Father's Day 2022: నాన్నకు ప్రేమతో.. కేంద్ర సర్వీసు నుంచి రాష్ట్ర సర్వీసుకు.. 

19 Jun, 2022 07:57 IST|Sakshi

తండ్రి కోసం ఆర్డీఓ ఉద్యోగంలో చేరిక  

ఆయనే ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు

సాక్షి, అమరావతి: ఆ తండ్రి కుమారుడిని వేలు పట్టుకుని నడిపించారు. అంతగా అక్షరాలు తెలియని ఆయన తన బిడ్డ ఆర్డీఓ కావాలని, పది మందికీ సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆ విష యాన్ని కుమారుడితో పాటు బంధువులు, ఊరి ప్రజలతో పదేపదే చెప్పేవారు. కొన్నాళ్లకు ఆ కుమారుడు తన తండ్రి కోసం చేస్తున్న ఉద్యోగాన్ని కాదని ఆర్డీఓ ఉద్యోగంలో చేరాడు. నాన్న కలను నెరవేర్చాడు. ఆ కుమారుడే ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ సేనాపతి ఢిల్లీరావు. ఆదివారం ఫాదర్స్‌ డే సందర్భంగా తన కోసం తండ్రి తపించిన తీరును, ఆయన కల నెరవేర్చిన వైనాన్ని కలెక్టర్‌ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పిడిమందస. మాది పేద కుటుంబం మాది. అమ్మానాన్న అంతగా చదువుకోలేదు. ఇంటికి నేనే పెద్ద కొడుకుని. నాన్న త్రినాథ్‌ పనులపై బయటకు వెళ్లి రాత్రికి ఇంటికి వచ్చే వరకు అంతా వేచి ఉండి, వచ్చాకే భోజనం చేసేవాళ్లం. ఎప్పుడైనా ఆయన రావడం ఆలస్య మైతే నేను నిద్రపోయేవాడిని. నాన్న వచ్చాక నన్ను నిద్రలేపి తన చేత్తో ఓ ముద్ద తినిపించి తిరిగి నిద్రపుచ్చేవారు. నన్ను బాగా చదివించి ఆర్డీఓను చేయాలన్నది నాన్న కల. విశాఖ సింహాచలం ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో చదువుకునే నన్ను తనే రైల్లో తీసుకెళ్లేవారు.

చదవండి: (నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతా వందనాలు)

అలా తీసుకెళ్లేటప్పుడు నువ్వు బాగా చదువుకుని ఆర్డీఓ కావాలి నాన్నా.. అనేవారు. మా ఊరి వాళ్లతోనూ, బంధుగణంతోనూ అదే చెబుతుండేవారు. మా వాడు తహసీల్దారుకన్నా పెద్ద ఆఫీసర్‌ ఆర్డీఓ అవుతాడనేవారు. దురదృష్టవశాత్తూ నా ఇంటర్‌ అయ్యాక ఆయన చనిపోయారు. నేను చదువు పూర్తి చేసుకుని 2003లో కేంద్ర సర్వీసుకు చెందిన అగ్రికల్చర్‌ రీసెర్చి సర్వీసు ఇనిస్టిట్యూట్‌లో సైంటిస్ట్‌ ఉద్యోగంలో చేరాను. నాన్న కోసం కేంద్ర సర్వీసును వదిలి 2007లో రాష్ట్ర సర్వీసులకొచ్చాను. 2008 మార్చిలో విజయనగరం జిల్లా ఆర్డీఓగా చేరి నాన్న కల నెరవేర్చాను. ఆ రోజు నా ఆనందానికి అవధుల్లేవు.

ఆ తర్వాత గుంటూరు ఆర్డీఓగా, రాష్ట్రంలో పలు చోట్ల ఇతర హోదాల్లోనూ పనిచేశాను. ఇప్పుడు కలెక్టర్‌గా ఉన్నాను. నాన్న కోరుకున్నట్టుగా ఆర్డీఓ అయ్యాను. ఆర్డీఓకు మించి కలెక్టర్‌ స్థాయిలో ఉన్న నన్ను చూస్తే నాన్న ఎంత మురిసిపోయేవారో. కానీ విధి ఆయన్ను మా నుంచి దూరం చేసింది. ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. నాన్న ఆశీస్సులతోనే నేను ఆర్డీఓగా, కలెక్టర్‌గా ఎదిగానని భావిస్తున్నాను.  

మహేష్‌కుమార్‌ రావిరాల, జాయింట్‌ కలెక్టర్, కృష్ణాజిల్లా

నాన్న కోరిక నెరవేర్చా 
మా నాన్న రావిరాల నరసయ్య రెవెన్యూ శాఖలో నల్గొండ పట్టణంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగపర్వం ప్రారంభించారు. నాకు, మా అన్నయ్యకు చదువులో చిన్ననాటి నుంచి మార్గం చూపేవారు. మా వెన్నంటి ఉండి మా అన్నదమ్ములను ఎంబీబీఎస్‌ వరకు చదివించారు. మా నాన్నలో ఉన్న చిన్ననాటి కోరిక తీరకపోవటం, చిన్న వయసులోనే ఆయన తండ్రి చనిపోవటంతో నన్ను సివిల్స్‌ వైపు నడిపించి ఐఏఎస్‌ అధికారి అయ్యేలా నా వెన్నంటి ఉండి నడిపించారు. 2016లో నేను ఐఏఎస్‌కు ఎంపికైనప్పుడు నా కోరికను నీలో చూసుకుంటున్నానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆ సమయంలో మా కుటుంబం అంతా అంతులేని ఆనందం పొందాం.         మమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చిన మా నాన్నకు ఫాదర్స్‌డే శుభాకాంక్షలు. 
– మహేష్‌కుమార్‌ రావిరాల, జాయింట్‌ కలెక్టర్, కృష్ణాజిల్లా  

మరిన్ని వార్తలు