శవంతో సావాసం! 

10 Oct, 2020 08:57 IST|Sakshi
ఈశ్వరమ్మ(ఫైల్‌)

రోజుల తరబడి ఇంట్లోనే మృతదేహం 

అయినా పట్టించుకోని కుటుంబసభ్యులు

దుర్వాసనతో వెలుగులోకి వచ్చిన వైనం

ఆదిత్యనగర్‌ కాలనీలో సంఘటన 

సాక్షి, శ్రీకాకుళం రూరల్‌: ఇంట్లోనే శవం ఉన్నా కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. కనీసం ఆమె ఉన్నారో..లేదో కూడా వారికి జ్ఞాపకం లేదు. శవం కుళ్లిపోయి దుర్వాస వచ్చినా తెలియరాలేదు. చివరకు ఆ వీధిలో వారు విపరీతంగా వస్తున్న వాసనను భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషాద ఘటన శ్రీకాకుళంలోని అరసవల్లి ఆదిత్యనగర్‌ కాలనీలో శుక్రవారం వెలుగుచూసింది.రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలాకి సత్యనారాయణ ఇరిగేషన్‌ శాఖలో అటెండర్‌గా పని చేసి రిటైర్‌ అయ్యారు. ఇతనికి భార్య ఈశ్వరమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరంతా ఆదిత్యనగర్‌ కాలనీలో సొంత ఇంట్లో నివసిస్తున్నారు. అయితే వీరికి ఇరుగుపొరుగు వారితో ఎలాంటి సబంధం లేదు. దీంతో వీరిని కూడా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఈ క్రమంలోనే సత్యనారాయణ భార్య ఈశ్వరమ్మ(60) ఓ గదిలో చనిపోయారు. అయితే ఎప్పుడు చనిపోయిందో కానీ ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. (చదవండి: దారుణం: జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ..)

శవం కుళ్లిపోయి వాసన వస్తున్నా గుర్తించలేకపోయారు. రోజురోజుకూ పెరిగిపోతున్న దుర్వాసనను భరించలేని స్థానికులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది, రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు అక్కడి పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు. మంచంపై కుళ్లిపోయి ఈశ్వరమ్మ శవం కనిపించింది. ఇళ్లంతా చెత్తతో నిండి ఉంది. అందులో ఉంటున్నవారంతా మతిస్థిమితం లేకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ కనిపించారు. వారి నుంచి వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నించినా సమాధానం చెప్పలేకపోయారు. మానసికంగా ఇంట్లో అందరి పరిస్థితి ఒకేలా ఉండడం, ఈశ్వరమ్మకు తిండి లేకపోవడంతోనే చనిపోయి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు స్వర్గధామ రథంలో మృతదేహాన్ని రోటరీ శ్మశానవాటికకు తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. కాగా ఈ కుటుంబం గురించి స్థానికులతో పోలీసులు మాట్లాడగా.. అప్పుడప్పుడూ సత్యనారాయణ బయటకు వెళ్లి సామాన్లు తీసుకొని వచ్చేవారని, ఎవరితో మాట్లాడేవారు కాదని, ఇంటినిండా చెత్తను ఉంచుకునేవారని చెప్పారు. (చదవండి: సోషల్‌ మీడియాలో పరిచయం.. ఆపై)

మరిన్ని వార్తలు