మూడు గంటలే నిద్ర: సేవలో.. ‘సుగుణావతి’

6 May, 2021 09:05 IST|Sakshi
డాక్టర్‌ సుగుణావతికి నమస్కారం చేస్తున్న వృద్ధురాలు

2,550 పాజిటివ్‌ కేసులు గుర్తించిన వైద్యురాలు

5 వేల మందికి పైగా కరోనా పరీక్షలు..10 వేల మందికి పైగా టీకాలు అందజేత

గుడ్లవల్లేరు (గుడివాడ): ఓ పక్క కరోనా రోగులకు సేవలు అందిస్తూ.. వారిలో ధైర్యాన్ని నింపుతూ.. మరోపక్క వ్యాక్సిన్‌లు అందజేస్తూ కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు డాక్టర్‌ చింతపల్లి సుగుణావతి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె పనిచేస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో 2 వేల మందికి పైగా పాజిటివ్‌ కేసులు ఆమె వద్దకు వచ్చాయి. అందులో ఇద్దరు మాత్రమే మృతి చెందారు. 10 మంది ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారు. గతేడాది 550 పాజిటివ్‌ కేసుల్లో ఒకే ఒక్క మరణం సంభవించింది. కరోనా ఫస్ట్, సెకండ్‌ వేవ్‌లలో ఆమె 5 వేల మందికి పైగా కరోనా పరీక్షలు చేశారు. వ్యాక్సిన్‌ అత్యధికంగా 10 వేల మందికి పైగా వేసిన డాక్టర్‌గా సుగుణావతి రికార్డు సృష్టించారు.

మూడు గంటలే నిద్ర.. 
ఈ కరోనా సంక్షోభంలో బాధితులకు సేవలను అందించకపోతే ఈ వైద్య వృత్తిలో పనిచేయడం అనవసరం. నేను నిద్రపోయేసరికి రోజూ తెల్లవారుజామున 3 గంటలు అవుతోంది. మళ్లీ ఉదయం 6 గంటలకు లేచి హాస్పిటల్‌కు వస్తున్నాను. నాకు తొమ్మిదేళ్ల బాబు ఉన్నాడు. బాబు బాధ్యతను అమ్మ వరలక్ష్మికి అప్పగించి నేను వృత్తికి అంకితమవుతున్నా. వైద్యంతో కోలుకునేలా చేశానని నా కంటే వయసులో పెద్దవారు నా కాళ్లు పట్టుకుంటున్నారు. నమస్కారాలు పెడుతున్నారు. ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వైద్య వృత్తిలో ఉండి ఈ సంక్షోభంలో ప్రభుత్వం అంత చేస్తుంటే మనం ఈ మాత్రం ప్రజల్ని బతికించకపోతే ఇంకెందుకు అనే అనుకుంటూ పనిచేస్తున్నాను. 
– డాక్టర్‌ సుగుణావతి 

చదవండి: కరోనా: ఒక్కడే.. ఆ నలుగురై!  
కరోనాను జయించిన 92 ఏళ్ల బామ్మ

మరిన్ని వార్తలు