తండ్రి వివాహేతర సంబంధాన్ని బయటపెట్టిన కొడుకు.. చివరికి ఏం జరిగిందంటే..

4 Dec, 2021 12:52 IST|Sakshi
మెహరాజ్‌ హుస్సేన్‌(ఫైల్‌ఫోటో)

అనంతపురం క్రైం: తన వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడన్న కోపంతో కన్నకొడుకునే హత్య చేయాలని చూశాడో కసాయి తండ్రి. అల్లా స్మరణలో నిమగ్నమైన  కొడుకుపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన అనంతపురం రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలోని  విద్యుత్‌శక్తి నగర్‌లో చోటు చేసుకుంది. సీఐ జాకీర్‌ హుస్సేన్‌ తెలిపిన వివరాల మేరకు.. స్థానిక విద్యుత్‌శక్తి నగర్‌ రెండో క్రాస్‌లోని ఓ ఇంటి మొదటి అంతస్తులో మహబూబ్‌బాషా (అడ్వొకేట్‌), షంషాద్‌బేగం దంపతులు నివాసముంటున్నారు. వీరికి మెహరాజ్‌ హుస్సేన్‌(21), మరో అమ్మాయి సంతానం. మెహరాజ్‌ హుస్సేన్‌ లా మూడో సంవత్సరం చదువుతున్నాడు.

చదవండి: వివాహేతర సంబంధం.. భార్యను పలుమార్లు హెచ్చరించాడు.. చివరకు

తన తండ్రి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న విషయాన్ని మామ అన్వర్‌బాషాకు మెహరాజ్‌ హుస్సేన్‌ ఆరు నెలల క్రితం చెప్పాడు. దీంతో అన్వర్‌బాషా.. మహబూబ్‌బాషాను మందలించాడు. అప్పటి నుంచి కొడుకుపై కక్ష పెంచుకున్నాడు. 20 రోజుల క్రితం మహబూబ్‌బాషా భార్య, కుమార్తె హుబ్లీలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంకా తిరిగి రాలేదు. ఇదే అదనుగా భావించిన మహబూబ్‌బాషా శుక్రవారం ఓ గదిలో అల్లా స్మరణలో ఉన్న మెహరాజ్‌ హుస్సేన్‌పై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు.

దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మెహరాజ్‌ హుస్సేన్‌ కాలుతూనే తండ్రిని పట్టుకోబోయాడు. అతను వదిలించుకుని బయటకు వచ్చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు డయల్‌ 100, 108కు ఫోన్‌ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. తీవ్రంగా గాయపడిన మెహరాజ్‌ హుస్సేన్‌ను, స్వల్ప గాయాలైన అతని తండ్రి మహబూబ్‌బాషాను అంబులెన్స్‌లో సర్వజనాస్పత్రికి తరలించారు. మెహరాజ్‌ హుస్సేన్‌ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా..ఘటన వల్ల మహబూబ్‌బాషా ఇంట్లో వ్యాపించిన మంటలను అగి్నమాపక సిబ్బంది ఆర్పేశారు.  

మరిన్ని వార్తలు