పులి ఎదురొచ్చినా.. తగ్గేదే లే!

29 Oct, 2022 14:28 IST|Sakshi

ప్రకాశం(పెద్దదోర్నాల: హనీ బ్యాడ్జర్‌... తెలుగులో రైలు ఎలుగు.. నల్లమల అభయారణ్యంలో ఉన్న అరుదైన వన్యప్రాణుల్లో ఇది ఒకటి. ఎత్తు కేవలం 12 అంగుళాలు. దాని పంజాకు గోళ్లు మూడు అంగుళాల పొడవు ఉంటాయి. బరువు సుమారు పది కిలోలు మాత్రమే. చూసేందుకు ఎలుగుబంటికి జిరాక్స్‌ కాపీలా మరగుజ్జుగా ఉంటుంది. కానీ, పౌరుషంలో దీనికి మరొక వన్యప్రాణి సాటిరాదు. పులి ఎదురొచ్చినా వెనక్కి తగ్గదు. ఇంత పౌరుషం, దైర్యం ఉన్న ఈ వన్యప్రాణి జీవితకాలం ఏడేళ్లు మాత్రమే. ఈ జీవికి అత్యంత ఇష్టమైన ఆహారం తేనె తుట్టెల్లోని లార్వా. అందుకే దీనిని హనీ బ్యాడ్జర్‌ అని పిలుస్తారు.

అతి చిన్నది... ఒళ్లంతా ముళ్లున్నది...
నల్లమల అభయారణ్యంలో సంచరించే వన్యప్రాణుల్లోకెల్లా చిన్నదిగా కనిపించే హనీబ్యాడ్జర్‌ అత్యంత తెగువను ప్రదర్శిస్తుంది. పది కిలోల బరువు ఉండే దీని చర్మం మందంగా, ఒదులుగా ఉంటుంది. ఒళ్లంతా ముళ్లు ఉంటాయి. అందువల్ల దీనిపై ఏ జంతువు దాడి చేసినా వాటికి పట్టు చిక్కదు. ముళ్ల పందులు దాడి చేసినా హనీ బ్యాడ్జర్లను ఏమీ చేయలేవు. పెద్ద పులులకు సైతం ఎదురు తిరిగి భీకరంగా అరుస్తూ పోట్లాటకు సిద్ధపడతాయి. ఏడాదికి ఒక సంతానానికి జన్మనిచ్చే ఈ హనీ బ్యాడ్జర్లు మాంసాహారులు. వీటి ఆహారంలో 25 శాతం పాములే ఉంటాయి. పాములు దీని కంట పడితే వేటాడి వెంటాడి చంపి తినేంత వరకు వెనక్కి వెళ్లవు.

వాసన పసిగట్టటంలో స్నిపర్‌ డాగ్‌ను మించిన నేర్పరితనం హనీ బ్యాడ్జర్ల సొంతం. భూమి లోపలి పొరల్లో ఏ రకమైన ఆహారం ఉందో వాసన పసిగట్టే శక్తి వీటి సొంతం. తమ పంజాకున్న పదునైన గోళ్లతో క్షణాల వ్యవధిలో గోతులు తవ్వి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. కందిరీగలు, తేనెటీగలు, విషకీటకాలు కుట్టినా ఏ విధమైన అపాయం లేకుండా దీని టాక్సిన్‌లు దృఢంగా ఉంటాయి.

పెద్దపులిని ధైర్యంగా ఎదుర్కొంటాయి
నీబ్యాడ్జర్లు చాలా ధైర్యం కలిగిన వన్యప్రాణులు. వాసన పసిగట్టి ఆహారాన్ని సేకరించడంలో స్నిపర్‌ డాగ్‌ను మించిన నైపుణ్యాన్ని కనబరుస్తుంటాయి. అటవీ ప్రాంతంలో సంచరించే క్రమంలో పులి వచ్చినా ఎదురు తిరుగుతాయి. నల్లమలలోని అన్ని ప్రాంతాల్లో ఇవి సంచరిస్తుంటాయి. ఇవి పాములను అత్యంత ఇష్టంగా తింటాయి.
– విశ్వేశ్వరరావు, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి, పెద్దదోర్నాల

మరిన్ని వార్తలు