నాలుగేళ్లుగా.. నిలకడగా!

18 Mar, 2023 04:26 IST|Sakshi

అన్ని రంగాల్లో సుస్థిరాభివృద్ధి నమోదు

బడ్జెట్‌పై చర్చలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

వ్యవసాయం, విద్య, వైద్యం, సామాజిక భద్రతకు పెద్ద పీట

కోవిడ్‌లో నగదు పంపిణీతో వేగంగా కోలుకున్న వ్యవస్థలు

గత సర్కారు తప్పులను సరిదిద్దేందుకు ఢిల్లీ వెళ్లక తప్పలేదు

పోలవరం పునరావాసంపై స్పష్టత లేకుండా నాడు ఒప్పందాలు

సాక్షి, అమరావతి: గత పాలకుల తప్పులను సరిదిద్దుతూ ఆర్భాటాలకు తావు లేకుండా అన్ని రంగాల్లో సుస్థిరాభివృద్ధి నమోదుతో ముందుకు సాగుతున్నట్లు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. సుస్థిరాభివృద్ధి కోసం వ్యవసాయం, విద్య, వైద్యం, సామాజిక భద్రత రంగాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

గత ప్రభుత్వ నిర్వాకాలతో కొండలా పేరుకుపోయిన బిల్లులను చెల్లిస్తూనే కోవిడ్‌ సంక్షోభంలో కూడా ఆర్థిక వ్యవస్థను వేగంగా గాడిలో పెట్టామన్నారు. శుక్రవారం శాసనసభలో 2023 – 24 వార్షిక బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి బుగ్గన సమాధానమిస్తూ మాట్లాడారు. 

2019 – 20లో 5.7 శాతం వృద్ధితో రూ.9.25 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్‌డీపీ 2022 – 23లో 16.22 శాతం వృద్ధితో రూ.13.17 లక్షల కోట్లకు చేరుకుంది. నాలుగేళ్ల పాలనలో రెండేళ్లు కోవిడ్‌ లాంటి సంక్షోభం ఎదురైనా ప్రభుత్వం తీసుకున్న సమర్థ నిర్ణయాలతో వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగం వేగంగా కోలుకున్నాయి. 

ఆర్థికంగా బలమైన దేశాలు కూడా సంక్షోభ సమయంలో వ్యవస్థలోకి నగదును పంపిణీ చేస్తాయి. అదే తరహాలో 2022 – 23లో అదనంగా రూ.1.83 లక్షల కోట్ల సంపదను సృష్టించగలిగాం. అప్పుల కోసం కాకుండా గత సర్కారు తప్పులను సరిదిద్దడానికే 30 దఫాలకుపైగా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. 

 రాష్ట్ర జీవనాడి పోలవరం ఆలస్యం కావడానికి ముమ్మాటికీ టీడీపీనే కారణం. పోలవరం పునరావాస సాయంపై సరైన స్పష్టత లేకుండా ఒప్పందం కుదుర్చుకుంది. అలాంటి తప్పులను ఈ ప్రభుత్వం సరిదిద్దుతోంది. 

ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా రైతులకు అడుగడుగునా ప్రభుత్వం తోడుగా నిలవడంతో రాష్ట్రంలో సాగు వ్యయం 21 శాతం తగ్గడమే కాకుండా రాబడి 23 శాతం పెరిగింది. విద్య, వైద్య రంగాల్లో చేపట్టిన విప్లవాత్మక మార్పులు రానున్న కాలంలో మంచి ఫలితాలను అందిస్తాయి. 

 గత ప్రభుత్వం కంటే ఇప్పుడు అప్పులు తక్కువగానే చేసినా విపక్షం, వాటి అనుబంధ మీడియా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయి. రాష్ట్ర విభజన నాటికి రూ.1.14 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పులు గత ప్రభుత్వ హయాంలో ఏటా సగటున 19 శాతం వృద్ధితో రూ.2.72 లక్షల కోట్లకు ఎగబాకాయి. ఇప్పుడు నాలుగేళ్ల కాలంలో అప్పులు రూ.2.72 లక్షల కోట్ల నుంచి 13.5 శాతం వృద్ధితో రూ.4.5 లక్షల కోట్లకు చేరాయి. టీడీపీ సర్కారు కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ స్థాయిలో అప్పులు చేసింది.

ఉచిత సేవలకు కాలం చెల్లిందని, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలని తాను స్వయంగా రాసుకున్న మనసులో మాట పుస్తకంలో పేర్కొన్న చంద్రబాబు ఇప్పుడు అన్నీ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేయడం విడ్డూరం. 60 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు అవినీతిపరులని, కాంట్రాక్టు విధానంలోనే ఉద్యోగాలివ్వాలని, ప్రాజెక్టులు అనవసరమని, పేదలకు ఇళ్లు ఇవ్వడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, స్థానిక సంస్థలకు నిధులివ్వాల్సిన అవసరం లేదని పుస్తకంలో రాసుకున్న చంద్రబాబు ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు