‘కార్గో’లో గంగవరం పోర్టు మరో మైలురాయి

8 Sep, 2021 03:14 IST|Sakshi
గంగవరం పోర్టులో సరుకు ఎగుమతి దిగుమతులు

రికార్డు స్థాయిలో ఎరువుల దిగుమతి

సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే అత్యంత లోతైన, అధునాతన పోర్టుల్లో ఒకటైన గంగవరం పోర్టు సరుకుల ఎగుమతి దిగుమతుల్లో ఎప్పటికప్పడు రికార్డులు సృష్టిస్తోంది. అత్యాధునిక మౌలిక వసతుల కారణంగా మంగళవారం మరో మైలురాయిని అధిగమించింది. 24 గంటల్లోనే కార్గో హ్యాండ్లింగ్‌ చేస్తూ రికార్డు నమోదు చేసింది. మొబైల్‌ హార్బర్‌ క్రేన్స్‌ (ఎంహెచ్‌సీ) వినియోగిస్తూ 24 గంటల్లో ఏకంగా 26,885 మెట్రిక్‌ టన్నుల ఎరువును షిప్‌ నుంచి దిగుమతి చేసింది. గతంలో ఇదే పోర్టులో 24 గంటల్లో 16,690 మెట్రిక్‌ టన్నుల ఎరువులను డిశ్చార్జ్‌ చేసిన రికార్డుని అధిగమించింది.

ఎంవీకే మ్యాక్స్‌ ఎంపరర్‌ నౌక తీసుకొచ్చిన 64,575 మెట్రిక్‌ టన్నుల యూరియాని అత్యంత వేగంగా దిగుమతి చేసింది. స్టీల్‌ప్లాంట్‌కు బొగ్గు అందించడంలోనూ గత నిర్వహణని అధిగమించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం 5,67,888 మెట్రిక్‌ టన్నులను కన్వేయర్ల ద్వారా ఆర్‌ఐఎన్‌ఎల్‌ ప్లాంట్‌కు బదిలీ చేయగా.. ఆగస్టులో ఏకంగా 6,08,706 మెట్రిక్‌ టన్నులు బొగ్గును అందించింది. ఒక నెలలో ఇంత పెద్ద మొత్తాన్ని అందించిన గంగవరం పోర్టు అధికారులు, సిబ్బందికి స్టీల్‌ప్లాంట్‌ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గంగవరం పోర్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జీజే రావు మాట్లాడుతూ అత్యున్నత మౌలిక వసతులు, నిర్వహణ సామర్థ్యాలను అందిపుచ్చుకోవడం వల్లే అనేక మైలురాళ్లని అధిగమిస్తున్నామన్నారు. పోర్టులో డీప్‌ వాటర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రయోజనాలు వాణిజ్య సంస్థలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. 

మరిన్ని వార్తలు