ఊరూవాడా రైతుల పండుగ

9 Jul, 2021 02:42 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రైతు దినోత్సవం

మహానేత వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించిన అన్నదాతలు

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

జిల్లా, మండల స్థాయిలో ఆదర్శ రైతులకు సత్కారం

సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఊరూవాడా పండుగ వాతావరణంలో ఈ వేడుకలు జరిగాయి. రైతు బాంధవుడు డాక్టర్‌ వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. వ్యవసాయ, సాగునీటి రంగాలకు మహానేత చేసిన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్రస్థాయి రైతు దినోత్సవం అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరగగా.. జిల్లా, నియోజకవర్గస్థాయిల్లోనే కాదు.. రైతుభరోసా కేంద్రాల (ఆర్‌బీకేల) స్థాయిల్లో కూడా ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

రాష్ట్రస్థాయి వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. జిల్లాస్థాయి వేడుకల్లో మంత్రులు, నియోజకవర్గస్థాయి వేడుకల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొత్తగా నిర్మించిన ఆర్‌బీకే భవనాలతో పాటు వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్, ఆక్వా ల్యాబ్స్, సీఏడీడీఎల్‌లు, ఆర్‌బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న వైఎస్సార్‌ యంత్ర సేవాకేంద్రాలు (సీహెచ్‌సీలు), వెటర్నరీ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రైతుబజార్లను స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. పాడిరైతుల కోసం దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్‌ టెలీమెడిసిన్‌ కాల్‌ సెంటర్‌ను విజయవాడలో ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న రైతుబజార్లతో పాటు ఆర్‌బీకేలకు అనుబంధంగా గోదాములు, కోల్డ్‌ స్టోరేజ్‌ల నిర్మాణం, మార్కెట్‌ యార్డులు ఆధునికీకరణ, అదనపు సౌకర్యాల కల్పన పనులకు శంకుస్థాపన చేశారు.

ఆర్‌బీకేల వద్ద కోలాహలం
వైఎస్సార్‌ రైతుభరోసా కేంద్రాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఆర్‌బీకేలను పూలతో శోభాయమానంగా అలంకరించారు. ఆర్‌బీకేల్లో జరిగిన వేడుకల్లో పెద్దఎత్తున రైతులు పాల్గొని మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఆర్‌బీకేల్లోని స్మార్ట్‌టీవీల ద్వారా ముఖ్యమంత్రి పాల్గొన్న రైతుదినోత్సవాన్ని వీక్షించారు. రైతు దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందేశాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు చదివి వినిపించారు. జిల్లా, మండల స్థాయిల్లో ఆదర్శరైతులను నగదు ప్రోత్సాహకాలతో ఘనంగా సత్కరించారు. ఆర్‌బీకేల్లో చేప, రొయ్యల ఫీడ్‌ పంపిణీతోపాటు పాడిరైతులకు సబ్సిడీపై పశుగ్రాస విత్తనాలు, పశువుల దాణా పంపిణీకి శ్రీకారం చుట్టారు.

విశ్వవిద్యాలయాల్లో..
డాక్టర్‌ వైఎస్సార్‌ హార్టికల్చర్, ఎన్‌జీ రంగా వ్యవసాయ, శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్శిటీల ఆధ్వర్యంలో రైతు దినోత్సవం ఘనంగా జరిగింది. వెంకట్రామన్నగూడెంలోని కేవీకేలో జరిగిన వేడుకల్లో ఉద్యాన వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ టి.జానకీరామ్, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పాల్గొని మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. గిరిజన రైతులకు జాజికాయ, మిరయం మొక్కలను పంపిణీ చేశారు. ఉద్యానపంటల్లో సేంద్రియ సాగుపద్ధతులు అనే పుస్తకాన్ని విడుదల చేశారు. అభ్యుదయ రైతులను సత్కరించారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయంలో జరిగిన వేడుకల్లో వీసీ ప్రొఫెసర్‌ వి.పద్మనాభరెడ్డి మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. పాడిరైతులను సత్కరించి పశువిజ్ఞాన కరదీపికను పంపిణీ చేశారు. గుంటూరులోని ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయంలో జరిగిన వేడుకల్లో వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఎ.విష్ణువర్ధనరెడ్డి మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  

మరిన్ని వార్తలు