‘ఆన్‌లైన్‌ టికెట్‌’కు నిర్మాతల మద్దతు

30 Sep, 2021 03:00 IST|Sakshi
విలేకర్లతో మాట్లాడుతున్న మంత్రి పేర్ని నాని. చిత్రంలో నిర్మాతలు దిల్‌ రాజు, సునీల్‌ నారంగ్‌

ఆ నటుడి అభిప్రాయాలతో తాము ఏకీభవించడం లేదన్నారు: మంత్రి పేర్ని నాని

ఇండస్ట్రీని బతికించేందుకు ప్రభుత్వ సూచనలను పాటించేందుకు చిరంజీవి సిద్ధమన్నారు 

ముఖ్యమంత్రిని అరేయ్‌.. ఒరేయ్‌ అని పిలవమని పవన్‌కు మాతృమూర్తి నేర్పారా?

కిరాయికి రాజకీయ పార్టీని పెట్టిన ఏకైక వ్యక్తి ఆయనే

ఔను.. ‘ఆన్‌లైన్‌’ మేమే అడిగాం.. పారదర్శకత కోసమే: నిర్మాత దిల్‌ రాజు

చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో కలసి సీఎం జగన్‌తో చర్చించాం

మా విజ్ఞప్తి మేరకే ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది 

చిలకలపూడి: ఆన్‌లైన్‌ టికెట్‌ విధానానికి మద్దతు తెలుపుతున్నామని సినీ నిర్మాతలు తెలియచేసినట్లు రవాణా, సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) చెప్పారు. బుధవారం మచిలీపట్నంలోని ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో సినీ నిర్మాతలు దిల్‌రాజు, డి.వి.వి.దానయ్య, బన్నీవాసు, సునీల్‌నారంగ్, వంశీరెడ్డి తదితరులతో కూడిన బృందం మంత్రితో సమావేశమైంది. అనంతరం సమావేశంలో చర్చించిన విషయాలను మంత్రి నాని మీడియాకు వివరించారు. సినీ పరిశ్రమ తప్పులేకపోయినా కొందరి ద్వారా తెలుగు చిత్రసీమకు నష్టం కలిగించే సంఘటనలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో తామంతా ఆ నటుడు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతో ఏకీభవించటం లేదని సినీ నిర్మాతలు తెలియ చేశారన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని నిర్మాతలు స్పష్టం చేశారని తెలిపారు. ‘రిపబ్లిక్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ కార్యక్రమంలో జరిగిన పరిణామాలకు, సినీ ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి కూడా చెప్పారు. ఇండస్ట్రీని బతికించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలు పాటించడానికి సిద్ధమని చిరంజీవి తెలియచేశారు. పవన్‌ కల్యాణ్‌కు వాళ్ల అమ్మగారు సంస్కారం నేర్పలేదా? ఆ సన్నాసి నన్నేం తిట్టాడు? నేనేం మాట్లాడాను..? నేను బూతులు తిట్టలేదు కాబట్టి టీవీలో నా ప్రెస్‌మీట్‌ ప్రసారం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అరేయ్‌.. ఒరేయ్‌ అని పిలవమని అంజనాదేవి నేర్పించారా? నేను రెడ్లకు పాలేరునైతే పవన్‌ కమ్మ వారికి పాలేరు. ఔను.. నేను జగన్‌ దగ్గర పాలేరునే! నీకు అలా చెప్పే దమ్ముందా? దేశంలో కిరాయికి రాజకీయ పార్టీని పెట్టిన ఏకైక వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. రాజకీయ పార్టీలకు టెంట్‌ హౌస్‌ పెట్టిన వ్యక్తీ పవన్‌ కల్యాణే’ అని మంత్రి నాని పేర్కొన్నారు.

నిర్మాతలంతా అన్‌లైన్‌కు అనుకూలం
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీని వంద శాతానికి పెంచాలని ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో నిర్మాతలు కోరారని మంత్రి నాని తెలిపారు. నిర్మాణ వ్యయం, పెట్టుబడులు తదితర సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఏకాభిప్రాయంతో ఆన్‌లైన్‌ విధానాన్ని వారే అడిగారన్నారు. ఆన్‌లైన్‌ టిక్కెట్‌ విధానానికి అందరం అనుకూలంగా ఉన్నామని నిర్మాతలు చెప్పారన్నారు. పలు థియేటర్లలో బుక్‌ మైషో, పేటీఎం, జెస్ట్‌ టిక్కెట్‌ల ద్వారా ఆన్‌లైన్‌ టిక్కెట్ల వ్యవస్థ కొనసాగుతోందన్నారు. ఒక నిర్దిష్ట విధానం ఉంటే చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి మంచిదని నిర్మాతలు కోరారన్నారు. టిక్కెట్లను ప్రభుత్వమే అమ్ముతుందన్న ప్రచారం అవాస్తవమన్నారు. 

మా పట్ల ప్రభుత్వం సానుకూలం: దిల్‌ రాజు
మచిలీపట్నంలో మంత్రి నానితో సమావేశం అనంతరం ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ సినీ పరిశ్రమలో లేనిపోని వివాదాస్పద అంశాలకు తావు ఇవ్వకుండా చూడాలని కోరారు. తాము తెలియచేసిన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా ఉండేవిధంగా ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయాలని మంత్రి నానిని కోరినట్లు తెలిపారు. ‘చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో కలసి గతంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశాం.

చిత్ర పరిశ్రమపై కోవిడ్‌ ప్రభావం, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం. వకీల్‌సాబ్‌ సినిమా సమయంలో కొన్ని పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. దయచేసి అందరూ మమ్మల్ని వివాదాలకు దూరంగా ఉంచండి. గతంలో మా విజ్ఞప్తిపైనే ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆన్‌లైన్‌ విధానం కావాలని పరిశ్రమ తరఫున మేమే ప్రభుత్వాన్ని కోరాం. ఆన్‌లైన్‌ విధానం ద్వారా పారదర్శకత ఉంటుంది’ అని దిల్‌రాజు పేర్కొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు