మీనం.. దీనం: తగ్గిన చేపల ధరలు

14 Apr, 2021 10:24 IST|Sakshi

టన్నుకు రూ.20 వేల చొప్పున రైతుకు ఆదాయ నష్టం

ఎక్కువ కాలం చెరువుల్లోనే ఉంచేయాల్సిన దుస్థితి

పెరిగిన మేత, నిర్వహణ ఖర్చులు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: చేపల ధరలు పడిపోవడంతో రాష్ట్రంలోని ఆక్వా రైతులు నష్టాలను చవిచూసే పరిస్థితులు తలెత్తాయి.  శీలావతి, కట్ల, బొచ్చె చేపలను 15 రోజులక్రితం వరకు కిలో రూ.110 వరకు ఎగుమతిదారులు కొనుగోలు చేయగా.. ప్రస్తుతం ఆ ధర రూ.90కి పడిపోయింది. ధరలు పడిపోవడం, ఎగుమతులు మందగించడంతో చేపల్ని చెరువుల్లోనే ఉంచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల మేత, నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయి. కిలోకు రూ.20 చొప్పున ధర తగ్గడంతో రైతులు టన్నుకు రూ.20 వేల ఆదాయాన్ని నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మేత, నిర్వహణ ఖర్చుల రూపంలో మరో రూ.10 వేల వరకు నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.

ఉత్పత్తి పెరిగింది.. డిమాండ్‌ తగ్గింది
రాష్ట్రవ్యాప్తంగా 2.25 లక్షల హెక్టార్లలో రైతులు చేపల సాగు చేస్తున్నారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 1.20 లక్షల హెక్టార్లలో రైతులు చేపలు సాగు చేస్తుండగా.. తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంలో ఏటా సుమారు 22.50 లక్షల టన్నులకు పైగా చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. మన రాష్ట్రం నుంచి 15 రోజుల క్రితం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, నాగాలాండ్, బిహార్, కర్ణాటక రాష్ట్రాలకు రోజుకు సగటున 6,500 టన్నుల చేపలు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం 3,900 టన్నులు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. 15 రోజుల క్రితం వరకు శీలావతి, కట్ల, బొచ్చె వంటి రకాల చేపలను కిలో రూ.110 వరకు ఎగుమతిదారులు కొనుగోలు చేయగా.. ప్రస్తుతం కిలో రూ.90కి పడిపోయింది. పెట్టుబడులు, లీజు, మేత, కూలీల ఖర్చులు పెరిగిపోయిన తరుణంలో చేపల ధర తగ్గడం రైతులను నష్టాలకు గురి చేస్తోంది.

మరోవైపు బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లోనూ చేపల సాగు మొదలవడంతో ఉత్పత్తి పెరిగింది. దీంతో ఆయా రాష్ట్రాలకు ఎగుమతులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని, దీనివల్ల ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో విద్యుత్‌ కొరత,  యూనిట్‌ ధరలు ఎక్కువ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్‌ అందించడంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఆక్వా ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. గత ఏడాది కరోనా వైరస్‌ విజృంభించిన సమయంలో ఇతర రాష్ట్రాల్లో చేపల దిగుమతులు నిలిచిపోకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకోవడంతో ఆక్వా రైతులు ఎంతో ఉత్సాహంతో సాగును చేస్తున్నారు. 

స్థానిక మార్కెట్లూ మందగమనమే
కోవిడ్‌ కారణంగా పట్టణ పేదల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి. సెకండ్‌ వేవ్‌ ఉధృతమవుతుండటంతో ఆ ప్రభావం స్థానిక చేపల మార్కెట్లలో కొనుగోలుపై పడుతోందని రైతులు చెబుతున్నారు. మరోవైపు గోదావరిలో నీరు తక్కువగా ఉండటం, చేపల చెరువులకు నీరిచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. చేపల చెరువులకు మరికొంత కాలం నీరివ్వగలిగితే కొంతకాలం పట్టుబడులు పట్టకుండా ఆపవచ్చని, ఈలోగా ధర పెరిగితే నష్టాల నుంచి గట్టెక్కుతామని రైతులు అభిప్రాయపడుతున్నారు.

కొనుగోలు శక్తి తగ్గడం వల్లే.. 
కోవిడ్‌ తదనంతర పరిణామాల వల్ల వివిధ రాష్ట్రాలలోని పట్టణ ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది. దీంతో చేపల ఎగుమతులపై దీని ప్రభావం పడుతోంది. కిలో ధర వంద రూపాయలకు తగ్గితే రైతులు నష్టపోతారు. ఇతర రాష్ట్రాలలో చేపల పెంపకం పెరగడం కూడా ధరపై ప్రభావం చూపుతోంది.
– ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వైస్‌ చైర్మన్, రాష్ట్ర వ్యవసాయ మిషన్‌

కిలోకు రూ.20 తగ్గింది 
నెల రోజుల్లో చేపల ధర కిలోకు రూ.20 వరకూ తగ్గింది. ఇతర రాష్ట్రాల్లో చేపల ఉత్పత్తి పెరగడం, అక్కడ చేపల పట్టుబడులు ముమ్మరంగా చేపట్టడమే ఇందుకు కారణం. రైతులంతా ఒకేసారి చెరువుల్లో చేప పిల్లలు వేయకుండా జాగ్రత్త వహిస్తే.. చెరువులన్నీ ఒకేసారి పట్టుబడులకు రాకుండా ఉంటాయి. తద్వారా చేపల ధరల తగ్గుదలను నివారించవచ్చు.
– గాదిరాజు సుబ్బరాజు, అధ్యక్షుడు, చేపల రైతుల సంఘం

కరోనా ప్రభావంతో..
కరోనా ప్రభావం ఇంకా ప్రజల్లో పూర్తిగా తొలగిపోలేదు. దేశవ్యాప్తంగా చేపల కొనుగోలు చేసేవారి సంఖ్య  తగ్గడంతో  ధరలు తగ్గుతున్నాయి. దీనికితోడు ఇతర రాష్ట్రాల్లో చేపల పెంపకం పెరగడంతో అక్కడి వినియోగదారులు లైవ్‌ ఫిష్‌ తినడానికి అలవాటుపడ్డారు. దీనివల్ల ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే చేపలకు గిరాకీ తగ్గింది.
– శాయన సుపర్ణ, చేపల రైతు, ఆకివీడు, పశ్చిమ గోదావరి
చదవండి:
రూ.92 కోట్లతో పార్కులు.. పచ్చదనం 
చంద్రబాబు నుంచి ప్రాణ హాని..  

మరిన్ని వార్తలు