Road Accident Near Chandragiri: ఏడుగురిని బలి తీసుకున్న మలుపు.. ఆ ఇంట్లో ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దం

6 Dec, 2021 11:24 IST|Sakshi

చంద్రగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఒకే కుటుంబంలో ఏడుగురి దుర్మరణం 

అనాథగా మారిన రెండేళ్ల చిన్నారి

మృతులది శ్రీకాకుళం జిల్లా మేడమర్తి

జాతీయ రహదారిపై కబళించిన మృత్యుమలుపు

6 People Died in a Road Accident Near Chandragiri Zone: అమ్మా.. నాన్నా.. తాతా.. నానమ్మా.. అన్న పలకరింపులతో వారం కిందటి వరకు ఈ ఇల్లు సందడిగా ఉండేది. ఇప్పుడు ఆ ఇంటి పరిసరాల్లో శ్మశాన నిశ్శబ్దం అలముకుంది. ఆరుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఈ ఇంటిలో ఒక్క చిన్నారిని మాత్రమే మృత్యుదేవత విడిచిపెట్టింది. మిగిలిన వారందరినీ మింగేసి ఆ పసిదానికి కన్నీటి జ్ఞాపకాలను  మిగిల్చింది

రాజాం/తిరుపతి రూరల్‌/ తిరుపతి తుడా : ఏ వీధికి వెళ్లినా వారి మాటలే. ఏ అరుగున విన్నా వారి ముచ్చట్లే. ఆదివారం ఉదయం చంద్రగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని మేడమర్తిని ఏడిపించింది. ఈ ఊరిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం పాలవ్వడంతో ఊరుఊరంతా ఆదివారం గుండెలవిసేలా రోదించింది. 

గ్రామానికి చెందిన కంచరాపు శ్రీరామమూర్తి(65)తో పాటు అతని భార్య సత్యవతి(55), కుమారుడు సురేష్‌కుమార్‌(35), కోడలు మీనా (28), మనవరాలు జోష్మిక నందిత(ఏడునెలలు)తో పాటు పూసపాటిరేగకు చెందిన ఆయన వియ్యంకులు పైడి గోవిందరావు(58), వియ్యంకురాలు పైడి హైమావతి(53) చంద్రగిరి వద్ద జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందారు. పెద్ద మనవరాలు జిషిత మాత్రమే ప్రాణాలు దక్కించుకుంది. తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. 

ఈ విషయం తెలిసిన వెంటనే మృతుల స్వగ్రామం మేడమర్తిలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీరామమూర్తి ఇంటిల్లిపాదీ తీర్థయాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో ఆముదాలవలసలో ఉంటున్న ఆయన సోదరుడు రంగారావు భోరున విలపిస్తున్నారు. తిరుపతి సమీపంలో ఉన్న తమ బంధువులను సంఘటనా స్థలానికి పంపించి సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రమాదంలో మృతి చెందిన మీనా సోదరి శ్రీలత కన్నీరుమున్నీరవుతున్నారు. 

చిత్రంలో నవ్వుతూ కనిపిస్తున్న వారు సురేష్, మీనా, జిషిత. సురేష్‌కు ఐదేళ్ల కిందట వివాహం కాగా.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడేళ్ల కిందటే మెరైన్‌ ఇంజినీర్‌గా కొలువు సాధించడంతో ఆ కుటుంబం ఆర్థికంగా స్థిరపడుతోంది. ఆ ఆనందాన్ని ఆవిరి చేస్తూ సురేష్, మీనాను మృత్యువు తీసుకెళ్లిపోయింది. రెండేళ్ల చిన్నారి ఒంటరిగా మిగిలిపోయింది. 

మృత్యుమలుపు..! 
పూతలపట్టు– నాయుడుపేట జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు సంభిస్తున్నాయి. చిత్తూరు– తిరుపతి మార్గంలో కొత్తగా ప్రారంభించిన సువిశాలమైన హైవేపై కొన్ని మలుపులు మృత్యు ఘంటికలను మోగిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రగిరి సమీపంలో అగరాల వద్ద మలుపునకు ఎన్నో ప్రాణాలు బలవుతున్నాయి. ఆదివారం  ఉదయం కారు ప్రమాదం కూడా ఇక్కడే సంభవించింది. శ్రీకాకుళం జిల్లా మేడమర్తి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ఏడుగురిని ఈ మలుపే బలితీసుకుంది.

గతంలో ఈ ప్రాంతంలోనే జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమంది కర్ణాటక వాసులు దుర్మరణం పాలవడం స్థానికులు మర్చిపోకముందే మరో ఘటన సంభవించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కనీసం సూచిక బోర్డులైనా ఏర్పాటు చేయించాలని కోరుతున్నారు. 

నమ్మలేకపోతున్నాం 
రెండురోజుల కిందటే శ్రీరామమూర్తి కుటుంబంతో తిరుపతి వెళ్లా డు. సొంతకారులో వెళుతున్నానని, త్వరగా వచ్చేస్తాంలే అని చెప్పాడు. ఆదివారం ఉద యం కూడా ఫోన్‌లో మాట్లాడాం. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. – కేవీ రమణ, మేడమర్తి  

మాతోనే చదువుకున్నాడు 
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సురేష్‌కుమార్‌ ఐదో తరగతి వరకూ మాతోనే గ్రామంలో చదివాడు. ఉన్నత విద్య, ఇంటర్, బీటెక్‌ కోర్సులను శ్రీకాకుళం, విశాఖపట్నంలో పూర్తి చేశాడు. అందరితో సరదాగా ఉండేవాడు. చిన్నకూతురు మొక్కు కోసం తిరుపతికి వెళుతున్నామన్నాడు. ఇంతలో ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. – కె.రాము, మేడమర్తి

మరిన్ని వార్తలు