ఆనందయ్య మందుపై నేడు తుది నివేదిక

29 May, 2021 03:44 IST|Sakshi

ఆయుష్‌ కమిషనర్‌ రాములు

సాక్షి, అమరావతి: నెల్లూరు కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైందని, సోమవారం విచారణ జరగనుందని ఆయుష్‌ కమిషనర్‌ రాములు వెల్లడించారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి పలు నివేదికలు వచ్చాయని, శనివారం తుది నివేదిక వస్తుందని తెలిపారు. నివేదికలను అధ్యయన కమిటీ చూసి మరోసారి పరిశీలిస్తుందన్నారు. డ్రగ్‌ లైసెన్స్‌ విషయంలో కమిటీ కూడా అధ్యయనం చేస్తోందన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద రాములు విలేకరులతో మాట్లాడారు. కేంద్రం సంస్థ అధ్యయన నివేదిక శనివారం వచ్చే అవకాశం ఉందన్నారు.

నివేదికతో పాటు హైకోర్టు తీర్పు వచ్చాక మందు పంపిణీపై సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అంతిమ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందుల్లేని విధంగా మందు పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారన్నారు. ఇప్పటి వరకు వచి్చన విచారణ నివేదికలు అన్నీ పాజిటివ్‌గా వచ్చాయని పేర్కొన్నారు. మందుపై క్లినికల్‌ ట్రయల్స్‌ ఇంకా ప్రారంభించలేదని చెప్పారు. ఆయుర్వేద విభాగం గుర్తింపు కోసం ఆనందయ్య దరఖాస్తు చేసుకుంటే త్వరగా ప్రాసెస్‌ చేస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు