జలజలా.. గోదాహరి

26 Apr, 2022 11:09 IST|Sakshi

 గొంతు తడుపుతున్న నదీమతల్లి

 మూడు జిల్లాల్లో పట్టణ,పల్లె ప్రజలకు ఈ నీరే ఆధారం

వేసవి ఎద్దడి నుంచి ఊరట

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఏటా లక్షలాది ఎకరాల్లో రెండు పంటలకు నీరందిస్తూ.. అన్నదాతలకు తోడుగా నిలుస్తోంది గోదారమ్మ. ధవళేశ్వరం బ్యారేజీ దిగువన తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల్లో ఖరీఫ్, రబీ పంటలకు గోదావరి జలాలు పుష్కలంగా అందుతున్నాయి. ఈ మూడు డెల్టాల్లో ఒక్క రబీలోనే 8,96,533 ఎకరాల్లో గోదావరి జలాలు గలగలా పారుతూ పసిడి పంటలు పండిస్తున్నాయి. రబీలో మూడు డెల్టాలకు ఈ నదీమతల్లి 101.739 టీఎంసీల నీరు అందిస్తోంది. తద్వారా లక్షల టన్నుల వరి సిరులు కురిపిస్తూ కోట్ల మంది ఆకలిని తీరుస్తోంది. అంతేకాదు.. అటు లక్షలాది మంది దాహార్తినీ తీరుస్తోంది. ముఖ్యంగా వేసవిలో అవిభక్త ఉభయ గోదావరి జిల్లాల్లో తాగునీటికి గోదావరే శరణ్యం. ఎండల తీవ్రత పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని స్థానిక సంస్థల యంత్రాంగాలు గోదావరి జలాలను ఒడిసి పట్టే పనిలో బిజీగా ఉన్నాయి. ఇతర సీజన్లలో కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తాగునీటికి గోదావరి జలాలే ప్రధాన ఆధారం. 

వేసవి అవసరాలకు సరఫరా 
రబీ సీజన్‌ ముగియడంతో ఈ నెల 15 నుంచి పంట కాలువలకు నీటి సరఫరాను నిలిపివేశారు. ఈ నెల 16 నుంచి నెలాఖరు వరకూ తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు తాగునీటి నిల్వల కోసం సరఫరా చేస్తున్నారు. వేసవి అంతటికీ సరిపోయేలా తాగునీటి చెరువులు, ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంకులను గోదావరి జలాలతో నింపుతున్నారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, మండపేట, రామచంద్రపురం, అమలాపురం వంటి పట్టణాల్లో వేసవి తాగునీటి సమస్య పరిష్కారానికి ఈ నీరే ఆధారం. కాకినాడ సిటీ, పెద్దాపురం నియోజకవర్గాల ప్రజల తాగునీటి అవసరాల కోసం సామర్లకోట సాంబమూర్తి రిజర్వాయర్‌లో గోదావరి జలాలను నిల్వ చేస్తున్నారు. కాకినాడ నగరంలో అధిక జనాభాను దృష్టిలో ఉంచుకొని అదనంగా అరట్లకట్ట రిజర్వాయర్‌ కూడా ఏర్పాటు చేశారు.

సామర్లకోటకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నాగార్జున ఫిల్టర్‌బెడ్‌లో కూడా గోదావరి జలాలు నిల్వ చేస్తున్నారు. పిఠాపురం పట్టణ ప్రజల కోసం చిత్రాడ మంచినీటి చెరువునే వేసవి రిజర్వాయర్‌గా మలచి గోదావరి జలాలతో నింపుతున్నారు. చివరకు కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరి పరిధిలోని యానాం పట్టణ ప్రజలకు కూడా గోదావరి జలాలే ఆధారం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానవతా దృక్పథంతో స్పందించడంతో యానాం ప్రజలకు గోదావరి జలాలు అందుతున్నాయి.

పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఎదురు కాకుండా ముందు జాగ్రత్తగా గోదావరి జలాలు నిల్వ చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 42.54 లక్షల గ్రామీణ జనాభా తాగునీటి అవసరాలకు గోదావరి జలాలనే వినియోగిస్తున్నారు. ఈ గ్రామాల్లో ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల ద్వారా రోజుకు 80 మిలియన్‌ లీటర్ల గోదావరి జలాలను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌) అధికారులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 1,600 ఓవర్‌హెడ్‌ ట్యాంకులను గోదావరి నీటితో నింపుతున్నారు. అలాగే 66 మంచినీటి చెరువుల్లో 0.27 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు