ఆ వెలుగులకు వందేళ్లు

13 Nov, 2020 10:19 IST|Sakshi
తారాజువ్వల తయారీలో నిమగ్నమైన మహిళలు (ఇన్‌సెట్‌) మందుగుండు సీతారామయ్య దంపతులు (ఫైల్‌) 

వందేళ్లుగా బాణసంచా తయారీ

జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు

మందుగుండు సీతారామయ్య కుటుంబం ప్రతిభ

దీపావళి అంటే అందరికీ టపాసులు, మతాబులు గుర్తొస్తాయి. పూజలు మినహాయిస్తే మతాలకతీతంగా బాణసంచాను కాలుస్తారు. చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారు. జ్ఞాపకాల దొంతరలో దీపావళి స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటారు. దీపావళి అనగానే విశాఖ జిల్లాలోని అనకాపల్లి గుర్తుకొస్తుంది. శతాబ్ధం నుంచి బాణసంచా తయారు చేస్తున్న సీతారామయ్య కుటుంబ సభ్యుల ఇంటిì పేరు మందుగుండుగా మారిందంటే వారి విశిష్టత అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది నవంబర్‌ 14న దీపావళి పండుగ నేపథ్యంలో అనకాపల్లి మందుగుండు సీతారామయ్యపై కథనం.  – అనకాపల్లి

అనకాపల్లి పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది బెల్లం. జాతీయ స్థాయిలో బెల్లం లావాదేవీలు నిర్వహించే బెల్లం మార్కెట్‌ ఉంది. వెలుగులు విరజిమ్మే బాణసంచా తయారీలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న బాణ సంచా కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. వందేళ్ల నుంచి అనకాపల్లి కేంద్రంగా బాణ సంచా తయారు చేసే సీతారామయ్య కుటుంబం ఇక్కడ ఉంది. స్వాతంత్య్రం రాక ముందు నుంచి బాణసంచా తయారు చేస్తున్న ఈ కుటుంబానికి చెందిన కొందరు ఇప్పటికీ అదే వృత్తిలో కొనసాగడం విశేషం.   (విశాఖకు పోలవరం)

శతాబ్ధానికి పైగా చరిత్ర
వందేళ్ల క్రితం అనకాపల్లిలో జరిగిన దీపావళిని చూసి బుద్ద సీతారామయ్యకు మందుగుండు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. దీని కోసం ఆయన చాలా విషయాలు నేర్చుకున్నారు. 1920 సమయంలో అనకాపల్లికి చెందిన ఉప్పల వంశస్తులు కటక్‌ నుంచి బాణసంచా తీసుకొచ్చి వెలిగించారు. అది చూసిన సీతారామయ్య అదే బాణసంచా మనమెందుకు తయారు చేయకూడదని భావించారు.

జాతర కార్యక్రమాలకు బాణసంచా విన్యాసాల సామగ్రి తయారీలో నిమగ్నమైన సిబ్బంది (ఫైల్‌)
​​​​​​​

1942లో అధికారిక అనుమతి
1920 నుంచి అనకాపల్లిలో మందుగుండు సీతారామయ్య బాణసంచా తయారీ చేసినప్పటికీ.. 1942లో అధికారికంగా తయారీకి అనుమతి పొందారు. మందుగుండు తయారీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడంతో బుద్ధ సీతారామయ్య పేరు కాస్త.. మందుగుండు సీతారామయ్యగా మారిపోయింది. బుద్ద సీతారామయ్య వంశంలో ఒకరిద్దరు తప్ప అందరూ బాణసంచా తయారీ, అమ్మకాల వృత్తిలో స్థిరపడ్డారు. 

ఏడాది పొడవునా బాణసంచా తయారీ
చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, మతాబులు, మిన్నలు, టపాసులు తయారు చేయడంలో మందుగుండు సీతారామయ్య కుటుంబ సభ్యులకు ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. వీరి వద్ద నిత్యం పదుల సంఖ్యలో బాణసంచా తయారు చేసేందుకు కార్మికులు పని చేస్తుంటారు.

కుటుంబ నేపథ్యం
బుద్ద సీతారామయ్యకు ఒకే ఒక కుమార్తె ఉన్నారు. దీంతో మేనల్లుడైన యల్లపు సీతారామయ్యను కుమార్తె అమ్మాజమ్మకు ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తీసుకొచ్చారు. సీతారామయ్య, అమ్మాజమ్మకు ఐదుగురు కుమారులు. వీరిలో మూడో కుమారుడు సీతారామయ్య బాణసంచా వ్యాపారం చేయకుండా విశాఖలో వ్యాపారిగా స్థిరపడ్డారు. మొదటి కుమారుడు మరణించగా మిగిలిన కుమారులు, మనుమలు సైతం బాణసంచా వ్యాపారంలోనే స్థిరపడ్డారు. గ్రామీణ జిల్లాలో చాలా చోట్ల శుభ, అశుభ కార్యక్రమాలు, దీపావళి, వినాయక నవరాత్రులలో బాణసంచా కాలిస్తే.. అది ఒక్క సీతారామయ్య కుటుంబ సభ్యులు తయారు చేసిందే అనడం అతిశయోక్తి కాదు. 

బ్రిటీష్‌ క్రీడోత్సవాల్లోనూ..
►1942లో బ్రిటిష్‌ పాలకులు నిర్వహించిన క్రీడోత్సవాల్లో మందుగుండు వెలిగించి అప్పటి పాలకుల అవార్డులు అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి శంకర్‌ దయాల్‌శర్మ మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేసినపుడు ఆయన సమక్షంలోనే బాణసంచా కాల్చి ప్రశంసలు అందుకున్నారు.
►మందుగుండు సీతారామయ్య 1977లో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఆహ్వానం మేరకు పులివెందుల వెళ్లి బాణసంచా కాల్చడం ద్వారా తన పేరు ప్రఖ్యాతులను ఇనుమడింపజేసుకున్నారు. 
►ముంబైలో అప్పటి కేంద్ర మంత్రి రాజేష్‌ పైలట్‌ సమక్షంలో స్టేడియంలో బాణసంచా కాల్చి ప్రశంసలు అందుకున్నారు.
►మంగుళూరు, కోల్‌కత్తా, ఖరగ్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో జరిగే ఉత్సవాలకు కూడా సీతారామయ్యను ఆహ్వాంచడం ఆయన ప్రతిభకు నిదర్శనం.

మరిన్ని వార్తలు