బాల్య వివాహాలు చేసేవారిపై కేసులు పెట్టండి 

6 Feb, 2023 05:38 IST|Sakshi

జిల్లా ఎస్పీలకు బాలల హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ అప్పారావు ఆదేశం  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బాల్య వివా­హాలు చేసేవారిపై కేసులు పెట్టా­లని జిల్లా ఎస్పీలను ఏపీ బాలల హక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ కేసలి అప్పారావు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రాన్ని బాల్య వివాహాలు రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ఇటీవల కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చిందని తెలిపారు.

ఆ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా బాల్య వివాహాలు జరిపిస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఎంతో మంచి భవిష్యత్‌ ఉన్న బాలలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడంతో వారి ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు దేశాభివృద్ధికి దోహదం చేసే యువశక్తి నిర్వీర్యమైపోతుందని ఆవేదన వ్యక్తంచేశారు.

బాల్య వివాహాల వల్ల బాలల భవిష్యత్‌ అంధకారంలోకి నెట్టివేయబడుతుందని, మాతా, శిశు మరణాల రేటు పెరిగే ప్రమాదం ఉందన్నారు. బాల్య వివాహాలను నివారించేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. 

మరిన్ని వార్తలు