‘హిందూజకు చెల్లింపుల విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోంది’

26 May, 2023 20:47 IST|Sakshi

సాక్షి, విజయవాడ: హిందూజ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎలాంటి ప్రగతి చూపకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు ఉచితంగా డబ్బులిస్తోందని గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని, అపోహలేనని ఇంధనశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల, విద్యుత్ పంపిణీ సంస్థల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని న్యాయ నిఫుణుల సలహా, సూచనల మేరకు పారదర్శకతతో, ప్రణాళికాబద్ధంగా, చట్టం ప్రకారం, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఎలక్ట్రిసిటీ రెగ్యులరేటరి కమిషన్ ఆదేశాలనుసారం, న్యాయశాఖ పరిశీలించి ధృవీకరించిన తర్వాతే హిందూజ సంస్థకు చెల్లింపుల విషయంలో నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని విజయానంద్ స్పష్టం చేశారు. 

కాగా, శుక్రవారం విజయవాడలోని విద్యుత్ సౌధ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయానంద్ మాట్లాడుతూ.. హిందూజ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్‌కు సంబంధించిన పలు వాస్తవాలను ప్రజల దృష్టికి తెచ్చేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా ఒక విద్యుత్ కొనుగోలు సంస్థతో ఒప్పందం చేసుకున్నప్పుడు ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి చట్టాలు, నిబంధనలు, పవర్ పర్చేజ్ ఒప్పందం ప్రకారం ఆ ఒప్పందం గడువు పూర్తవ్వక ముందే విద్యుత్ సరఫరా కొనుగోలు చేయమని చెప్పిన పక్షంలో సాధారణంగా ఫిక్స్‌డ్ ఛార్జీలు, వేరియబుల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 

పీపీఏ ఉన్నంత వరకు విద్యుత్ తీసుకున్నా, తీసుకోకపోయినా ఫిక్స్‌డ్ ఛార్జీలు తప్పక చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌కు ప్రభుత్వం డబ్బులు కట్టిందన్న మాటలు అవాస్తవమని, నిరాధారమని స్పష్టం చేశారు. మార్చి 2022 తర్వాత హిందూజ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం 1040 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసిందన్నారు. అంతేగాక రాష్ట్రానికి అదనంగా 15 మిలియన్ యూనిట్లు విద్యుత్ సరఫరా అవుతోందని విజయానంద్ తెలిపారు. హిందూజ సంస్థతో ప్రస్తుత ప్రభుత్వం ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేయడం తగదన్నారు. హిందూజ సంస్థతో 1994లోనే ఒప్పందం కుదిరిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక, ఈ సమావేశంలో  ఇంధన శాఖ జాయింట్ సెక్రటరీ బీఏవీపీ కుమార్ రెడ్డి, ఏపీసీపీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జె.పద్మ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ అస్వస్థత

మరిన్ని వార్తలు