సబ్‌ కలెక్టర్‌కే నకిలీ టోల్‌ రశీదు!

8 Jan, 2021 08:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హార్సిలీహిల్స్‌ టోల్‌ వసూళ్లలో భారీగా అవినీతి

సబ్‌ కలెక్టర్‌కే సీలులేని రశీదు

పాత బిల్లులతో నగదు స్వాహా చేసినట్లు నిర్ధారణ

ఇద్దరు వీఆర్‌ఏల సస్పెన్షన్‌

నకిలీ రశీదులతో టోల్‌గేట్‌ రుసుం వసూలు చేస్తూ మోసం చేస్తున్న వీఆర్‌ఏల ఉదంతాన్ని మదనపల్లె సబ్‌కలెక్టర్‌ ఎం.జాహ్నవి గుట్టురట్టు చేశారు. సాధారణ పర్యాటకురాలిగా హార్సిలీహిల్స్‌ వెళ్లారు. రూ.25 చెల్లించి తీసుకొన్న రశీదుపై సబ్‌కలెక్టర్‌ అధికారిక సంతకం, సీలు లేకపోవడంతో ఆరా తీస్తే నకిలీదని తేలింది. ఫలితంగా ఇద్దరు వీఆర్‌ఏలను సస్పెండ్‌ చేశారు.

సాక్షి, బి.కొత్తకోట(చిత్తూరు): మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌పైకి వెళ్లే వాహనాల నుంచి రుసుం వసూలుచేసే బాధ్యతను కోటావూరు పంచాయతీకి చెందిన వీఆర్‌ఏలు ఎస్‌.వెంకటరమణ, ఎస్‌.మస్తాన్‌సాబ్‌కు  అప్పగించారు. వీరు పదేళ్లకు పైగా రుసుం వసూలు చేస్తూ ఈ విధులకే పరిమితం అయ్యారు. ఈ వసూళ్లపై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హార్సిలీహిల్స్‌ టౌన్‌షిప్‌ కమిటీ చైర్మన్‌ అయిన మదనపల్లె సబ్‌కలెక్టర్‌ ఎం.జాహ్నవి గత నెల 29, 30 తేదీల్లో సాధారణ పర్యాటకురాలిగా కొండకు కారులో వెళ్తుండగా వీఆర్‌ఏలు టోల్‌గేటుగా రెండు సార్లు రెండు రశీదులు ఇచ్చి రూ.50 తీసుకొన్నారు. వీరు ఇచ్చిన రశీదుల నంబర్లు  9281, 8137. అయితే ప్రస్తుతం రుసుం వసూళ్లకు కేటాయించిన అధికారిక రసీదు పుస్తకాల్లోని సీరియల్‌ నంబర్లు 12,500, 13,200గా ఉన్నాయి. దీంతో  ఈ అసలు నంబర్లకు సంబంధం లేని నకిలీ రశీదు పుస్తకాలను తయారు చేసి నగదు వసూలు చేస్తూ, సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో జమ చేయకుండా అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని బి.కొత్తకోట తహసీల్దార్‌ నిర్మలాదేవిని సబ్‌కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో వీఆర్‌ఏలు ఎస్‌.వెంకటరమణ, ఎస్‌.మస్తాన్‌వలీని సస్పెండ్‌ చేస్తూ బుధవారం తహసీల్దార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఒక్కరోజులో రూ.1,700 
బుధవారం టోల్‌గేటు వసూలుకు ఇద్దరు వీఆర్‌ఏలను కొత్తగా నియమించగా ఊహించని విధంగా రూ.1,700 వసూలు కావడం చూసి రెవెన్యూ అధికారులే ఆశ్చర్యపోయారు. సాధారణ రోజుల్లో ఈ స్థాయిలో టోల్‌ వసూలైనట్టు గత పదేళ్లలో ఎన్నడూ చూపలేదని స్పష్టమైంది. దీన్నిబట్టి చూస్తే తీవ్ర రద్దీగా ఉండే శుక్ర, శని, ఆదివారాల్లో రోజుకు కనీసం రూ.5వేలు తగ్గకుండా వసూలు కావాలి. ఏడాదికి కనీసం రూ.7లక్షలు వసూలవ్వాలి. ఈ స్థాయిలో నగదు జమ అయ్యిందా లేదా అన్నది పరిశీలిస్తే ఏ మేరకు నకిలీ రశీదులతో దోచుకున్నారో తేలుతుంది. వసూళ్ల జమపై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. స్వయంగా సబ్‌ కలెక్టరే నిజాలు నిగ్గుతేల్చడంతో వీఆర్‌ఏల వ్యవహారానికి చెక్‌పడింది.

11న వేలం పాట 
హార్సిలీహిల్స్‌పైకి వెళ్లే వాహనాల నుంచి టోల్‌ రుసుం వసూలు అవకతవకల నేపథ్యలో ఈ కాంట్రాక్ట్‌ను ప్రయివేటుకు అప్పగించేందుకు సబ్‌ కలెక్టర్‌ జాహ్నవి నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 11న వేలం పాట నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. పాటదారులు రూ.500 చెల్లించి పాల్గొనవచ్చని తెలిపారు.

మరిన్ని వార్తలు