బలవన్మరణం: తనువు వీడి వెళ్లిపోవాల్సిందేగానీ.. సేద్యంపై తనివి తీరదని..

7 May, 2022 19:33 IST|Sakshi
నల్లపు నీలాంబరం (ఫైల్‌) 

పుడమితల్లిని నమ్ముకున్న రైతుకు సేద్యం ప్రాణంతో సమానం. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా.. వరుస నష్టాలు కుంగదీసినా కర్షకుని ఆశ చావదు. వెనుదీయని గుండె ధైర్యం భూమిపుత్రుని సొంతం. పచ్చని పొలాల బాటన నిరంతరం ‘సాగు’తూనే ఉండాలని తపిస్తాడు. ఈ కోవకే చెందిన ఈ వృద్ధ రైతు ‘‘ఇన్నాళ్లూ కష్టపడింది చాలు.. ఇక వ్యవసాయం వద్దు నాన్నా..’’ అని కొడుకులు చెప్పిన మాటకు చిన్నబుచ్చుకున్నాడు. తనువు వీడి వెళ్లిపోవాల్సిందేగానీ.. సేద్యంపై తన తనివి తీరదని భావించాడో ఏమో.. మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ కుటుంబానికి తీరని వేదన మిగిల్చాడు. 

సాక్షి, తాడేపల్లిరూరల్‌: కుంచనపల్లికి చెందిన దళిత రైతు నల్లపు నీలాంబరం(62) కుటుంబం తరతరాలుగా వ్యవసాయమే ఆధారంగా జీవిస్తోంది. ఈయన కూడా కృష్ణానదీ లంక భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవితాన్ని నెట్టుకొచ్చాడు. ప్రస్తుతం కూడా పొలాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వయసుపైబడడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇన్నాళ్లూ కష్టపడింది చాలు.. ఇక ఈ భారం వద్దు.. వ్యవసాయం వదిలేయి నాన్నా అని కుటుంబ సభ్యులు చెప్పారు.

అయితే దీనికి నీలాంబరం ససేమిరా అన్నాడు. రైతుగానే బతికుంటాను.. చచ్చినా రైతుగానే మరణిస్తాను అని తెగేసి చెప్పాడు. తనలో తాను మదనపడ్డాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం పురుగుమందు తాగాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నీలాంబరం చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన కొడుకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు