రామతీర్థం విగ్రహాలకు తుది మెరుగులు

21 Jan, 2021 03:25 IST|Sakshi
అలిపిరిలో రూపుదిద్దుకుంటున్న శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి విగ్రహాలు

తిరుపతి ఎడ్యుకేషన్‌: విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఇటీవల దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ధ్వంసమైన శ్రీరాముని విగ్రహం స్థానంలో నూతనంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని ప్రతిమలను ప్రతిష్టించేందుకు ఆ జిల్లా దేవదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విగ్రహాల తయారీకి ఈ నెల 8న టీటీడీ ఉన్నతాధికారులను దేవదాయ శాఖ అధికారులు సంప్రదించారు.

అలిపిరిలోని టీటీడీ శిలా శిల్ప ఉత్పత్తి కేంద్రంలో ఏఈ మహేందర్‌రెడ్డి పర్యవేక్షణలో స్థపతి మునిశంకర్, మార్కింగ్‌ స్థపతి మారుతీరావు నేతృత్వంలో శిల్పులు రమేష్, నాగరాజు, సుబ్రమణ్యం ఆచారీ విగ్రహాల తయారీ పనిలో నిమగ్నమయ్యారు. మూలవిరాట్‌ తయారీకి కంచి నుంచి కృష్ణశిల(బ్లాక్‌ గ్రానైట్‌)ను తెప్పించారు. పీఠంతో కలిపి శ్రీరాముని విగ్రహం 3.6 అడుగులు, సీతా, లక్ష్మణుల విగ్రహాలు పీఠంతో కలిపి 3 అడుగులతో మలుస్తున్నారు. గురువారం సాయంత్రానికి ఈ విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకోనున్నాయి. 

మరిన్ని వార్తలు