బ్రాండ్‌.. బ్యాండ్‌

13 Apr, 2023 05:11 IST|Sakshi

బ్రాండెడ్‌ బియ్యం పేరుతో నకిలీలు

ప్రభుత్వ ఆదాయానికి గండి 

వినియోగదారునికి బిల్లు ఇవ్వరు

జీఎస్టీ చెల్లించరు.. మార్కెట్‌ టాక్స్‌ కట్టరు

ఒక్క తిరుపతి జిల్లా నుంచే రూ.15 కోట్లు గండి 

మామూళ్ల మత్తులో అధికారులు

నా పేరు లింగమయ్య. మాది గుంటూరు జిల్లా గురజాల. మా బియ్యం బ్రాండ్‌ పేరు శ్రీఆహార్‌. శ్రీ(ఎస్‌ఆర్‌ఐ) అని ఉంటుంది. బస్తాపై నా పేరు, ఫొటో, అడ్రస్‌ ఉంటుంది. సీల్‌ బస్తా. మా బియ్యం బస్తాలానే నకిలీ ఉంది. ఆ బస్తాపైన శ్రీ (ఎస్‌ఆర్‌ఈఈ) అని ఉంటుంది. బస్తాని కుట్టి ఉంటారు. నకిలీ బస్తాపై అడ్రస్, పేరు, ఫోటో ఉండవు. వినియోగదారులు వీటిని గమనించి కొనుగోలు చేస్తే మోసపోయేందుకు వీలు లేదు.

మా బియ్యం బ్రాండ్‌ పేరు సత్యసాయి. నా పేరు సురేంద్ర, సూళ్లూరుపేట. మా బస్తాలో బియ్యం 26.70 కిలోలు ఉంటాయి. మా బ్రాండ్‌ పేరును అటూ ఇటు మార్చి బ్యాగ్‌ను తయారుచేసి అందులో తక్కువ క్వాలిటీ ఉన్న బియ్యాన్ని నింపి అమ్మేస్తున్నారు. మేము వ్యాపారం పెంచుకునేందుకు ఊరూరా తిరిగి విక్రయిస్తుంటే.. నకిలీలు బయటపడుతున్నాయి. ఏ ఒక్కరు ప్రభుత్వానికి టాక్స్‌ కట్టడం లేదు.

జిల్లాలో నకలీ బ్రాండెడ్‌ బియ్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. బ్రాండెడ్‌ బియ్యం పేరుతో నకిలీలు పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నకిలీ వ్యాపారుల బ్యాగులన్నీ కూడా 26 కిలోల పైనే ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు లారీల్లో పరిమితికి మించి బియ్యాన్ని తీసుకొస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. వీటికి బిల్లులు ఉండవు. బరువు వేయరు. సెస్‌ చెల్లించారా? లేదా? అని కూడా చెక్‌ చేయడం లేదు. ఇటు వినియోగదారులు.. అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ అక్రమార్కులు రూ.కోట్లు దండుకుంటున్నారు. 

సాక్షి, తిరుపతి: జిల్లాలో నకిలీ బ్రాండ్‌ బియ్యం వ్యాపారం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దుకాణాలు, బ్రాండ్‌ పేర్లకు ఎటువంటి రిజిస్ట్రేషన్లు లేకుండా బియ్యాన్ని మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జీఎస్‌టీ, వ్యవసాయ మార్కెట్‌ సెస్‌ వంటివి చెల్లించాల్సి ఉన్నా.. అటువంటివేమీ చెల్లించకుండా క్రయ విక్రయాలు జరుపుతూ వినియోగ దారులను మోసం చేస్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.

జిల్లాలో కోట్లలో జరిగే బియ్యం వ్యాపారంలో ప్రభు­త్వానికి జీఎస్‌టీ, మార్కెట్‌ చెస్‌ కట్టేవారు కేవ­లం ఆరుగురు మాత్రమే ఉన్నట్లు సమాచారం. మరో 40 మందికిపైగా నిబంధనలకు విరుద్ధంగా బియ్యం వ్యాపారాలు సాగిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 45 రైస్‌మిల్లులు ఉన్నాయి. వీటిని నమ్ముకుని 7వేలకు పైగా బియ్యం దుకాణాలు వెలిశాయి. ఇవి కాకుండా నివాసాల్లో విక్రయించేవారు ఉన్నారు. 

రోజుకు రూ.15 కోట్ల వ్యాపారం
తిరుపతి నగరంలోనే రోజుకు రూ.15 కోట్లు బియ్యం వ్యాపారం జరుగుతోంది. రోజుకు ఐదు లారీల బియ్యం వస్తోంది. అంటే 5వేల నుంచి 10వేల బస్తాలు. తిరుపతి మినహా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే మరో రూ.20 కోట్ల వరకు బియ్యం క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. ఎటువంటి బిల్లులు లేకుండా.. బియ్యాన్ని దిగుమతి చేయడం, ఆ తరువాత బస్తాలకు నింపి దుకాణాలకు తరలించడం షారా మమూలే. వీరు జీఎస్టీ 5శాతం, మార్కెట్‌ సెస్‌ ఒక శాతం ఎగ్గొట్టి క్రయ విక్రయాలు సాగిస్తున్నారు.  నిబంధనల మేరకు నడుచుకునేవారు కేవలం నలుగురు వ్యాపారులు మాత్రమేనని తెలిసింది. ఒక్క తిరుపతి జిల్లా నుంచి నెలకు రూ.15 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండిపడితున్నట్లు అధికారుల అంచనా.

తిరుపతి నగరంలోని 50మంది దుకాణ దారులు రోజుకు రూ.50 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్నా.. రూపాయి కూడా చెల్లించడం లేదని విశ్వసనీయ సమాచారం. ఇతర ప్రాంతాల నుంచి లారీల్లో పరిమితికి మించి బియ్యాన్ని తీసుకొస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. వీటికి బిల్లులు ఉండవు. చెస్‌ చెల్లించారా? లేదా? అని కూడా చెక్‌ చేయడం లేదు. కొందరు అధికారులు మామూళ్ల మత్తులో చూసీ చూడనట్లు విడిచిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు