ఏజెన్సీల్లో సమాచార 'విప్లవం'

17 Jan, 2021 03:33 IST|Sakshi

ప్రతి పంచాయతీకి ఫైబర్‌నెట్‌ సేవలు

మారుమూల ప్రాంతాలకు ఐశాట్‌ ఫోన్లు 

గూడేల్లో ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకునే అవకాశం

అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా సర్కారు చర్యలు 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో సమాచార విప్లవం వచ్చింది. వీటివల్ల ఏ గిరిజన గూడెంలో ఏం జరిగినా వెంటనే తెలుసుకునే అవకాశం ఏర్పడింది. గిరిజన పంచాయతీల్లోని సచివాలయాలకు ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించడంవల్లే అక్కడి స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు రాష్ట్ర ప్రభుత్వానికి కలిగింది. అలాగే, అడవుల్లో సరైన రహదారులు లేని గ్రామాలకు ఐశాట్‌ ఫోన్లు ఇచ్చింది. వీటి ద్వారా కూడా అత్యవసర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం తెలుసుకుంటోంది. 

గ్రామ సచివాలయాలకు ఫైబర్‌నెట్‌ సేవలు
గిరిజన పంచాయతీల్లోని ప్రతి గ్రామ సచివాలయానికి ఫైబర్‌నెట్‌ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇటీవల రూ.3కోట్లను ఫైబర్‌నెట్‌ సంస్థకు గిరిజన సంక్షేమ శాఖ అందజేసింది. వీటికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. మరోవైపు.. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న పలు సెల్‌టవర్ల పరిధిలో అప్పుడప్పుడు సిగ్నల్స్‌ సరిగ్గా ఉండని కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో.. త్వరలో ఫైబర్‌నెట్‌ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండడంతో ఆ సమస్యలకు చెక్‌ పడనుంది. గిరిజన గూడేల్లోని వారు తమ ఇళ్లకు కూడా ఇంటర్‌నెట్‌ సౌకర్యాన్ని పొందవచ్చు. అంతేకాక.. వివిధ టీవీ చానెల్స్‌ కూడా ఈ ఫైబర్‌నెట్‌ ద్వారా వీక్షించవచ్చు.  

అత్యవసర సమాచారానికి ఐశాట్‌ ఫోన్లు
ఇక గిరిజన గూడేల్లో ఏవైనా సంఘటనలు జరిగినా, సరైన వసతులు లేకపోయినా, వైద్య సాయం కావాల్సి వచ్చినా వెంటనే తెలిపేందుకు ప్రభుత్వం ఆయా ఐటీడీఏలకు ఐశాట్‌ ఫోన్లను అందజేసింది. ఈ ఫోన్లు ఐటీడీఏ పీవోల పర్యవేక్షణలో ఉంచింది. ఇవి వాకీటాకీల్లా పనిచేస్తాయి. సీతంపేట, పాడేరు, పార్వతీపురం, ఆర్‌సీ వరం, కేఆర్‌ పురం, చింతూరు, శ్రీశైలం ఐటీడీఏల్లో మొత్తం 203 ఐశాట్‌ ఫోన్లు ఉన్నాయి. వలంటీర్లకు కూడా వీటిని ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరోవైపు.. ఏజెన్సీలోని వైద్య వలంటీర్లకు ఫోన్లు ఇవ్వడం ద్వారా కూడా గిరిజనుల ఆరోగ్య సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలు 
కలిగింది.

సమాచారం తెలుసుకోవడంలో ముందున్నాం
గతంలో గిరిజన గూడేల్లో సమాచారం తెలుసుకునేందుకు సమయం పట్టేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వ సహకారంతో పలు కంపెనీలు ఇప్పటికే సెల్‌టవర్లను ఏర్పాటుచేశాయి. అలాగే, ప్రస్తుతం గ్రామ సచివాలయాలకు ఫైబర్‌నెట్‌ కనెక్షన్ల పనులు చురుగ్గా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల పూర్తయ్యాయి. ఐశాట్‌ ఫోన్ల ద్వారా కూడా సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తోంది.    
– ఇ.రవీంద్రబాబు, అడిషనల్‌ డైరెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ 

మరిన్ని వార్తలు