ప్రైవేట్‌ వర్సిటీల కోర్సులకు ఫీజులు ఖరారు

25 Oct, 2021 03:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కన్వీనర్‌ కోటాలో 35 శాతం సీట్ల భర్తీ 

అందుబాటులో 2,330 బీటెక్‌ సీట్లు 

బెస్ట్‌ వర్సిటీలో 105 ఏజీ బీఎస్సీ సీట్లు 

మెరిట్‌ ఉన్న పేద విద్యార్థులకు వరం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కన్వీనర్‌ కోటాలో భర్తీ చేయనున్న ప్రైవేటు వర్సిటీల్లోని 35 శాతం సీట్లకు సంబంధించి ప్రభుత్వం కోర్సుల వారీగా ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం జీఓ 57ను విడుదల చేసింది. ప్రస్తుతానికి రాష్ట్రంలోని ప్రైవేటు వర్సిటీలలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ (అమరావతి), వీఐటీ ఏపీ (అమరావతి), సెంచూరియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (విజయనగరం), భారతీయ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ యూనివర్సిటీ–బెస్ట్‌ (అనంతపురం)లోని బీటెక్, బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ సీట్లను ఈ విద్యా సంవత్సరంలో కన్వీనర్‌ కోటాలో విద్యార్థులకు కేటాయించనున్నారు. ఎస్‌ఆర్‌ఎం, వీఐటీ, సెంచూరియన్‌ వర్సిటీల్లో బీటెక్‌ కోర్సులకు, బెస్ట్‌ వర్సిటీలో బీటెక్‌తో పాటు బీఎస్సీ కోర్సులకు ప్రవేశాలు కల్పించనున్నారు.

ఎస్‌ఆర్‌ఎం, వీఐటీలో బీటెక్‌ కోర్సు ఫీజును రూ.70 వేలు, సెంచూరియన్‌లో రూ.50 వేలు, బెస్ట్‌ వర్సిటీలో రూ.40 వేలుగా ఖరారు చేశారు. బీఎస్సీ అగ్రికల్చర్‌ సీట్లకు రూ.70 వేలుగా నిర్ణయించారు. ఈ ఫీజులు 2021–22 నుంచి 2023–24 వరకు అమల్లో ఉండనున్నాయి. ఈ ఫీజులకు అదనంగా డబ్బు వసూలు చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. హాస్టల్, ట్రాన్స్‌పోర్ట్, మెస్‌ చార్జీలు, రిజిస్ట్రేషన్‌ ఫీ, అడ్మిషన్‌ ఫీ, లైబ్రరీ, ల్యాబొరేటరీ ఫీజులు ఈ ఫీజులో కలసి ఉండవని పేర్కొంది. కాగా ఈ వర్సిటీల్లో మొత్తంగా 2,330 బీటెక్‌ సీట్లు, బెస్ట్‌ వర్సిటీలో 105 ఏజీ బీఎస్సీ సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. 

పేద విద్యార్థుల కల సాకారం 
రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని సీట్లను మాత్రమే ప్రభుత్వం కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు వర్సిటీల్లోని 35 శాతం సీట్లను రాష్ట్రంలోని మెరిట్‌ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకారం అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు ఆయా వర్సిటీల్లోని 35 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలోకి తీసుకు వచ్చింది. తద్వారా ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో చదవాలనే మెరిట్‌ ఉన్న పేద విద్యార్థుల కల సాకారం కానుంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా 2,330 బీటెక్‌ సీట్లు, 105 ఏజీ బీఎస్సీ సీట్లు కన్వీనర్‌ కోటా ద్వారా అదనంగా అందుబాటులోకి రానున్నాయి.   

మరిన్ని వార్తలు