రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. 

30 Jun, 2021 08:23 IST|Sakshi
డీఈఓ నరసింహారెడ్డి

విద్యాసంక్షేమ పథకాల అమలులో తనదైన మార్క్‌ 

జిల్లాలో విద్యాభివృద్ధికి విశేష కృషి

నేడు డీఈఓ నరసింహారెడ్డి ఉద్యోగ విరమణ

చిత్తూరు కలెక్టరేట్‌ : పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగర్‌ మండలం వరికుంటపాడులో రైతు కుటుంబానికి చెందిన పెంచలయ్య, కొండమ్మ దంపతులకు నరసింహారెడ్డి జన్మించారు. ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన డీఈవో స్థాయికి ఎదిగారు. నెల్లూరు డైట్‌ కళాశాల లెక్చరర్‌గా, బీఈడీ కళాశాల లెక్చరర్‌గా, ఎస్‌సీఈఆర్‌టీ ఐఈడీ కోఆర్డినేటర్‌గా, సహిత విద్య కోఆర్డినేటర్‌గా, రాష్ట్ర స్థాయి లీడర్‌షిప్‌ ట్రైనింగ్‌ కోఆర్డినేటర్‌గా, పాఠ్యపుస్తకాల రచయితగా అనేక హోదాల్లో పనిచేశారు.

విధుల పట్ల నిబద్ధత, అంకితభావంతో పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శిథిలావస్థకు చేరిన డీఈవో కార్యాలయం రూపురేఖలను మార్చడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సొంత నిధులతో మరమ్మతులు చేయించారు. టీచర్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారు. ఈ–ఆఫీస్‌ను పకడ్బందీగా నిర్వహించి ఫైళ్లు పెండింగ్‌ లేకుండా చర్యలు తీసుకున్నారు.

ప్రశంసలు  
ప్రభుత్వం చిత్తూరు నుంచి ప్రారంభించిన అమ్మఒడి పథకం విజయవంతానికి కృషి చేశారు. కేజీబీవీ బాలికలు నాసా కార్యక్రమానికి వెళ్లడంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇన్‌స్పైర్‌లో రాష్ట్రస్థాయిలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. ఉయ్‌ లవ్‌ రీడింగ్‌ను పకడ్బందీగా అమలు చేసి కమిషనర్‌ చినవీరభద్రుడు నుంచి ప్రశంసలు పొందారు. బయోమెట్రిక్‌ అమలులో జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేశారు. నాడు– నేడు అమలులో మంచి పురోగతి చూపించి ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాజశేఖర్‌ నుంచి ప్రశంసలు పొందారు. 
చదవండి: రేపటి నుంచి స్కూళ్లకు ఉపాధ్యాయులు 

మరిన్ని వార్తలు