ఆధిపత్యంపై ‘పీఠ’ముడి!

16 Jun, 2021 03:14 IST|Sakshi

శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపత్యం కోసం ఇరువర్గాల పోరు

మఠం పరిధిలో రూ.10 కోట్ల విలువైన స్థిరాస్తి

పలు ప్రాంతాల్లో మఠానికి 84.24 ఎకరాలు

రూ.12 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

3.2 కిలోల బంగారం, 142 కేజీల వెండి

ఏటా దాదాపు రూ.4 కోట్ల రాబడి

తానే వారసుడనంటున్న వెంకటాద్రిస్వామి

తమకే పీఠం దక్కాలంటున్న మారుతి మహాలక్షుమ్మ

సాక్షి ప్రతినిధి, కడప: కాలజ్ఞాని పోతులూరి శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠం పరిధిలో ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ఆధిపత్య పోరు నెలకొంది. డబ్బు, బంగారం, స్థిర, చరాస్తులు భారీగా ఉండటం, తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ కీర్తి ప్రతిష్టలు, మఠాధిపతిగా గౌరవం, పలుకుబడి ఉండడంతో పీఠానికి డిమాండ్‌ పెరిగింది. మఠం పరిధిలో కడప, కర్నూలు, అనంతపురం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ.10 కోట్లు విలువజేసే 84.24 ఎకరాల భూములున్నాయి. వీటిపై వచ్చే కౌలుతోపాటు దేవస్థానం పరిధిలోని వివిధ దుకాణాల కోసం కేటాయించిన గదుల ద్వారా ఏటా మఠానికి సుమారు రూ.4 కోట్ల మేర రాబడి వస్తున్నట్లు చూపిస్తున్నా వాస్తవానికి రెట్టింపు రాబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండడం, ఆ మొత్తాన్ని ఇష్టానుసారంగా ఖర్చు చేసే అధికారాలు ఉండడంతో వీరబ్రహ్మేంద్రస్వామి మఠం 12వ పీఠాధిపత్యం కోసం పోటీ ఏర్పడింది. మఠానికి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు పంపుతుంటారు. వీరబ్రహ్మేంద్రస్వామి భక్తుడైన గాలి జనార్దన్‌రెడ్డి మఠం అభివృద్ధికి డబ్బులు వెచ్చించి సొంతంగా పలు భవనాలు కట్టించారు. 

ఇద్దరూ.. ఇద్దరే
శివైక్యం చెందిన 11వ మఠాధిపతి శ్రీవీరభోగ వసంత వెంకటేశ్వరస్వాముల వారి మొదటి భార్య కుమారుడితోపాటు రెండో భార్య మారుతి మహాలక్షుమ్మలు మఠాధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. అవసరమైతే న్యాయస్థానానికి వెళ్లేందుకూ సిద్ధపడుతున్నారు. ఇద్దరికీ స్థానిక నేతలతోపాటు బంధుగణం, సన్నిహితులు మద్దతు పలుకుతూ వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. వసంత వెంకటేశ్వరస్వాములు పెద్ద భార్యకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె కాగా పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామి మఠాధిపత్యం కోరుకుంటున్నారు. ఆయన న్యాయ విద్య పూర్తి చేశారు. పెద్ద భార్య చంద్రావతమ్మ 
మరణంతో వీరభోగ వసంత వెంకటేశ్వరస్వాములు 63 సంవత్సరాల వయసులో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన 24 ఏళ్ల వయసున్న మారుతి మహాలక్షుమ్మను వివాహమాడారు. ఆమెది నిరుపేద కుటుంబం. వివాహానంతరం ఆమెకు ఇద్దరు కుమారులు జన్మించారు. మారుతి మహాలక్షుమ్మకు మఠం మేనేజర్‌ ఈశ్వరయ్యతోపాటు స్థానిక విలేకరి కుటుంబ సభ్యులు, బెంగళూరులో ఐఏఎస్‌  అకాడమీ నిర్వహిస్తున్న ఆమె సమీప బంధువులు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు వెంకటాద్రిస్వామికి స్థానిక ప్రజాప్రతినిధితో పాటు వారి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులు, బద్వేలు కోర్టులో పనిచేస్తున్న మరికొందరు న్యాయవాదులు మద్దతుగా నిలిచారు.

స్వయం ప్రతిపత్తితో..
మఠం స్వయం ప్రతిపత్తితో నడుస్తోంది. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు. మఠాధిపతులు నచ్చినట్లుగా ఖర్చు చేయవచ్చు. ఏడాదికి ఒకసారి రాబడి, ఖర్చులను దేవదాయశాఖకు వెల్లడించాలి. మఠం పరిధిలో 46 మంది ఉద్యోగులు ఉండగా జీతాల కింద నెలకు రూ.6 లక్షలు ఖర్చవుతోంది.  మఠాధిపతికి నెలకు రూ. 40 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. బ్రహ్మంగారి ఆరాధన, మహా శివరాత్రి, బ్రహ్మంగారి జయంతి, దసరా ఉత్సవాల కోసం ఏటా రూ.50 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏటా రాబడిలో దేవదాయశాఖకు కాంట్రిబ్యూషన్‌ కింద 8 శాతం, ఆడిటింగ్‌ ఫీజు 1.05 శాతం,  సీజీఎఫ్‌ 9 శాతం, అర్చక వెల్ఫేర్‌ 8 శాతం చొప్పున చెల్లిస్తున్నారు.

మఠం స్థిరాస్తుల వివరాలు
– కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని కేతారంలో 50 సెంట్లు
– గుంటూరు జిల్లా ఎల్లలూరులో 50 సెంట్లు, నగరంలో 1.10 ఎకరాలు, కంతేరులో 1.16 ఎకరాలు
– ప్రకాశం జిల్లా రెడ్డిచర్లలో 16 సెంట్లు, పల్లెగుట్టపల్లెలో 6.43 ఎకరాలు
– అనంతపురం జిల్లా చలివెందులలో 27 సెంట్లు
– వైఎస్సార్‌ జిల్లా సోమిరెడ్డిపల్లెలో 18 ఎకరాలు, చీపాడులో 2.26 ఎకరాలు, పెద్ద గురవలూరులో 1.18 ఎకరాలు, మడూరులో 2.96 ఎకరాలు, వాసుదేవపురంలో 68 సెంట్లు, ఉప్పరపల్లెలో 1.19 ఎకరాలు, రంగాపురంలో 10.57 ఎకరాలు, దుంపలగట్టులో 1.93 ఎకరాలు, నందిపల్లెలో 1.93 ఎకరాలు, చెన్నూరు ఉప్పరపల్లెలో 50 సెంట్లు, పెద్దపుత్తలో 78 సెంట్లు, పైడికాల్వలో 60 సెంట్లు, బుగ్గరాపురంలో ఒక ఎకరా, సంకటితిమ్మాయపల్లెలో 2.24 ఎకరాలు. 
– కర్నూలు జిల్లా నరసాపురంలో 4.57 ఎకరాలు, ఆలమూరులో 7.60 ఎకరాలు 
– కర్నూలు జిల్లాలోని భూములతోపాటు వైఎస్సార్‌ జిల్లా శోస్తి వెంగన్నపల్లెలో 1.10 ఎకరాల భూములు కోర్టు వివాదంలో ఉన్నాయి. 

బంగారం, వెండి, ఎఫ్‌డీలు
– మఠం పరిధిలో 3.20 కిలోల బంగారం, 142 కిలోల వెండి ఉంది. 
– దుకాణాల బాడుగలపై ఏటా రూ. 6 లక్షల ఆదాయం 
– పలు బ్యాంకుల్లో రూ. 12 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు
– తలనీలాలు, హుండీ ఆదాయం, టెంకాయల వేలం ద్వారా రాబడి 

>
మరిన్ని వార్తలు