జనవరి 15న ఓటర్ల తుది జాబితా

21 Nov, 2020 03:23 IST|Sakshi
వివిధ పార్టీల నాయకులతో సమీక్షలో మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్‌

ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలుంటే తెలపండి

అఖిలపక్ష సమావేశంలో సీఈవో విజయానంద్‌

ముసాయిదా జాబితా ప్రకారం 4,00,79,025 మంది ఓటర్లు

80 లక్షల మంది కొత్త ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను జనవరి 15న ప్రచురిస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) కె.విజయానంద్‌ తెలిపారు. ఇటీవల విడుదల చేసిన మూసాయిదా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు డిసెంబర్‌ 15లోగా తెలియజేయాలని రాజకీయ పార్టీలను కోరారు. సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో రాజకీయ పార్టీలతో శుక్రవారం ఆయన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. విజయానంద్‌ మాట్లాడుతూ, నూతన ఓటర్ల నమోదుకు కూడా సహకరించాలన్నారు. 1,500 మంది ఓటర్లతో కూడిన పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ.. ఈనెల 16న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,00,79,025 మంది ఓటర్లుగా నమోదైనట్లు తెలిపారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు జనవరి 5లోగా పరిష్కారం చూపుతామన్నారు. ఈ నెల 28, 29 తేదీలతో పాటు డిసెంబర్‌ 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా సవరణలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం ముఖ్యమని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు బూత్‌ లెవెల్‌ ఏజెంట్లను నియమించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

కొత్త ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులు
రాష్ట్రంలో కొత్తగా 80 లక్షల మంది ఓటర్లకు ఫొటో ఐడెంటిటీ కార్డులు జారీ చేసినట్లు విజయానంద్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు 740 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఓటర్ల నివాసానికి రెండు కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరిజనులకు కూడా అందుబాటులో ఉండేలా పోలింగ్‌ స్టేషన్లు ఉంటాయన్నారు. రేషనలైజేషన్‌ తర్వాత రాష్ట్రంలో 45,917 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయన్నారు.

ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు సహకరించండి
మార్చిలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీల కోసం ఎన్నికలు జరగనున్నాయని, ఓటర్ల నమోదుకు సహకరించాలని పార్టీలను విజయానంద్‌ కోరారు. ప్రస్తుతం 30 వేల మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. డిసెంబర్‌ 31లోగా రాష్ట్రంలో అర్హత కలిగిన ఉపాధ్యాయులందరూ ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. 

మరిన్ని వార్తలు