అడుగంటిన శ్రీశైలం

6 Jul, 2021 04:33 IST|Sakshi

ఎడమగట్టు కేంద్రంలో యథేచ్ఛగా తెలంగాణ విద్యుదుత్పత్తి 

దీంతో శ్రీశైలంలో 37.46 టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వ 

సాగర్, పులిచింతల్లోనూ కొనసాగుతున్న విద్యుదుత్పత్తి 

ప్రకాశం బ్యారేజీ నుంచి 8,440 క్యూసెక్కులు వృథాగా కడలిలోకి.. 

నేడు బ్యారేజీలోకి 13 వేల నుంచి 14 వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం

సాక్షి, అమరావతి/సత్రశాల (రెంటచింతల)/విజయపురి సౌత్‌: కృష్ణా బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 14,126 క్యూసెక్కులను దిగువకు తరలిస్తోండటంతో నీటి నిల్వ డెడ్‌ స్టోరేజీకి పడిపోయింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 815.19 అడుగుల్లో 37.46 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. మరోవైపు నాగార్జునసాగర్, పులిచింతల్లోనూ యథేచ్ఛగా తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీలోకి 10,093 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. కృష్ణా డెల్టా కాలువలకు 1,653 క్యూసెక్కులు వదలి.. మిగులుగా ఉన్న 8,440 క్యూసెక్కులను 20 గేట్లను అర్ధ అడుగు మేర ఎత్తి వృథాగా సముద్రంలోకి విడుదల చేస్తున్నామని ఈఈ స్వరూప్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం పులిచింతల ప్రాజెక్టులో తెలంగాణ విద్యుదుత్పత్తిని పెంచిన నేపథ్యంలో మంగళవారం ప్రకాశం బ్యారేజీలోకి 13 నుంచి 14 వేల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉంది. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న ఒక టీఎంసీని వృథాగా సముద్రంలోకి విడుదల చేయాల్సిన దుస్థితి దాపురించిందని అధికారులు తెలిపారు.  

► గత రెండు రోజులుగా కరూŠన్‌లు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో హంద్రీ ద్వారా 11 వేలు, తుంగభద్ర ద్వారా 9 వేల క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. జూరాల నుంచి వస్తున్న ప్రవాహంతో కలిపి శ్రీశైలంలోకి 25,532 క్యూసెక్కులు వస్తున్నాయి. తెలంగాణ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తుండటంతో శ్రీశైలంలో నీటిమట్టం తగ్గిపోతోంది. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా పూర్తి నీటి నిల్వ 215.81 టీఎంసీలు. 
► నాగార్జునసాగర్‌లోకి 30,715 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో తెలంగాణ దిగువకు వదిలేస్తోంది. దీంతో సాగర్‌లో నీటి నిల్వ ఏ మాత్రం పెరగడం లేదు. ప్రస్తుతం సాగర్‌లో 532.91 అడుగుల్లో 173.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా నీటి నిల్వ 312.04 టీఎంసీలు. 
► సాగర్‌ నుంచి దిగువకు విడుదల చేసిన ప్రవాహానికి మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 41,877 క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో నీరు 31.88 టీఎంసీలకు చేరింది. దీని పూర్తి నిల్వ 45.77 టీఎంసీలు. ఇది నిండాలంటే ఇంకా 13.89 టీఎంసీలు అవసరం. పులిచింతల్లో నీటి నిల్వ పెరగడంతో తెలంగాణ విద్యుదుత్పత్తిని క్రమేణా పెంచుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే ప్రవాహం పెరుగుతోంది. 

మరిన్ని వార్తలు