తమాషాలు చేస్తున్నారా?.. కోర్టుతో ఆటలా?.. భార్యాభర్తలపై హైకోర్టు ఆగ్రహం 

10 Jun, 2022 08:48 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఓ వ్యక్తితో తలెత్తిన ఆర్థిక వివాదం పరిష్కారానికి పోలీసుల ఆదేశం మేరకు స్టేషన్‌కు వెళ్లిన తన భార్య తిరిగి రాలేదని, ఆమెను కోర్టు ముందు హాజరు పరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన వ్యక్తిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్‌కు, ఆయన భార్యకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని, అందుకే ఆమె కొన్నాళ్లు భర్తకు దూరంగా వెళ్లిందని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. ప్రస్తుతం వారిద్దరూ కలిసి ఉంటున్నారని వివరించారు. దీంతో పిటిషనర్‌ మంథా రవిప్రసాద్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.
చదవండి: భర్త నుంచి విడాకులు.. ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..

ఏం తమాషాలు చేస్తున్నారా? భార్య, భర్త కలిసి కోర్టుతో ఆడుకుంటున్నారా అంటూ మండిపడింది. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు, కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రవిప్రసాద్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

భేదాభిప్రాయాల కారణంతో  వెళ్లిపోయింది 
పశ్చిమ గోదావరి జిల్లా, ఉండ్రాజవరానికి చెందిన మనురాజు శ్యాంకుమార్‌ తమకు రూ. 5 లక్షలు ఇవ్వాలని, ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు పోలీసులు తన భార్య ఉషా పది్మనిని స్టేషన్‌కు పిలిపించారని, అప్పటి నుంచి ఆమె కనిపించడంలేదంటూ రవిప్రసాద్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. గత వారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. స్టేషన్‌కు వెళ్లిన మహిళ కనిపించకపోవడం తీవ్రమైన విషయమంటూ ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించిన సంగతి విదితమే. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది వైఎన్‌ వివేకానంద స్పందిస్తూ, పిటిషనర్‌ భార్యను ఏ కేసు విషయంలోనూ స్టేషన్‌కు పిలిపించలేదంటూ పోలీసులు అఫిడవిట్‌ దాఖలు చేశారని వివరించారు. కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన తరువాత ఉషా పద్మిని భర్త వద్దకు తిరిగి వచ్చిందని చెప్పారు.

ఆమె ఇంటి నుంచి ఎందుకు వెళ్లిందని ధర్మాసనం ప్రశ్నించగా.. భర్తతో భేదాభిప్రాయాల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయారని వివేకానంద తెలిపారు. దీంతో ధర్మాసనం పిటిషనర్‌పైన, ఉషా పద్మినిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వారి మధ్య వివాదం ఉంటే, పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. డబ్బు ఇవ్వాల్సిన శ్యాం కుమార్, పోలీసులు కుమ్మక్కయ్యారని, ఉషా పద్మినిని కిడ్నాప్‌ చేశారని రవిప్రసాద్‌ తరఫు న్యాయవాది ఆరోపించారు. వేటి ఆధారంగా పోలీసులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని ధర్మాసనం ప్రశి్నంచింది. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నందుకు పిటిషనర్‌పై ఎందుకు చర్యలు తీసుకోకూడదని ప్రశ్నించింది. భార్య, భర్త మధ్య గొడవ ఉంటే కోర్టుకొచ్చి ఏవేవో చెబుతూ కోర్టు ప్రక్రియను దురి్వనియోగం చేశారని మండిపడింది. కోర్టుతో ఆడుకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. 

మరిన్ని వార్తలు