ఆరు నెలల వయసులో కన్న కూతురు.. ఇప్పుడు పెళ్లీడుకొచ్చిన కొడుకు

22 Apr, 2022 11:06 IST|Sakshi

ఆరు నెలల పసిప్రాయంలోనే కూతురు చనిపోయింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని కన్నవారు ఎన్నో కలలు కన్నారు. అమ్మానాన్నల ఆశలను ఆవిరి చేస్తూ తనయుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. దేవుడా ఇక మేం ఎవరి కోసం బతకాలి.. అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. 

సాక్షి, అన్నమయ్య జిల్లా: పెద్దతిప్పసముద్రం మండలం కాట్నగల్లుకు చెందిన కొక్కల శ్యామలమ్మ, నారాయణ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు సంతానం. ఆరు నెలల వయసులోనే కుమార్తె మృతి చెందింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకు జగదీష్‌ (25)ను బాగా చదివించారు. గత రెండేళ్ల నుంచి బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకు ప్రయోజకుడై కుటుంబానికి అండగా ఉన్నాడని ఆ తల్లిదండ్రులు సంబరపడ్డారు. రెండు నెలల నుంచి వారు తమ కుమారుడిని ఓ ఇంటివాడిని చేయాలని భావించి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో జగదీష్‌ ఐదు రోజుల క్రితం జ్వరం బారిన పడటంతో పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించారు. జ్వరం తగ్గుముఖం పట్టడంతో ఇంటికి వచ్చేశారు. కాగా గురువారం మళ్లీ జ్వరం వచ్చి స్పృహ కోల్పోవడంతో వెంటనే ఓ ప్రైవేటు వాహనంలో బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అప్పటికే యువకుడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. తమ కళ్లెదుటే చెట్టంత కొడుకు మరణించాడనే వార్త విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురై కుప్పకూలిపోయారు. అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడే యువకుడు హఠాత్తుగా మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.   

చదవండి👉🏾 (త్వరలో పెళ్లి, అంతలోనే కాబోయే భార్యభర్తలు జలసమాధి)

మరిన్ని వార్తలు