ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత

4 Aug, 2020 06:57 IST|Sakshi

సాక్షి, విజయనగరం: ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు(77) కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురం పెదబొందపల్లిలోని తన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. 1972 జననాట్య మండలిని స్థాపించి.. తన జానపద గేయాలతో పల్లెకారులతో పాటు గిరిజనులను వంగపండు ఎంతగానో చైతన్యపరిచారు. తన జీవిత కాలంలో వందలాది ఉత్తరాంధ్ర జానపదాలకు వంగపండు గజ్జెకట్టాడు. ఏం పిల్లడో ఎల్దమొస్తవ పాటతో వంగపండు ప్రఖ్యాతి చెందారు. అర్థరాత్రి స్వతంత్య్రం సినిమాతో వంగపండు సినీ ప్రస్థానం మొదలైంది. 2017లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేత కళారత్న పురస్కారం అందుకున్నారు.

వంగపండు మరణంపై ప్రజాగాయకుడు, విప్లవకవి గద్దర్‌ స్పందిస్తూ.. వంగపండు పాట కాదు ప్రజల గుండె చప్పడు. అక్షరం ఉన్నంత వరకు వంగపండు ఉంటాడు. ఆయన పాటలు 10 భాషల్లోకి అనువదించబడ్డాయి. మూడు దశాబ్దాలలో 300కుపైగా పాటలు పాడారు. పాటను ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఘనత వంగపండుది అని పేర్కొన్నారు.

వంగపండు మరణం ఉత్తరాంధ్ర కళాకారులకే కాకుండా జానపదానికే తీరని‌లోటని ప్రజా గాయకుడు దేవిశ్రీ కన్నీటి‌ పర్యంతమయ్యారు. వంగపండుతో తమ కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యముందని.. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో తాను ఉద్యోగం వదిలి ప్రజా గాయకుడిగా రాణించానన్నారు. ప్రజా సమస్యలపై ఎప్పటికపుడు స్పందిస్తూ ఉత్తరాంధ్ర జానపదానికి వన్నెతెచ్చిన‌ మహానుభావుడు వంగపండు అని అన్నారు. ఉత్తరాంధ్ర జానపదం రాలిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి దగ్గర నుంచి వంగపండుతో తమకి ఎంతో సాన్నిహిత్యముందన్నారు. ఆయనది తమది‌ పక్కపక్కనే ఊర్లని వంగపండు ప్రభావం తనలాంటి ఎందరో కళాకారులపై ఉందన్నారు. ఆయన మరణంపై వారి కుటుంబానికి‌ ప్రగాడ సానుభూతి వ్యక్తం చేస్తున్నానన్నారు.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు