సిరుల పట్టు.!

18 Apr, 2022 23:52 IST|Sakshi
మార్కెట్‌కు వచ్చిన గూళ్లు

కాసులు కురిపిస్తున్న పట్టు పరిశ్రమ 

చైనా నుంచి దిగుబడి తగ్గడంతో దేశీయంగా మంచి డిమాండ్‌ 

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు 

మదనపల్లె సిటీ: పట్టుసాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. గత ఏడాది వైరస్‌లతో ఇబ్బందులు పడిన రైతులు ఇప్పుడు ధరల పెరుగుదలతో ఉత్సాహంగా ఉన్నారు. చైనా నుంచి ముడిపట్టు దిగుమతులు నిలిచిపోవడంతో దేశీయంగా దానికి డిమాండ్‌ పెరిగింది. జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌లో బయ్యర్ల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనట్లు కిలో సగటున రూ.650 నుంచి రూ.700 పైగా ధర పలుకుతోంది.

పట్టుగూళ్లకు ఒక్కసారిగా డిమాండ్‌ ఏర్పడింది. ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇవే ధరలు మరికొన్ని నెలల పాటు కొనసాగవచ్చని రీలర్లు చెబుతున్నారు. గూళ్ల ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలో రెండవ అతి పెద్ద పట్టుగూళ్ల మార్కెట్‌  మదనపల్లె. సాధారణ పరిస్థితుల్లో ఇక్కడికి ప్రతి రోజు 2 వేల నుంచి 1500 క్వింటాళ్లకు పైగా పట్టుగూళ్లు వస్తుంటాయి. మదనపల్లె, వాల్మీకిపురం, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు  ప్రాంతాల నుంచే కాకుండా కర్నాటక ప్రాంతాల నుంచి కూడా రైతులు పట్టుగూళ్లను తీసుకువచ్చి విక్రయిస్తుంటారు.

ధరల పెరుగుదలతో ఖుషీ
మదనపల్లె పట్టుగూళ్ల మార్కెట్‌లో శనివారం గరిష్టంగా కిలో రూ.700 పలికింది.  ఇటీవల చైనా నుంచి సిల్కు దిగుబడి తగ్గడంతో దేశీయ సిల్కుకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా మార్కెట్‌లో సిల్కు ధరలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది అత్యధికంగా రూ.3 వేల వరకు ఉన్న దేశీయ నాణ్యమైన సిల్కు ధర ప్రస్తుతం రెండింతలు పెరిగింది. ఈ ప్రభావం పట్టుగూళ్ల ధరలపైనా పడి రైతులు లాభాలు చూస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఇన్‌సెంటివ్‌ (కిలో బైవోల్టిన్‌ గూళ్లకు రూ.50) కూడా వారికి కలిసొస్తోంది.

సంతోషంగా ఉంది 
ప్రస్తుతం పెరిగిన ధరలు సంతోషాన్నిస్తున్నాయి. పదేళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి ధరలు చూస్తున్నాం. గతంలో ఇలాంటి ధరలు చూడలేదు. మల్బరీ సాగు చేస్తే లాభాలు తప్పకుండా వస్తాయనేందుకు ఇప్పుడున్న ధరలే నిదర్శనం. ఏది ఏమైనా ఈ ధరలు మల్బరీ సాగు చేసిన రైతులందరికీ ఎంతో ఊరట కలిగిస్తున్నాయని చెప్పవచ్చు.      – సోమశేఖర్, రైతు, తవళం, నిమ్మనపల్లె మండలం

మంచి లాభాలు చూస్తున్నా 
నేను రెండు ఎకరాల్లో మల్బరీ సాగు చేశాను. మార్కెట్‌లో మంచి ధరలు వస్తున్నాయి. ఎండల కారణంగా పురుగుల పెంపకం కొంత ఇబ్బంది అనిపించినా ధరలు మాత్రం బాగున్నాయి.  
–హరికుమార్‌రెడ్డి, పట్టురైతు, పేయలవారిపల్లె, తంబళ్లపల్లె మండలం

జాగ్రత్తలతో మంచి దిగుబడి 
పట్టుగూళ్లకు మంచి ధరలు ఉండడం శుభపరిణామం. ఈ తరుణంలో రైతులు శాస్త్రీయ పద్దతులు, జాగ్రత్తలు పాటించి మంచి దిగుబడులు సాధించాలి. ముఖ్యంగా మల్బరీ కొరత రాకుండా తోటల పెంపకంపై దృష్టి పెట్టాలి. 
–రవి, ఇన్‌చార్జి ఏడీ, పట్టుపరిశ్రమశాఖ,మదనపల్లె.

మరిన్ని వార్తలు