అతని బతుకు లెక్క తప్పింది

20 Sep, 2022 08:00 IST|Sakshi

రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి జిల్లా): అప్పుడప్పుడు ఆ చిన్నారులిద్దరూ తండ్రితో  సరదాగా హోటల్‌కు వెళ్లేవారు. ఆదివారం కూడా అదే తరహాలో నాన్న వెళ్దామంటే ఆ చిన్నారులు సంబరపడిపోయారు. తనతోపాటు మృత్యుఒడికి తీసుకుపోతాడని వారికి తెలియదు. కంటికి రెప్పలా చూసుకున్న తండ్రే ప్రాణాలను చిదిమేస్తాడని అనుకోలేదు. పిడింగొయ్యి బుచ్చియ్యనగర్‌కు చెందిన పక్కి సత్యేంద్రకుమార్‌(40) ఆదివారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలు రిషిత(12), హిద్విక(07)లు కూడా తండ్రితోపాటు చెరువులో విగత జీవులుగా తేలారు. ఈ ఘటన హృదయాలను కలచివేసింది. రాజమహేంద్రవరం వీఎల్‌పురం కనకదుర్గమ్మ గుడివీధిలో భార్యాపిల్లలతో ఉండేవాడు. 

అకౌంటెంట్‌గా జీఎస్‌టీలు ఫైల్‌ చేసేవాడు. డాన్‌బాస్కో స్కూల్లో రిషిత ఏడవ తరగతి, హిద్విక రెండవ తరగతి చదివేవారు. ఆదివారం అతని భార్య స్వాతి, తల్లిదండ్రులతో కలిసి విశాఖ వెళ్లింది. మానసికంగా తీవ్ర దిగులు చెందుతున్న సత్యేంద్రకుమార్‌ తనువు చాలించాలనుకుంటున్నాడని కుటుంబ సభ్యులెవరూ గుర్తించలేకపోయారు. పిల్లలంటే ఎంతో మమకారం. విడిచి ఉండలేకపోయేవాడు. తాను లేకపోతే పిల్లలేమవుతారని భావించాడో ఏమో గాని తనతోపాటు వారినీ విషాదాంతమొందించాడు. ఆదివారం సాయంత్రం హోటల్‌లో భోజనం పేరిట పిల్లలిద్దరినీ  తీసుకెళ్లాడు. 

తర్వాత వీరి ఆచూకీ కనిపించలేదు. విశాఖ నుంచి తిరుగు ప్రయాణమైన భార్య స్వాతి ఫోన్‌ చేసినా ఎత్తలేదు. ఇంటికొచ్చి చూస్తే పిల్లలు కూడా కనిపించలేదు. దీంతో కంగారు పడి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం రాజవోలు చెరువులో ముందుగా కుమార్తెలిద్దరి శవాలు బయటపడ్డాయి. తర్వాత సత్యేంద్రకుమార్‌ విగతజీవిగా తేలాడు. చెరువులోకి దూకేముందు గట్టుపై  బైక్, సెల్‌ఫోన్‌ విడిచి పెట్టాడు. లెటర్‌ రాశాడు. తానెందుకు ప్రాణాలు తీసుకుంటున్నదీ అందులో వివరించాడు. ధవళేశ్వరం, బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్లు మంగాదేవి, విజయకుమార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. 

రైలు టిక్కెట్లు తీసి పంపించి... 
ఏ శుభకార్యానికి వెళ్లినా అందరం కలిసి వెళ్లే వాళ్లం.. విశాఖపట్నం శుభకార్యానికి వెళ్దామంటే ఈసారి తనకు పని ఉంది రాలేనని సత్యేంద్రకుమార్‌ చెప్పారని అతని భార్య స్వాతి పేర్కొంది.  తనకు, అత్తమామలకు టిక్కెట్లు తీసి పంపించి ఇలా శోకం మిగిల్చారంటూ కన్నీరుమున్నీరవుతోంది. తిరిగి వెళ్లి వచ్చేసరికి అందనంత దూరానికి వెళ్లిపోయి తనను ఒంటరి దాన్ని చేసేవా బావా రోదిస్తున్న తీరు స్థానికుల గుండెల్ని పిండేసింది. అందరితోను కలివిడిగా నవ్వుతూ పలకరించే సత్యేంద్రకుమార్, ఇద్దరు కుమార్తెలు మృత్యువాతపడడాన్ని అతని సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. వీఎల్‌పురం, బుచ్చియ్యనగర్‌ ప్రాంతాల్లో విషాధ చాయలు అలుముకున్నాయి. కష్టాన్ని తమతో పంచుకుంటే ఇంత దారుణం జరిగేది కాదంటూ మృతుని తల్లితండ్రులు సుశీల, సత్యనారాయణ కన్నీటి పర్యంతమవుతున్నారు.

పార్థివ దేహాలకు నివాళి 
వీఎల్‌పురంలో తండ్రీ కుమార్తెల పార్థివ దేహాలకు సోమవారం రాత్రి ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని బొమ్మూరు సీఐ విజయ్‌ కుమార్‌కు ఆదేశించారు. 

బతకాలని ఉన్నా...
సత్యేంద్రకుమార్‌ తనతోపాటు పిల్లలనూ మృత్యుఒడికి చేర్చిన ఘటనపై ఆయన నివాస ప్రాంత వాసులకు కన్నీరు తెప్పించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమార్తెలకు తాను చనిపోతే సమాజంలో గుర్తింపు, గౌరవం ఉండదని..అందుకే వెంట తీసుకువెళ్లినట్లు సత్యేంద్రకుమార్‌ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. అకౌంట్స్‌ కన్సల్టెన్సీ ఆఫీసు నిర్వహించేవాడు. అనుకున్న మేర ఆదాయం రాలేదని ఆందోళన చెందేవాడు.  ఆర్థికంగా ఎదిగే అవకాశం లేని దురదృష్టవంతుడ్ని అంటూ సత్యేంద్రకుమార్‌ లేఖలో ప్రస్తావించాడు. మరణానికి మూడొంతులు అకౌంట్స్‌ టెన్షనే కారణమన్నాడు. బతకాలనే ఉంది..కానీ జీవితం ఇలాగే ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నానన్నాడు. సున్నితంగా తాను ఆలోచించానని అనుకోవద్దన్నాడు. చావడానికి కూడా చాలా ధైర్యం కావాలంటూ లేఖ ముగించాడు. ఈ లేఖ అందరి హృదయాలనూ కదిలించింది. 

మరిన్ని వార్తలు