల్సిన వర్సిటీల అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జేఎన్‌టీయూ (కాకినాడ) వర్సిటీ ఏపీలోని 8 జిల్లాల్లో విస్తరించి ఉంది. దీని పరిధిలో 180 అఫిలియేటెడ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో ఒకరిద్దరు చొప్పున ఎనిమిది జిల్లాల్లో సుమారు 200 మంది నకిలీ పీహెచ్‌డీ సర్టిఫికెట్లతో విద్యాబోధన చేస్తున్నట్లు తేటతెల్లమయ్యింది.

యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ (యూజీసీ), ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) నిబంధనల మేరకు అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌ స్థాయిలో బోధించాలంటే  పీహెచ్‌డీ తప్పనిసరి. గుర్తింపు పొందిన వర్సిటీల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థిని కళాశాలల్లో నియమిస్తే నెలకు రూ.90,000 నుంచి రూ.1,20,000 వరకు వేతనం ఇవ్వాలి. ఇంత మొత్తం ఇవ్వడం ఇష్టం లేని ప్రైవేట్‌ యాజమాన్యాలు తక్కువ జీతానికి వచ్చే ఫేక్‌ పీహెచ్‌డీ అభ్యర్థులకు రూ.40 వేల వరకు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి.  

ఎక్కడివీ ఫేక్‌ పీహెచ్‌డీలు..
కొంతమంది అభ్యర్థులు కర్నాటక, తమిళనాడు, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లోని కొన్ని వర్సిటీలకు ఎంతో కొంత సమర్పించుకుని నకిలీ పీహెచ్‌డీ పట్టా తెచ్చుకుంటున్నారు.  తక్కువ జీతానికే పనిచేస్తామని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను ఆశ్రయిస్తున్నారు. వారు సైతం ఖర్చు తక్కువ అవుతుందని భావించి.. అతి తక్కువ జీతాలిస్తూ వీరిని ప్రోత్సహిస్తున్నారు. కీలక ఉద్యోగాల్లో నియమిస్తున్నారు. అనుభవం లేని నకిలీ అధ్యాపకులు పాఠాలు బోధిస్తుండడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎడారిలో ఎండమావిలా మారింది.

నిద్రమత్తులో వర్సిటీ యంత్రాంగం
ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో యూనివర్సిటీ అధికారులు ప్రతి ఏటా నిజ నిర్ధారణ కమిటీల పేరుతో తనిఖీలు నిర్వహిస్తున్నా.. నకిలీ పీహెచ్‌డీలపై దృష్టి సారించడం లేదు. యాజమాన్యాలు ఇచ్చే ముడుపులు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

రాష్ట్రంలో మచ్చుకు కొన్ని..
రాష్ట్రంలో నకిలీ పీహెచ్‌డీ సర్టిఫికెట్లతో వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారి జాబితా చాంతాడంత ఉంది. ఏలూరు, తాడేపల్లిగూడెం, కాకినాడ, కృష్ణాజిల్లా చల్లపల్లి, గుంటూరు, నర్సాపురంలోని కొన్ని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఇదే తంతు సాగుతోంది. దాదాపు 200 మంది వివిధ హోదాల్లో నకిలీ సర్టిఫికెట్లతో కొనసాగుతున్నారని తెలుస్తోంది.

విచారించి చర్యలు తీసుకుంటాం..
ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనలు తప్పకుండా పాటించాలి. నకిలీ పీహెచ్‌డీ సర్టిఫికెట్లతో కళాశాలల్లో పనిచేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. విచారించి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే నిజనిర్ధారణ కమిటీలు తనిఖీ సైతం నిర్వహించాయి. 
– డాక్టర్‌ సుమలత, రిజిస్ట్రార్, జేఎన్‌టీయూ(కే)

ఫేక్‌ పీహెచ్‌డీలను గుర్తించాలి..
నకిలీ పీహెచ్‌డీ అభ్యర్థులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు పీహెచ్‌డీ పూర్తి చేసిన వారి డేటా వర్సిటీ వెబ్‌సైట్‌లలో ఉంచుతున్నారు. మిగతా యూనివర్సిటీలు కూడా  పాటిస్తే పారదర్శకత పెరుగుతుంది. 
    –డాక్టర్‌ జ్యోతిలాల్‌ నాయక్, విద్యావేత్త  

మరిన్ని వార్తలు