ఏడు నిమిషాల్లో రేషన్‌ కార్డు! 

22 Sep, 2020 12:40 IST|Sakshi
రేషన్‌కార్డు అందుకుంటున్న రాహేలు

ఐదేళ్లుగా రేషన్‌కార్డుకు నోచుకోని దివ్యాంగ కుటుంబం

గ్రామ సచివాలయంలో నిమిషాల వ్యవధిలో కార్డు 

బల్లికురవ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థ గ్రామాల్లోని లబ్ధిదారులకు భరోసానిస్తోంది. రేషన్‌కార్డు కోసం మండలంలోని ముక్తేశ్వరం పంచాయతీలోని సూరేపల్లి గ్రామంలోని ఓ దివ్యాంగ కుటుంబం గత ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో అనేకసార్లు తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసినా జన్మభూమి కమిటీలో కార్డు మంజూరుకు మోకాలడ్డారు. దీంతో విసిగి వేసారిన ఆ కుటుంబం సోమవారం గ్రామ వలంటీర్‌కు రేషన్‌కార్డు లేదని చెప్పిన 7 నిమిషాల్లోనే తక్షణమే మంజూరు చేయడంతో పాటు కార్డు అందజేశారు.

వివరాల్లోకి వెళితే.. సూరేపల్లి గ్రామానికి చెందిన తోరటి వినోద్‌ కుమార్‌కు పుట్టుకతోనే పోలియో సోకింది. ఏ పనీ చేయలేడు. 2014లో గుంటూరు జిల్లా గురజాలకు చెందిన మరో దివ్యాంగురాలు రాహేలును వివాహం చేసుకున్నాడు. 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  వైఎస్సార్‌ సీపీకి ఓట్లు వేశారన్న అక్కసుతో జన్మభూమి కమిటీ తమకు కార్డు రాకుండా అడ్డుకున్నారని వినోద్‌ కుమార్, రాహేలు వాపోయారు. గ్రామ వలంటీర్‌ మార్కు తమ ఇంటికి రాగా కార్డు లేదని చెప్పగా వెంటే సచివాలయానికి తీసుకువెళ్లి 10.50 గంటలకు దరఖాస్తు చేయించగా 7 నిమిషాల్లోనే వీఆర్‌వో వీరనారాయణ, తహసీల్దార్‌ అశోక్‌ వర్ధన్‌ మంజూరు చేయటంతో వెంటనే ప్రింట్‌ తీసి లబ్ధిదారు రాహేలుకు అందజేశారు. 

సీఎం, అధికారులకు రుణపడి ఉంటా : తోరటి రాహేలు 
5 సంవత్సరాల క్రితం రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసి.. చివరకు మాకు రాదని విసిగిపోయాం. వలంటీర్‌ మార్కు మా ఇంటికి వచ్చి మీకు కార్డు వెంటనే ఇప్పిస్తామని చెప్పి  7 నిమిషాల్లోనే అందజేయటం ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి, అధికారులకు, వలంటీర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. రేషన్‌కార్డు లేక ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు అందలేదు.  

మరిన్ని వార్తలు