సంతానం.. పడిపోతోంది అమాంతం!

25 Mar, 2021 17:17 IST|Sakshi

దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న సంతానోత్పత్తి రేటు

ఏపీలో సగటున ఒక మహిళ 1.6 మందికి మాత్రమే జన్మ

జాతీయ సగటు 2.2.. ఉత్తరాదిలోని అన్ని రాష్ట్రాల్లోనూ 2.2 కంటే ఎక్కువే

2.1 కంటే తగ్గితే జనాభా పెరుగుదలకు ఇబ్బందే

రిజిస్ట్రార్‌ జనరల్‌ సర్వేలో వెల్లడి

సాక్షి, అమరావతి: ‘పది మంది పిల్లా పాపలతో చల్లగా ఉండండి’.. అని పూర్వకాలంలో పెద్దలు దీవించేవారు. కానీ ఇప్పుడు అందరూ ఒకరిద్దరికే పరిమితమైపోతున్నారు. ఫలితంగా పునరుత్పత్తి రేటు (టోటల్‌ ఫెర్టిలిటీ రేటు–టీఎఫ్‌ఆర్‌) గణనీయంగా పడిపోయింది. జాతీయ సగటు కంటే రాష్ట్ర టీఎఫ్‌ఆర్‌ భారీగా తగ్గిపోయింది. దీనివల్ల భవిష్యత్‌లో జనాభా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఒక్క ఏపీలోనే కాదు.. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ఈ రేటు తగ్గింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక మహిళ సగటున 2.9 మందికి జన్మనిస్తుండగా.. ఏపీ, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకొచ్చేసరికి అది 1.7కంటే తగ్గిపోయింది. సాధారణంగా 2.1 శాతం కంటే ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతే జనాభా పెరగదు. ఈ నేపథ్యంలో.. కేంద్ర రిజిస్ట్రార్‌ జనరల్‌ తాజాగా నిర్వహించిన సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. అవి..

70 ఏళ్ల క్రితం ఒక్కొక్కరు ఆరుగురికి జన్మ
► డెబ్భై ఏళ్ల క్రితం భారత్‌లో సగటున ఒక్కో మహిళ ఆరుగుర్ని కనేవారు. ఇప్పుడా సగటు 2.2కు పడిపోయింది.
► 2006–08 మధ్య కాలంలో భారత్‌ సగటు ఫెర్టిలిటీ రేటు 2.7 ఉండగా, తాజాగా అది 2.2కు దిగజారింది. 
► సాధారణంగా 15 ఏళ్లు దాటి 49 ఏళ్లలోపు మహిళలను పునరుత్పత్తి ప్రక్రియకు అర్హులుగా భావిస్తారు. 
► ప్రతి వెయ్యి మంది జనాభాకు 183 మంది పునరుత్పత్తి సామర్థ్యమున్న మహిళలు ఉంటారు. 
► వీరు సరైన వయస్సులో పిల్లలకు జన్మనిస్తేనే జనాభా వయస్సుల్లో అసమానతలు లేకుండా ఉంటాయి.

ఏపీలో భారీగా తగ్గిన సంతానోత్పత్తి
కానీ, రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా సంతానోత్పత్తి ప్రక్రియ భారీగా తగ్గుతూ వస్తోంది. జాతీయ సగటు 2.2గా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 1.6గా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక మహిళ సగటున 1.7 మందికి జన్మనిస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో ఆ సంఖ్య 1.5 మాత్రమే. 2006–08 మధ్య కాలంలో సగటున 1.9గా ఉన్న సంఖ్య ఇప్పుడు మరింత తగ్గి 1.6కు చేరింది. నిజానికి.. 2.1 కంటే తగ్గితే జనాభా పెరుగుదలకు ఇబ్బందని నిపుణుల అభిప్రాయం. 

ఇద్దరు కాదు ఒకరే ముద్దు..
దక్షిణాదిలో.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఒకరు కాదు.. ఇద్దరు ముద్దు అంటూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చేవారు. ఇప్పుడు మారిన కాలమాన పరిస్థితుల్లో ఇద్దరు వద్దు.. ఒకరే ముద్దు అంటూ దానినే పాటిస్తున్నారు. లేటు మ్యారేజీలు, పిల్లలను ఆలస్యంగా కనడం  తదితర కారణాలతో సంతానోత్పత్తి సమస్యగా మారింది. దీనికి తోడు ఆర్థిక, సామాజిక పరిస్థితుల వల్ల కూడా అది తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఇవీ నష్టాలు..
ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉంది. దక్షిణాదిలో ఏ రాష్ట్రం చూసుకున్నా 1.7 కంటే ఎక్కువ లేదు. ఇలా జనాభా తగ్గుతూపోతే యువత తగ్గిపోయి 
వర్క్‌ ఫోర్స్‌ (పనిచేసే వారి సంఖ్య) పడిపోతుంది. వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. 

చదవండి:

స్మార్ట్‌ టౌన్ల ప్రాజెక్ట్‌ టేకాఫ్‌.. సకల వసతులతో లే అవుట్ల అభివృద్ధి

రాజధానిలో రూ.3 వేల కోట్ల పనులకు ప్రభుత్వ గ్యారెంటీ 

మరిన్ని వార్తలు