Papaya Farming: బొప్పాయి పంట.. లాభాలే లాభాలు.. టన్ను ధర ఎంతంటే?

25 Jul, 2022 19:18 IST|Sakshi
పెద్దపప్పూరు: చింతరపల్లి వద్ద సాగుచేసిన బొప్పాయి తోట

పెద్దపప్పూరు(అనంతపురం జిల్లా): రైతులు ఏటా వేరుశనగ సాగు చేసి, దిగుబడి రాక, పెట్టుబడి కూడా దక్కక నష్టాలు చవిచూస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో ప్రత్యామ్నాయంగా బొప్పాయి పంట సాగు చేసి, లాభాలు పండిస్తున్నారు. తెగుళ్ల ప్రభావంతో పంట దిగుబడి తగ్గినా, మార్కెట్‌లో ఆశించిన ధర పలుకుతుండడంతో రాబడి పెరిగిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  నియోజకవర్గంలోని పెద్దపప్పూరు, యాడికి, పెద్దవడుగూరు, తాడిపత్రి మండలాల్లోని పలు గ్రామాల్లో దాదాపు 181 ఎకరాల్లో బొప్పాయి పంట సాగు చేసినట్లు అధికారులు చెప్తున్నారు.
చదవండి: సీజన్‌ వచ్చేసింది.. వణికించే వ్యాధుల జాబితా! లక్షణాలు, ముందు జాగ్రత్తలు

నేల స్వభావాన్ని బట్టి దిగుబడి  
రైతులు ఎక్కువగా తైవాన్‌ 786 రకం బొప్పాయి మొక్కలను సాగు చేస్తున్నారు. ఎకరాకు 1000 మొక్కల చొప్పున సాగు చేస్తున్నారు. ఏటా జూన్‌ నెలలో సాగు చేస్తే ఏడు నెలలకు తొలి పంట కోత ప్రారంభమవుతుంది. ఎకరానికి రైతులు రూ.1.50 లక్ష పెట్టుబడి పెట్టారు. పంట కాలం పూర్తయ్యేలోపు నేల స్వభావాన్ని బట్టి ఎకరానికి 25 నుంచి 30 టన్నుల దిగుబడి వస్తుందని రైతులు చెప్తున్నారు.

రైతుల చెంతకే వ్యాపారులు : 
ఇక్కడి రైతులు పండించిన పంటను ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల మార్కెట్లకు ఎక్కువగా తరలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అక్కడి మార్కెట్లలో డిమాండ్‌ను బట్టి అనంతపురం, నెల్లూరు, తాడిపత్రి పట్టణాలకు చెందిన వ్యాపారులే స్వయంగా రైతుల చెంతకు వచ్చి టన్ను రూ.8 వేల నుంచి రూ. 10 వేలకు కొనుగోలు చేస్తున్నారు.

లాభదాయక పంట  
ఏటా జూన్‌ నెలలో పంట సాగు చేయాలి. అక్టోబర్‌లో సాగు చేయడంతో పంట దెబ్బతిన్నా.. తిరిగి కోలుకుంది. మూడెకరాల్లో పంట సాగు చేసినా. ఎకరానికి రూ.1.50 చొప్పున పెట్టుబడి వచ్చింది. పెట్టుబడి పోనూ రూ.లక్ష ఆదాయం వచ్చింది. మరో రెండు నెలల పాటు పంట దిగుబడి వస్తుంది. మార్కెట్‌లో కాయ నాణ్యతను బట్టి టన్ను రూ.8 నుంచి రూ.10 వేల వరకు ధర పలుకుతోంది. వ్వాపారులు కొందరు మావద్దకే వచ్చి పంట కొనుగోలు చేస్తున్నారు. 
 – రైతు బాసూ సాహెబ్, చింతరపల్లి, పెద్దపప్పూరు మండలం  

జాగ్రత్తలు పాటిస్తే లాభాలు
బొప్పాయి పంటకు ఎక్కువగా తెగుళ్లు ఆశించడంతో ఆకులు రాలిపోతాయి. పూత, పిందెలు నేలరాలతాయి. తెగుళ్లు ప్రారంభ దశలోనే గుర్తించి నివారణకు మందులు పిచికారీ చేయాలి. నేల స్వభావాన్ని బట్టి పంట దిగుబడి వస్తుంది. కాయలు నాణ్యతను బట్టి ధర పలుకుతుంది. రైతులకు పంట సాగులో ఎలాంటి సందేహాలున్నా, తెగుళ్లు వ్యాపించినా వెంటనే సమాచారం అందించాలి. క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఏ మందులు పిచికారీ చేయాలో స్వయంగా తెలియజేస్తాం.   
– ఉమాదేవి, ఉద్యాన అధికారిణి, తాడిపత్రి  

మరిన్ని వార్తలు