మీరక్కడ క్షేమమేనా!

16 Feb, 2022 03:46 IST|Sakshi

ఉక్రెయిన్‌ వెళ్లిన వారి యోగక్షేమాలపై కుటుంబ సభ్యులు, బంధువుల ఆరా

స్వదేశానికి తిరిగి వచ్చేయాలని ఒత్తిడి

ఆందోళనకర పరిస్థితులు లేవంటున్న ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులు

సాక్షి, అమరావతి: ఉక్రెయిన్‌–రష్యా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఉక్రెయిన్‌లో ఉంటున్న తెలుగు వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ ఎప్పుడు, ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందోనని భీతిల్లుతున్నారు. నిత్యం తమ వారితో ఫోన్లలో మాట్లాడుతున్నా క్షేమంగా స్వదేశానికి వచ్చేస్తే మంచిదని చెబుతున్నారు. యుద్ధం అనివార్యమైతే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, స్వదేశానికి తిరిగి వెళ్లిపోదామా? వద్దా? అనే మీమాంసలో అక్కడి తెలుగు వారు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. విద్య, ఉపాధి నిమిత్తం ఏపీకి చెందిన పలువురు ఉక్రెయిన్‌లో ఉంటున్నారు.

ఏపీ నుంచి వైద్య విద్య అభ్యసించడం కోసం ఎక్కువ మంది విద్యార్థులు ఉక్రెయిన్‌కు వెళ్తుంటారు. వినిచా, డ్నిప్రో, కైవ్, బోగోమోలెట్స్‌ యూనివర్సిటీల్లో తెలుగు విద్యార్థులు ఎక్కువగా చదువుతుంటారు. వినిచా యూనివర్సిటీలో 200 నుంచి 250 మంది, మిగిలిన యూనివర్సిటీలు కూడా కలుపుకుంటే 2 వేల మంది ఏపీ విద్యార్థులు ఉంటారని అంచనా. ప్రస్తుతం భయాందోళనలకు గురయ్యేంత పరిస్థితులు ఉక్రెయిన్‌లో లేవని, ప్రశాంత వాతావరణమే నెలకొందని ఉందని అక్కడి వారు చెబుతున్నారు. రష్యాకు సరిహద్దున ఉన్న నగరాల్లో కొంత ఆందోళనకర వాతావరణం ఉన్నట్టు స్పష్టం చేస్తున్నారు.

మేం బాగానే ఉన్నాం
మాది గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు. ఉక్రెయిన్‌లోని వినిచా వర్సిటీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాను. యుద్ధ వాతావరణం కమ్ముకుంటున్న నేపథ్యంలో ఇండియన్‌ ఎంబసీ అప్రమత్తమైంది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులందరి వివరాలను సేకరిస్తోంది. ఆన్‌లైన్‌లో మా వివరాలను ఎంబసీకి పంపించాం. భారత్‌కు వెళ్లాలనుకున్న వారు వెళ్లొచ్చని అధికారులు చెప్పారు. అనవసరంగా బయట తిరగవద్దని సూచించారు. యుద్ధం అనివార్యమై ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి  స్వదేశానికి చేరుస్తామని ఎంబసీ చెప్పింది.  మీడియాలో వస్తున్న వార్తలు చూసి ఇంటినుంచి తల్లిదండ్రులు ఫోన్‌ చేస్తున్నారు.  దేశానికి తిరిగి వచ్చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు బాగున్నాయి.
– భానుప్రకాష్, ఉక్రెయిన్‌లో చదువుతున్న తెలుగు విద్యార్థి

ప్రశాంత వాతావరణమే ఉంది
నేను రష్యా సరిహద్దుల్లోని సేవరో దోనెస్క్‌లో ఉంటాను. ఇక్కడ అంతా ప్రశాంత వాతావరణమే ఉంది. 2014లో యుద్ధ సమయంలో నేను ఇక్కడే ఉన్నాను. అప్పటితో పోలిస్తే యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజలందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న భారతీయులపై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 
            – డాక్టర్‌ కుమార్, తెలుగు వైద్యుడు, ఉక్రెయిన్‌ 

మరిన్ని వార్తలు