Konaseema: కోనసీమలో సాగుకు శ్రీకారం

18 Jun, 2022 11:41 IST|Sakshi
అంబాజీపేట మండలం గంగలకుర్రులో వరి నారుమళ్లు

విరామానికి ఎగదోస్తున్నా నేలతల్లి ఎండిపోకూడదని మున్ముందుకు..

గోదారమ్మతో పరుగులెడుతున్న అన్నదాత

కోనసీమలో చురుగ్గా దమ్ములు, నాట్లు

విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సిద్ధం

సాక్షి, అమలాపురం: నైరుతి రుతుపవనాల పలకరింపు పెద్దగా లేకున్నా గోదారి నీటి లభ్యతతో ఆయకట్టు రైతులు సాగుకు ఉరకలేస్తున్నారు. కోనసీమ జిల్లాలో ఇప్పటికే ఆలమూరు, రామచంద్రపురం, కొత్తపేట వ్యవసాయ సబ్‌ డివిజన్లలో జోరుగా ఆకుమడులు పడగా, ఇప్పుడు అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం సబ్‌ డివిజన్ల పరిధిలో నారుమళ్లు వేస్తూ ముందస్తు సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు.  జిల్లాలో 1.79 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందని అంచనా కాగా.. ఇప్పటివరకు పది వేల ఎకరాలకు సరిపడా నారుమళ్లు పడ్డాయి. వర్షాలు పడితే నెలాఖరు నాటికి ఇంకా ఎక్కువగా పడే అవకాశముందని జిల్లా వ్యవసాయ అధికారి వై. ఆనందకుమారి ‘సాక్షి’కి తెలిపారు.
చదవండి: కాలం దాచుకున్న కథ ఇది!

వర్షాలు పడి భూమి చల్లబడితే రైతులు సాగుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వేస్తే మొలక దెబ్బతింటుందని రైతులు ఆలోచిస్తున్నారు. మరోవైపు.. తెలుగుదేశం పార్టీ మద్దతున్న కోనసీమ రైతు పరిరక్షణ సమితి నాయకులు చేస్తున్న సాగుసమ్మె ప్రకటనల నేపథ్యంలో సైతం అంబాజీపేట, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో అన్నదాతలు నారుమళ్లు పోస్తుండడం విశేషం. ముంపు కారణంగా ఈ ప్రాంతంలోనే రైతులు సాగుకు దూరమని టీడీపీ అనుకూల రైతు నాయకులు ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. అటువంటి చోట రైతులు నారుమళ్లకు సిద్ధంకావడం విశేషం. అంబాజీపేట మండలం గంగలకుర్రు, పుల్లేటికుర్రులలో గడిచిన రెండ్రోజుల్లో రైతులు పెద్దఎత్తున నారుమళ్లు పోశారు. అలాగే, అల్లవరం మండలం కోడూరుపాడు, బోడసకుర్రు, అల్లవరం, ఎంట్రికోన, మొగళ్లమూరు, తుమ్మలపల్లి గ్రామాల్లో రైతులు దమ్ము చేస్తున్నారు.

ఉప్పలగుప్తం మండలం మునిపల్లిలో నారుమడిలో విత్తనాలు చల్లుతున్న రైతు 

కోనసీమలో పంట విరామంలేదు: కలెక్టర్‌ 
ఖరీఫ్‌ రైతులకు సాగునీటి సరఫరా, ఎరువులు, విత్తనాలు అందించడంలో అలసత్వం వహిస్తే ఊరుకునేదిలేదని, రైతుల నుంచి ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా హెచ్చరించారు. జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగింది. వ్యవసాయ, సాగునీటిపారుదల శాఖలతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ముందస్తు సాగుకు దన్నుగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సిద్ధంచేశామన్నారు. ఈ ఏడాది డ్రైనేజీ, హెడ్‌వర్క్స్‌ పరిధిలో 82 పనులకు రూ.8.82 కోట్ల నిధులు వచ్చాయని, గుర్రపుడెక్క, కాలువల్లో పూడికతీత పనులకు ఈ నిధులు వినియోగిస్తామన్నారు.

అల్లవరం మండలం బోడసకుర్రులో దమ్ము చేస్తున్న రైతులు  

ఈ పనులను తక్షణం పూర్తిచేయాలని, పనుల ప్రగతిని ప్రతీరోజూ తనకు నివేదించాలని ఆదేశించారు. ఇక కోనసీమలో పంట విరామం అనేదిలేదని, సాగు పూర్తయ్యే వరకూ అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్‌ భరోసా ఇచ్చారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ మాట్లాడుతూ.. ఇళ్ల నుంచి, పంచాయతీల్లో డ్రెయిన్ల నుంచి వచ్చిన మురుగునీరు కాలువల్లో కలుస్తోందని వివరించారు. పంట కాలువల్లో మురుగునీరు కలవడంవల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ ధ్యానచంద్ర, జిల్లా వ్యవసాయ అధికారి వై. ఆనందకుమారి, జిల్లా ఇరిగేషన్‌ అధికారి రవిబాబు, మధ్య డెల్టా బోర్డు చైర్మన్‌ కుడుపూడి బాబు, వ్యవసాయ సలహా మండలి సభ్యుడు గుబ్బల రమేష్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు